తండాల నుంచి టౌన్ల దాకా నీళ్ల గోస

తండాల నుంచి టౌన్ల దాకా నీళ్ల గోస
  • స్కీమ్​కు రూ. 40వేల కోట్లు పెట్టినా నల్లా నీళ్లు వస్తలే
  • నెత్తిన బిందెలతో కిలోమీటర్ల కొద్దీ మహిళల నడక
  • పట్టణాల్లో ట్యాంకర్ల కోసం తప్పని ఎదురుచూపులు
  • లీకేజీలు, నిర్వహణ లోపాలతో భగీరథ నీళ్లు అందుతలేవ్

రాష్ట్రంలో మిషన్​ భగీరథతో నీళ్ల గోస తీర్చినమని, నల్లాల దగ్గర బిందెలతో జనం లొల్లులు పెట్టుకునే పరిస్థితి లేదని, జలధార దుంకుతున్నదని సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​ పదే పదే చెప్పుకుంటున్నా.. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. తండాల నుంచి టౌన్ల దాకా చాలా చోట్ల భగీరథ నీళ్లు అందుతలేవు. దూప తీరక జనం అల్లాడుతున్నరు. మండే ఎండల్లో కిలోమీటర్ల దూరం బిందెలు పట్టుకొని వెళ్లి వ్యవసాయ బావుల నుంచి పల్లె జనం నీళ్లు తెచ్చుకుంటున్నరు. టౌన్లలోనైతే ట్యాంకర్లు, క్యాన్లే దిక్కయితున్నయ్​. కొన్ని పట్టణాల్లోనైతే వారం పదిరోజులకోసారి కూడా భగీరథ నీళ్లు అందుతలేవు. కరీంనగర్​లోని బోయవాడ వంటి ప్రాంతాల్లో మూడు నాలుగు నెలల నుంచి భగీరథ బందైంది. 

వెలుగు, నెట్​వర్క్: మంచినీళ్ల కోసం జనం తిప్పలు పడుతున్నారు. సర్కారు చెప్పిన గడువుదాటి మూడేండ్లయినా మిషన్​ భగీరథ నీళ్లు రాష్ట్రమంతా వస్తలేవు. ఫోర్స్​ లేక ట్యాంకులకు ఎక్కుతలేవు. లీకేజీల వల్ల చివరిదాకా పోతలేవు. అసలే ఎండాకాలం కావడంతో గ్రామాల్లో బోర్లు, బావులు అడుగంటాయి. దీంతో జనానికి మంచి నీటి కష్టాలు మొదలయ్యాయి. పల్లెల్లో వ్యవసాయబావులు, చెలిమె నీటి కోసం పొద్దున్నే మహిళలు బిందెలు నెత్తిన పెట్టుకొని పోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక పట్టణాల్లోని అనేక కాలనీల్లో ట్యాంకర్ల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు.

వారానికోసారి కూడా నిండుతలేవు

రాష్ట్రవ్యాప్తంగా  23,890 రూరల్ , 121 అర్బన్ హ్యాబిటేషన్లలో 24 గంటలు వాటర్ సప్లయ్​ చేయాలనే లక్ష్యంతో 2016లో మిషన్​భగీరథ చేపట్టారు. ఇందుకోసం భారీ మొత్తంలో రూ. 40వేల కోట్ల వరకు ఖర్చుచేశారు. 1.50 లక్షల కిలోమీటర్ల వాటర్ గ్రిడ్​లో పైపులైన్లు 95 శాతానికి పైగా పూర్తయ్యాయని గడిచిన రెండేండ్లుగా సర్కారు చెప్తున్నది. కానీ, ఫీల్డ్ లెవల్లో ఓవర్​హెడ్​ ట్యాంకులు, ఇంట్రాపైపులైన్​ పనులుపూర్తికాకపోవడంతో వేలాది గ్రామాలకు, పట్టణాలకు నీళ్లు​ అందడం లేదు. వచ్చినచోట్ల మంచిగా ఉంటంలేవని జనం తాగుతలేరు. ట్రీట్​మెంట్​ ప్లాంట్ల నుంచి తక్కువ ఫోర్స్​తో నీళ్లు వదిలితే  పట్టుమని పది కిలోమీటర్ల దూరంలోని ట్యాంకులకు కూడా ఎక్కుతలేవు. పోనీ ఎక్కువ ఫోర్స్​తో పంప్ చేద్దామంటే క్వాలిటీ లేని పైపులు పుటుక్కున పగిలిపోతున్నాయి. నిత్యం ఏదో ఒకచోట పైపులైన్​ పగిలి, లీకేజీల కారణంగా వారాల కొద్దీ నీటి సరఫరా నిలిచిపోతున్నది. వేలాది గ్రామాలలో రోజుకు రెండుసార్లు నిండాల్సిన ట్యాంకులు వారానికోసారి కూడా నిండుతలేవు. ఇన్నాళ్లూ సర్పంచులు, మున్సిపల్ ఆఫీసర్లు పాత బోర్లకు మళ్లీ మోటర్లు పెట్టి సప్లయ్​ చేస్తూ వచ్చారు. తీరా ఎండాకాలం కావడంతో బోర్లు, బావులు అడుగంటి నీళ్లు ఇవ్వలేకపోతున్నారు. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

క్యాన్​వాటర్​ కొనుక్కొని తాగుతున్నరు  

కాలనీల్లో ఇంట్రా పైపులైన్లు తరుచూ లీకై, నీళ్లు కలుషితమవుతున్నాయి. వారాలు, నెలల తరబడి రిపేర్లు చేయకపోవడంతో రంగుమారి వాసన వస్తున్నాయి. దీంతో భగీరథ నీళ్లు తాగాలంటనే జనం జంకుతున్నారు. రూ. 5 నుంచి రూ.10 పెట్టి క్యాన్​వాటర్​కొనుక్కొని తాగుతున్నారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లి పట్టణానికి వాటర్​సప్లయ్​ చేసే మెయిన్ పైప్ లైన్​కు సంప్ వద్ద రెండేండ్ల కింద లీకేజీ ఏర్పడింది. బురద నీరు సంప్​లోకి చేరుతున్నా,  అట్లనే సరఫరా చేస్తున్నారు. దీంతో ఈ నీరు తాగలేక ఆర్వో ప్లాంట్ల నుంచి జనం క్యాన్​ వాటర్​ తెచ్చుకుంటున్నారు. ఇదే అదనుగా 80 వేల జనాభా ఉన్న ఈ  ఒక్క పట్టణంలో ఏకంగా100 కు పైగా ప్రైవేట్​ వాటర్​ప్లాంట్లు నడిపిస్తున్నారు. నలుగురు సభ్యులున్న కుటుంబాలు క్యాన్​వాటర్​ కోసమే ప్రతి నెలా సగటున రూ.400 వరకు ఖర్చు పెడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం ప్రతి గ్రామంలో సగటున 2 నుంచి 5 వరకు, మున్సిపాలిటీల్లో 10 నుంచి 50 వరకు, కరీంనగర్​, వరంగల్​, ఖమ్మంలాంటి కార్పొరేషన్లలో 100కుపైగా ప్రైవేట్​వాటర్​ప్లాంట్లు నడుస్తున్నాయి. పంచాయతీల ఆధ్వర్యంలో నెలకొల్పిన ప్లాంట్లు వీటికి అదనం. ఒక్క యాదాద్రి భువనగిరి జిల్లాలో 2 వేలకు పైగా వాటర్ ప్లాంట్లు ఉన్నాయని ఆఫీసర్లు చెప్తున్నారు. అత్యంత వెనుకబడిన ఆసిఫాబాద్​ జిల్లాలోనే ఏకంగా 230 ఆర్వో ప్లాంట్లు ఉన్నాయంటే ఆర్వో వాటర్​పై ప్రజలు ఏస్థాయిలో ఆధారపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. 

మెయిన్​ పైపులైన్​కు కనెక్షన్​ ఇవ్వక..!

సిద్దిపేట జిల్లా జగదేవ్​పూర్ ​మండలం మునిగడపలో పాత ట్యాంకు కూలగొట్టి కొత్త ట్యాంక్ కట్టారు. ఐదు నెలల గడుస్తున్నా మెయిన్​పైపులైన్​ నుంచి కనెక్షన్ ఇవ్వలేదు. నెల రోజుల క్రితం తెచ్చి పెట్టిన పైపులు దుమ్ము కొట్టుకుపోతున్నాయి.  పాత ట్యాంకు ద్వారా మునిగడపతోపాటు గుబ్బడ, వంటిపల్లి, మాందాపూర్, పలుగడ్డ గ్రామాలకు వాటర్​ సప్లయ్​ జరిగేది. అధికారుల నిర్లక్ష్యం వల్ల నాలుగు గ్రామాల్లో జనం తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. సమస్య పరిష్కరించాలని మునిగడప సర్పంచ్​ రవిగౌడ్​ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నా పనులు జరగడం లేదు. 

పైపులు పగుల్తున్నయ్​

మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలో సీసీ రోడ్ల కింద వేసిన భగీరథ పైపులు భారీ వాహనాలు పోయినప్పుడల్లా పగిలిపోతున్నాయి. పలు వార్డుల్లో లీకేజీల వల్ల నీళ్లు కలుషితమవుతున్నాయి. పైపులను రిపేర్​చేయాలని ఆఫీసర్లకు మొరపెట్టుకున్నా ఇటువైపు వస్తలేరని జనం అంటున్నారు. భగీరథ వాటర్​ ప్రెజర్​ లేకపోవడంతో బోరు నీటిని ట్యాంకులకు ఎక్కించి సప్లయ్​ చేస్తున్నారు.  2, 13, 14, 24వ వార్డుల్లో వారానికి ఒకసారే నీళ్లు వస్తున్నాయి. 

చెలిమె నీళ్లే దిక్కు

ములుగు జిల్లా తిప్పాపురం పంచాయతీ పరిధిలో సీతారాంపురం పూర్తిగా కొండ ప్రాంతం. మిషన్ భగీరథ లో భాగంగా వాటర్ ట్యాంక్ నిర్మించారు. కానీ మెయిన్ పైప్ లైన్ తో లింక్​చేయకపోవడం వల్ల వాటర్​ రావట్లేదు. ఊరిలో భూగర్భ జలాలు అడుగంటడంతో అడవిలో ఉన్న చిన్న వాగు నుంచి జనం చెలిమె నీళ్లు తెచ్చుకుంటున్నారు.  

రెండు రోజులకు ఒకసారి రెండు బిందెలే

మెదక్ జిల్లా భోజ్య తండా, మాల్యా తండాలకు మిషన్ భగీరథ నీళ్లు  అందడం లేదు. రెండు రోజులకు ఒకసారి కొన్ని ఇండ్లకు మాత్రమే అది కూడా  ఒకటి, రెండు బిందెలకే  ఇచ్చి బంద్​ పెడుతున్నారు. దీంతో జనం రోజూ ఎండలో వ్యవసాయ బోర్ల వద్దకు పోయి నీళ్లు తెచ్చుకుంటున్నారు. వాళ్ల కష్టాలను చూసి చలించిన సర్పంచ్​రాజు నాయక్​ రోజూ వెయ్యి రూపాయలు ఖర్చుపెట్టి ట్యాంకర్​ ద్వారా నీళ్లు తెచ్చి సప్లయ్​ చేస్తున్నారు. ఇంత ఖర్చు భరించడం కష్టంగా ఉందని, సమస్యను పరిష్కరించాలని మండల జనరల్ బాడీ మీటింగ్ లో ఆఫీసర్లకు చెప్పినా, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ఆయన అన్నారు. 

నీటి కోసం ప్రాణాలకు తెగించి..!

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని 60 శాతం  గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్లు అందడంలేదు. వచ్చిన చోట్ల కూడా రంగు, వాసన వస్తున్నాయంటూ జనం తాగడం లేదు.  తిర్యాణి మండలం రాజా గూడ (గుండాల) పంచాయతీ పరిధిలోని అర్జుగూడ, రాజాగూడ, వాడిగూడ, దోడ్డిగూడ, చిక్లగూడ, గుడివాడ, పునగూడ (దాబా గూడ )లో 1400 మంది జనాభా ఉంది. ఈ గ్రామాలకు నేటికీ మిషన్ భగీరథ నీళ్లు అందడంలేదు. ఉన్న బోర్లు అడుగంటాయి. వాడిగూడ గ్రామంలోని బోరు వారం కింద ఎండిపోయింది. బావికి మధ్య రెండు మొద్దులు ఏర్పాటు చేసి వాటిపై నిలబడి ఓ కట్టె సాయంతో నీళ్లు తోడి తీసుకెళ్తున్నారు. కట్టెపై నుంచి కొంచెం అటూ ఇటూ జారినా ప్రాణాలకే ముప్పు. 

చేద బాయి కాడికెంచి తెచ్చుకుంటున్నరు

నిర్మల్ జిల్లాలోని నర్సాపూర్ (జి) మండలం బూరుగుపల్లి గ్రామపంచాయతీతో  పాటు అనుబంధ గ్రామాలైన సూర్యం తండా, హనుమాన్ తండాల్లో తాగునీటి  సమస్య తీవ్రంగా ఉంది. ఈ గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. వారానికోసారో, రెండుసార్లో వచ్చినా రంగు, వాసనతో తాగలేకపోతున్నామని జనం అంటున్నారు. దీంతో సూర్యం తండా, హనుమాన్ తండా వాసులు అరకిలోమీటర్​ దూరంలో ఉన్న బూరుగుపల్లిలోని చేద బాయి నుంచి రోజూ ఇట్లా బిందెలతో నీళ్లను తీసుకుపోతున్నారు. 

భగీరథ నీళ్ల కోసం అడిషనల్​ కలెక్టర్​ను అడ్డుకున్నరు

భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం రాపల్లి కోట గ్రామస్తులు ఖాళీ బిందెలతో అడిషనల్​ కలెక్టర్  టీఎస్​ దివాకర కారును సోమవారం అడ్డుకున్నారు. కొన్ని రోజులుగా గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు వస్తలేవని, తాము ఏం తాగాలంటూ ధర్నాకు దిగారు. భగీరథ నీళ్లు రాక ఊరిలో బోర్ వేసినప్పటికీ కరెంట్ కనెక్షన్ ఇవ్వలేదన్నారు. త్వరలోనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అడిషనల్​కలెక్టర్  హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. 

మళ్లీ ట్యాంకర్​ వచ్చేదాకా..!

మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని వడ్డెర కాలనీలో పరిస్థితి ఇది. పట్టణం నడిబొడ్డున ఉన్న వడ్డెర కాలనీకి మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో ప్రజలు తాగునీటికి తంటాలు పడుతున్నారు. దీంతో మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా కాలనీకి వాటర్ సప్లై చేస్తున్నారు. ప్రజలు ఇండ్ల ముందు డ్రమ్ములు పెట్టి నీళ్లు నింపుకుంటున్నారు. మళ్లీ ట్యాంకర్ వచ్చేంత వరకు ఆ కొద్దిపాటి నీళ్లనే జాగ్రత్తగా వాడుకుంటున్నారు.

మిషన్ భగీరథ నీళ్లు వస్తలేవ్​

మా ఊరిలో మిషన్ భగీరథ పైపులు వేసి ఆరు నెలలైంది. అయితే ఇప్పటివరకు మా ఇంటికి మంచి నీళ్లు వస్తలేవు. మండల కేంద్రంలో పైపులు లీకవుతున్నాయి.  నెలల తరబడి వాటికి రిపేర్లు చేయట్లేదు. మాకు మళ్లీ బోర్లు, బావులే దిక్కవుతున్నాయి. అవి అడుగంటడంతో తాగునీటికి గోసైతున్నది. 
- అజ్మీర నవీన్ నాయక్, మహాముత్తారం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా

తక్లీఫ్​ అయితున్నది

మా ఇంట్లో మగవాళ్లు పొద్దున లేవగానే డ్యూటీలకు పోతరు. నాలుగు నెలల నుంచి నల్లాలు సక్కగా వస్తలేవు. తక్లీఫ్​ అయితున్నది. మేము ఆడవాళ్లం ఎక్కడికి పోయి నీళ్లు తెచ్చుకోవాలే. ఎవరూ పట్టించుకోవట్లే. 
- వంగాల మంజుల, బోయవాడ, కరీంనగర్  

ఆఫీసర్లు పట్టించుకుంటలేరు. 

రాజగూడ పరిధిలోని ఏడుగ్రామాలకు భగీరథ వాటర్​ వస్తలేవు. ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకుంటలేరు.  బోర్లు, బావులు ఎండిపోయి పబ్లిక్​ మస్తు ఇబ్బందులు పడుతున్నరు. 
- కోట్నక జంగుబాయి, సర్పంచ్   రాజాగూడ (గుండాల ), ఆసిఫాబాద్ జిల్లా