కరోనా భయం: పోర్టబుల్ పూల్స్‌లో సేదతీరుతున్న స్పెయిన్ వాసులు

కరోనా భయం: పోర్టబుల్ పూల్స్‌లో సేదతీరుతున్న స్పెయిన్ వాసులు

మ్యాడ్రిడ్: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా భయపెడుతుందో తెలిసిందే. చాలా దేశాల్లో ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు వెళ్లడం లేదంటేనే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో కూడా ప్రభుత్వం ప​లు రంగాలను ఒక్కొక్కటిగా అన్‌లాక్ చేసుకుంటూ వస్తోంది. కానీ స్విమ్మింగ్ పూల్స్‌కు ఇప్పుడప్పట్లో అనుమతి లభించేలా లేదు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న స్పెయిన్ దేశంలోనూ ఇదే పరిస్థితి. స్పెయిన్‌లో కరోనా విజృంభణకు భయపడి ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇప్పుడు ఆ దేశంలో ఎండాకాలం. దీంతో ఎండలు మండిపోతున్నాయి. అయితే వైరస్ భయంతో ప్రజలు సమ్మర్ వెకేషన్స్‌కు బయటకు వెళ్లలేకపోతున్నారు. దీంతో చల్లదనం కోసం అక్కడి ప్రజలు మంచి ఆలోచన చేశారు. పోర్టబుల్ పూల్స్‌ను తయారు కొనుగోలు చేస్తున్నారు. టెర్రస్, కమ్యూనల్ డాబాలతోపాటు వీధుల్లోనూ ఈ పూల్స్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ ఏడాది మేలో లాక్‌డౌన్ కారణంగా స్విమ్మింగ్ పూల్స్‌కు వెళ్లే చాన్స్ లేకపోవడంతో స్పెయిన్‌లో పోర్టబుల్‌ పూల్స్‌ సేల్స్ బాగా పెరిగాయి.

కరోనా తగ్గకపోవడంతో పాటు ప్రజలు ఇళ్లకే పరిమితమవడంతో జూన్‌ నెలకు వచ్చేసరికి స్పెయిన్‌లోని ఆన్‌లైన్ వెబ్‌సైట్స్‌, షాపింగ్ మాల్స్‌లోని పోర్టబల్ పూల్స్‌ అన్నీ అమ్ముడయిపోయాయి. ‘అది చూడటానికి బాగుంటుంది. పబ్లిక్ పూల్స్, ప్రైవేట్ క్లబ్స్‌ అన్నీ మూసేసి ఉన్నాయి. మిగిలిన సమ్మర్ ప్లాన్స్‌ కూడా గాలిలో కలిసిపోయాయి’ అని స్పెయిన్‌లోని సెవెల్లీకి చెందిన జేవియర్ సాలెడో అనే కన్‌స్ట్రక్షన్ మేనేజర్ పోర్టబుల్ పూల్స్ గురించి చెప్పాడు. ‘ఈ పూల్స్‌ను పెట్టడానికి మా వీధి తప్ప నాకింకో చోటు లేదు. ఈ ప్రమాదకరమైన పరిస్థితుల్లో బతకడం అతి భయంకరంగా ఉంది’ అని ఇసాబెల్‌ అనే స్పెయిన్‌లోని సెవెల్లీకి చెందిన ఓ నిరుపేద వ్యక్తి చెప్పాడు. స్పెయిన్‌లో కరోనా కేసుల సంఖ్య 3.77 లక్షలు దాటింది. మహమ్మారి బారిన పడి ఆ దేశంలో 29 వేల మంది చనిపోయారు.