కోతుల దెబ్బకి ఎలుగుబంటి వేషాల్లో ఊరి జనం

కోతుల దెబ్బకి ఎలుగుబంటి వేషాల్లో ఊరి జనం

ఎక్కడో అడవుల్లో ఉండాల్సిన కోతులు వచ్చి ఊరి మీదపడుతున్నాయి. దాదాపు 2 వేల కోతుల మూక ఊరిలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. ఇళ్లలో వస్తువుల్ని చిందర వందరగా తోసిపడేస్తున్నాయి. చిన్నపిల్లలపై దాడి చేస్తున్నాయి. వాటి బెడద తట్టుకోలేక అటవీ శాఖ అధికారులను ఆశ్రయిస్తే వేల కోతుల్ని పట్టుకుని అడవుల్లో వదలడం తమ వల్ల కాదని చేతులెత్తేశారు. అందుకు కావాల్సిన డబ్బు తమ దగ్గర లేదని చెప్పి చేతులు దులుపుకున్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని ఊరి జనం ఓ వింత ఐడియా ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. రోజూ ఊరిలో ఎలుగుబంటి వేషం వేసుకుని కోతులను బెదరగొడుతున్నారు. యూపీలోని షాజహాన్పూర్ జిల్లా సింకందర్పూర్ గ్రామ ప్రజలు కోతుల దెబ్బకు ఇలా జంతువు వేషంలో తిరుగుతున్నారు.

ఐడియా పని చేస్తోంది

గతంలో రోజూ ఊరి మీద పడి కోతులు నానా గందరగోళం సృష్టించేవని, పిల్లల చేతిలో ఆహార పదార్థాలు లాక్కుని గాయపరిచేవని చెప్పారు సికందర్పూర్ గ్రామ పెద్ద  రామ్ లలిత్ వర్మ. కొద్ది రోజుల క్రితం తన బంధువు ఒకరు ఈ ఎలుగుబంటి వేషం ఐడియా ఇచ్చాడని, ఇది బాగానే పని చేస్తోందని చెప్పారాయన. ఊరిలో అందరం తలా కొంత చందా వేసుకుని ఓ మేకప్ ఆర్టిస్ట్ దగ్గర రూ.5100 పెట్టి మూడు ఎలుగుబంటి సూట్లు తెచ్చామని తెలిపారు. వంతుల వారీగా రోజూ ముగ్గురు చొప్పున ఆ సూట్లు వేసుకుని ఊరంతా తిరుగుతున్నట్లు చెప్పారు. ఇప్పుడు తమ ఊరికి కోతుల రాక బాగా తగ్గిందని, వచ్చినవి కూడా బెదిరి వెళ్లిపోతున్నాయని తెలిపారు.

మిగతా ఊర్లకీ ఇదే సలహా ఇస్తాం

కోతులను పట్టుకుని అడవుల్లో వదలాల్సిన అటవీ శాఖ అధికారులు చేతులెత్తేశారు. దీనిపై మీడియా ప్రశ్నించగా తమ వద్ద అందుకు తగ్గ ఫండ్స్ లేవని చెప్పారు షాజహాన్పూర్ సబ్ డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ ఎంఎన్ సింగ్. ఏవైనా ఎన్జీవోలు ముందుకొస్తే పర్మిషన్ ఇవ్వడం తప్ప ఏం చేయలేమని చెబుతున్నారాయన. అయితే త్వరలో తాను సికందర్పూర్ గ్రామాన్ని సందర్శిస్తానని, నిజం అక్కడ ఈ ఎలుగుబంటి సూట్ ఐడియా మంచి ఫలితం ఇస్తుంటే మిగతా ఊర్లలోనూ ఇదే ఐడియా ఫాలో అవ్వాలని సలహా ఇస్తామని చెప్పారు.