
సమ్మయ్యనగర్లో యూజీడీ పనులతో ధ్వంసమైన తాగునీటి పైపులైన్
ఆరు నెలలుగా నీళ్ల కోసం జనం ఇబ్బందులు
ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిపెట్టని లీడర్లు, ఆఫీసర్లు
నత్తనడకన సాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు
హనుమకొండ, వెలుగు: వరంగల్నగరంలో వానాకాలంలో కూడా తాగునీటికి గోస తప్పడం లేదు. హనుమకొండ సమ్మయ్యనగర్ లో స్మార్ట్ సిటీ ఫండ్స్ తో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ(యూజీడీ) పనుల్లో ప్రధాన తాగునీటి పైపులైన్ దెబ్బతింది. ట్యాంకర్ల ద్వారానైనా నీటిని అందించాల్సిన లీడర్లు, ఆఫీసర్లు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో కనీస అవసరాలకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఆరు నెలలుగా ఇదే పరిస్థితి. యూజీడీ పనులు పూర్తయితే తప్ప తాగునీటి పైపులైన్ పునరుద్ధరించే పరిస్థితులు కనిపించడం లేదు. యూజీడీ పనులే నత్తనడకన సాగుతుండటంతో నీళ్ల కోసం ఇంకెన్నాళ్లు ఇబ్బందులు పడాల్సి వస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
వర్క్స్ చాలా స్లో...
రెండేండ్ల కిందట వచ్చిన వరదలు సమ్మయ్యనగర్, అమరావతినగర్, టీవీ టవర్కాలనీ... ఏరియాలను ముంచెత్తగా.. ముంపు నివారణ కోసం ఆఫీసర్లు అండర్గ్రౌండ్డ్రైనేజీ ప్రాజెక్ట్ డిజైన్చేశారు. స్మార్ట్ సిటీ ఫండ్స్ రూ.54 కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ ఏడాది ఫిబ్రవరి మూడో వారంలో ఇంజినీర్స్కాలనీ వద్ద పనులు స్టార్ట్ చేశారు. సమ్మయ్యనగర్ఊర చెరువు నుంచి ఇంజినీర్స్కాలనీ ప్రెసిడెన్సీ స్కూల్ వరకు 1.4 కి.మీ మేర పనులు చేపట్టి మే 31లో కంప్లీట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ప్రభుత్వం నుంచి పర్మిషన్స్లేటవడంతో పనులు కూడా లేటుగా స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం వర్షాలు కూడా మొదలవడంతో మూడు నెలల్లో పూర్తి చేస్తామన్న పనులు ఆరు నెలలైనా కంప్లీట్ కాలేదు. దీంతో సమ్మయ్యనగర్, చుట్టుపక్కల కాలనీవాసులకు తాగునీటితోపాటు బురదతో ఇబ్బందులు పడుతున్నారు.
ఆరు నెలలుగా నీళ్లు బంద్
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల్లో భాగంగా సమ్మయ్యనగర్ తులసీ బార్ఏరియా నుంచి ప్రెసిడెన్సీ స్కూల్ వరకున్న రోడ్డును తవ్వేశారు. ఈ ఏరియాకు వచ్చే మెయిన్ తాగునీటి పైపులైన్ ను తొలగించారు. అప్పటినుంచి సమ్మయ్యనగర్, ఇంజినీర్స్కాలనీలకు తాగునీటి సప్లై నిలిచిపోయింది. ట్యాంకర్ల ద్వారా వాటర్ సప్లై చేస్తామని చెబుతున్నా వారంలో ఒకట్రెండు సార్లు మినహా.. ఆ తర్వాత ట్యాంకర్లు కనిపించడం లేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు. వాస్తవానికి సమ్మయ్యనగర్కు ఇటు అమరావతినగర్, కుడా కాలనీ వైపు నుంచి టెంపరరీ గా పైపులైన్ పునరుద్ధరిస్తే సమస్య తీరిపోయే అవకాశం ఉంది. కానీ స్థానిక కార్పొరేటర్లు, గ్రేటర్ ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. రోజుల తరబడి నీళ్లు రాకపోవడం, సమస్యను విన్నవించినా పట్టించుకోకపోవడంతో సమ్మయ్యనగర్వాసులు తరచూ ఆందోళనలకు దిగుతున్నారు. ఖాళీ బిందెలు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఆందోళనలు చేసినప్పుడు ఒకట్రెండు రోజులు రెగ్యులర్గా ట్యాంకర్లు పంపించి ఆ తర్వాత లైట్ తీసుకుంటున్నారని స్థానికులు వాపోతున్నారు.
నీళ్ల కోసం అరిగోస పడుతున్నం...
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులతో సమ్మయ్యనగర్, ఇంజినీర్స్ కాలనీతోపాటు చుట్టుపక్కల ఏరియాలకు తాగునీటి సప్లై నిలిచిపోయింది. దీంతో నీళ్లకోసం అరిగోస పడుతున్నం. వెనుక కాలనీల నుంచి టెంపరరీగానైనా ఏర్పాట్లు చేయాల్సిన లీడర్లు, ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. ట్యాంకర్లు కూడా సరిగా రావడం లేదు.
- వాంకుడోతు వీరన్న, సమ్మయ్యనగర్