వామ్మో LRS . .లక్షలకు లక్షలు ఏడతేవాలె.. ఎట్ల కట్టాలె

వామ్మో LRS . .లక్షలకు లక్షలు ఏడతేవాలె.. ఎట్ల కట్టాలె
  • బేసిక్​చార్జీలు+ 25 శాతం ఎక్స్​ట్రా ఫీజు+ ప్లాట్​
    వాల్యూలో 14 శాతం.. ఇదేం మోత?
  • పైగా రోడ్డు, సెట్​బ్యాక్​ కోసం జాగాలో కోత
  • అక్రమ లేఔట్లు వేస్తుంటే సర్కారు ఎందుకు పట్టించుకోలే?
  • పర్మిషన్లు ఎట్లా ఇచ్చారు, రిజిస్ట్రేషన్లు ఎట్లా చేశారు?
  • రిజిస్ట్రేషన్లు, ఇంటి నిర్మాణ పర్మిషన్లు ఆపుతమనుడు ఏంది?
  • పెద్ద సిటీల నుంచి తండాల దాకా ఇదే గోస

హైదరాబాద్, వెలుగు:ఖజానా నింపుకొనేందుకు రాష్ట్ర సర్కారు తెచ్చిన ఎల్ఆర్ఎస్  స్కీం జనంలో ఆందోళన రేపుతోంది. ఎప్పుడో కొని పెట్టుకున్న జాగాలకు ఇప్పుడు లక్షలకు లక్షలు చార్జీలు కట్టాలనడం ఏమిటని ఆవేదన వ్యక్తమవుతోంది. ఇప్పటికే అన్ని పర్మిషన్లు, ప్రాపర్టీ, కరెంట్, వాటర్ బిల్లులు కడ్తున్న వాటిని అక్రమ లేఔట్లని ఎలా అంటారని ప్లాట్ల ఓనర్లు వాపోతున్నారు. ముందు వాటికి ఎలా పర్మిషన్లు ఇచ్చారని, లేఔట్​ ప్రకారం లేని వాటికి రిజిస్ట్రేషన్లు ఎందుకు చేశారని నిలదీస్తున్నారు. ఎలాంటి టైం పరిమితితో సంబంధం లేకుండా వారసత్వంగా వచ్చిన జాగాలకు కూడా ఎల్ఆర్ఎస్ కట్టాలనడం ఏమిటని మండిపడుతున్నారు. ఎల్ఆర్ఎస్​ లేకుంటే రిజిస్ట్రేషన్లు చేయవద్దని, ఇంటి నిర్మాణాలకు పర్మిషన్​ ఇవ్వొద్దని నిర్ణయించడం దారుణమని అంటున్నారు. కరోనా కష్టకాలంలో ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి బతుకు వెల్లదీయడమే కష్టంగా ఉందని.. ఇలాంటి పరిస్థితుల్లో ఎల్ఆర్ఎస్​ చార్జీలు ఎట్లా కట్టాలని ప్రశ్నిస్తున్నారు. ఇదే చివరి చాన్స్​ అంటూ మెడపై కత్తిపెట్టి డబ్బులు వసూలు చేసినట్టుగా ఉందని వాపోతున్నారు. పేద, మిడిల్​క్లాస్​ వాళ్లను దృష్టిలో పెట్టుకుని చార్జీలు తగ్గించాలని డిమాండ్​ చేస్తున్నారు.

రాష్ట్రంలో కొత్తగా మున్సిపల్​ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను ఏర్పాటుచేసిన సర్కారు.. వాటిల్లో వందలాది గ్రామాలను విలీనం చేసింది. మున్సిపాలిటీ పరిధిలోకి వెళ్తే పన్నుల భారం పెరుగుతుందని జనం ఆందోళన చేసినా బలవంతంగా కలిపేశారు. సెమీ అర్బన్ గా ఉన్న ఈ గ్రామాల్లో వేల ఎకరాల వ్యవసాయ భూములు నివాస స్థలాలుగా మారిపోయాయి. అనధికార లేఔట్లు వెలిశాయి. టౌన్లలో లక్షలాది రూపాయలు పెట్టి స్థలాలు కొనలేని పేద, మధ్య తరగతి జనం.. శివారు గ్రామాల్లో కొనుక్కున్నారు. మరికొందరు గుంట, రెండు గుంటలు వ్యవసాయ భూమి కొని ఇండ్లు కట్టుకున్నారు. గ్రేటర్‌‌ హైదరాబాద్​ చుట్టూ ఉన్న మున్సిపాలిటీల్లో ఇలాంటి ప్లాట్లు, ఇండ్లు లక్షల్లో ఉన్నాయి. ఇప్పుడు వాటన్నింటికీ ఎల్ఆర్ఎస్​ తప్పనిసరి చేయడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక ఎప్పుడో కొన్న జాగాలకూ ఎల్ఆర్ఎస్​ కట్టాల్సి రావడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పుటికే ఏడెనిమిది సార్లు చేతులు మారడం, రిజిస్ట్రేషన్​ చేసినప్పుడల్లా స్టాంపు డ్యూటీ చెల్లించడంతో సర్కారుకు భారీగానే ఆదాయం వచ్చిందని.. ఇప్పుడు మళ్లీ రెగ్యులరైజేషన్​ చార్జీలు ఏమిటని ఓనర్లు ప్రశ్నిస్తున్నారు.

మున్సిపాలిటీల్లోనే మూడు లక్షల ప్లాట్లు

మున్సిపల్ అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో అనధికార లేఔట్లపై స్పెషల్ డ్రైవ్​ నిర్వహించారు. 22 వేల 76 ఎకరాల్లో 3,892 అనధికార లేఔట్లు ఉన్నాయని.. వాటిలో 2 లక్షల 81 వేల 171 ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. ఇవన్నీ కూడా గత ఐదారేండ్లలో ఏర్పాటు చేసిన లేఔట్లే. పది, ఇరవై ఏండ్లలో ఏర్పాటు చేసిన అనధికార లేఔట్లలో చాలా వరకు ఇండ్లు కట్టేశారు. కొన్ని ఖాళీగా ఉన్నాయి. ఇలాంటివి మరో లక్షకుపైగా ఉంటాయని అంచనా.

జనగామకు చెందిన కిరణ్​ ఈమధ్య నాన్​ లేఔట్​ వెంచర్​లో రూ. 2 లక్షలు పెట్టి 200 గజాల ప్లాటు కొన్నడు. ఇప్పుడు సర్కారు ప్రకటించిన ఎల్ఆర్ఎస్​ చార్జీల లెక్క చూసుకొని బిత్తరపోతున్నడు. ఆయన కొన్న 200 గజాలను స్క్వేర్​ మీటర్లలోకి మార్చితే 167 చదరపు మీటర్లు అవుతుంది. దీనికి ఎల్ఆర్ఎస్​ బేసిక్​ చార్జీల కింద చదరపు మీటర్​కు రూ.400 లెక్కన రూ.66,800 కట్టాలె. ఆ ప్లాట్ ఉన్న ఏరియాలో రిజిస్ట్రేషన్​ వ్యాల్యూ చదరపు గజానికి రూ.3వేల లోపు ఉంది. ఈ లెక్కన బేసిక్​ రెగ్యులరైజేషన్​ చార్జీల్లో మరో 25 శాతం (రూ.16,700) పెనాల్టీగా చెల్లించాలి. ఇంతటితో అయిపోలేదు. ఆ లేఔట్లో పార్కు, కమ్యూనిటీ అవసరాలకు 10 శాతం ఓపెన్​ స్పేస్​ వదలలేదు. దీనికి పెనాల్టీగా ప్లాట్​ వాల్యూ (రూ.6 లక్షలు)లో 14 శాతం అదనంగా (84 వేలు) కట్టాలి. అంటే 200 గజాల ప్లాటుకు 66,800 + 16,700 + 84,000 కలిపి రూ.లక్షా 67 వేల 500 చెల్లించాలని తేలింది. రెండు లక్షలకు కొన్న ప్లాట్​కు ఇప్పుడు మరో లక్షన్నరకుపైగా అప్పు చేసి ఎల్ఆర్ఎస్​ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గిట్ల పైసలు గుంజుడు కరెక్టు కాదు- మోకిడి లక్ష్మి, జనగామ

జీపీ పర్మిషన్ ఉన్నా.. ఎల్ఆర్ఎస్ కట్టాలట

ఐదేళ్ల కింద తండా నుంచి వచ్చి కిలోమీటరు దూరంలో రోడ్డు పక్కన వ్యవసాయ భూమిలో 300 గజాల్లో ఇల్లు కట్టుకున్నం. అప్పట్లో గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకున్నం. ఏటా ఇంటి పన్ను కడుతున్నం. ఇప్పుడు కొత్తగా ఎల్ఆర్ఎస్ పేరు మీద లక్షన్నర దాకా కట్టాలంటున్నరు. నాలా చార్జీలు కట్టాలంటున్నరు. ఇన్ని డబ్బులు ఎట్ల కట్టేది?

– భూక్య హోంజి, లోక్య తండా, నర్సింహులపేట, మహబూబాబాద్

రూ.2 వేల పెన్షన్​తో ఎట్లా కట్టాలె?

సూర్యాపేటకు చెందిన సుదర్శన్ ఆర్టీసీ రిటైర్డ్​ఉద్యోగి. తన పీఎఫ్ అమౌంట్ తో గజం రూ.1,400 లెక్కన 240 గజాలు కొన్నారు. ఎల్ఆర్ఎస్ ఉంటేనే అమ్ముకోవడానికైనా, ఇల్లు కట్టుకోవ డానికైనా పర్మిషన్​ ఇస్తామన్న సర్కారు నిర్ణయంతో రందిలో పడ్డారు. నెలకు రూ.2 వేలు పింఛన్ వచ్చే తాను ఇప్పుడేం చేయాలని, ఎల్ఆర్ఎస్​ కోసం లక్ష రూపాయలకు పైగా కట్టాలంటే ఎక్కడి నుంచి తేవాలని మనాది పడుతున్నరు.

ఐదేండ్ల కింది ఇంటికి ఇప్పుడు గోడలు కొలుస్తున్నరు

మాది వనపర్తి జిల్లా అగ్రహారం. కొత్తకోట మున్సిపాలిటీలోని వీవర్స్ కాలనీ దగ్గర ప్లాటు కొని ఐదేండ్ల కింద ఇల్లు కట్టుకున్నం. ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్లు వచ్చి ఇల్లు గోడలు కొలుస్తున్నరు. ఎల్ఆర్ఎస్ కట్టాలని, లక్ష రూపాయలు అయితదని అంటున్నరు. ఇల్లు కోసం చేసిన అప్పే తీరట్లేదు ట్యాక్స్ ఎట్ల కట్టాలె. కూలినాలి చేసుకునే మాలాంటి వాళ్లం ఇంతింత సొమ్ము ఎట్లా కట్టాలె?

‑ జయమ్మ, వీవర్స్ కాలనీ, కొత్తకోటపావు వంతు జాగా పోతోంది

ఖమ్మంకు చెందిన చావా అనిల్ ఐదేండ్ల కింద 200 గజాల ప్లాట్ కొన్నారు. దానికి రెండు వైపులా 20 ఫీట్ల రోడ్డు ఉంది. ఇప్పుడు ఎల్​ఆర్​ఎస్​లోని 30 ఫీట్ల రూల్స్​తో రెండు వైపులా కలిపి 50 గజాలు పోతోంది. దీనికి లెక్కకడితే  ఐదు లక్షలు నష్టం వస్తోంది. మిగతా 150 గజాలకు ఎల్ఆర్ఎస్​ చార్జీలు రూ. లక్ష అయితుంది. పదిహేనేళ్లుగా జమ చేసిన డబ్బుతో కొన్న ప్లాట్​లో పావు వంతు పోవడమే గాక.. ఎదురు డబ్బులు కట్టాల్సి వస్తోందని అంటున్నారు.

ఎల్ఆర్ఎస్ వెనుక పొలిటికల్​ లీడర్ల హస్తం

ఎల్ఆర్ఎస్ తప్పనిసరి చేస్తూ జనం డబ్బును లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వేలాది చెరువులు, కుంటల ఎఫ్​టీఎల్​ నిర్ధారణ జరగలేదు. అవేవీ లేకుండానే చెరువులు, కుంటల వెంట ఉన్న స్థలాలను ఎట్ల రెగ్యులరైజ్​చేస్తారో అర్థం కావడం లేదు. ల్యాండ్ యూసేజ్​ను మార్చాల్సి వస్తే.. లేఔట్​ ప్లాన్​ కు బదులు మాస్టర్​ ప్లాన్​ నే మార్చేలా కాంపొనెంట్ అథారిటీ అధికారం ఇచ్చారంటే.. దీని వెనుక నాయకుల హస్తం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

– పుల్లూరి సుధాకర్,  ఫోరం ఫర్​ బెటర్ వరంగల్

పాత వాటికే దిక్కులేదు.. కొత్తవి ఎప్పుడిస్తరు?

ఏడు జిల్లాల్లో విస్తరించిన హెచ్ఎండీఏ (హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్​మెంట్​ అథారిటీ) పరిధిలో గతంలో ఎల్ఆర్ఎస్ ప్రవేశపెట్టారు. పెద్ద సంఖ్యలో వెంచర్లు, ప్లాట్ల కోసం ఓనర్లు అప్లికేషన్​ పెట్టుకున్నారు. ఫీజులన్నీ చెల్లించినా ఇంకా పూర్తిస్థాయి అనుమతులు రాలేదు. రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల దాకా ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టిన ప్లాట్ల ఓనర్లు ఇబ్బందిపడుతున్నారు. డాక్యుమెంట్లు లేవని, జోన్ మారిందని, ఎఫ్టీఎల్, ప్రభుత్వ భూములు కావని ఇచ్చే ఎన్ఓసీల కోసం రెవెన్యూ, ఇరిగేషన్ ఆఫీసుల చుట్టూ తిరిగి ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఆర్ఎస్​ ప్రకటించారు. మరి ఎప్పటికి పూర్తిస్థాయి అనుమతులు ఇస్తారన్నది సర్కారు స్పష్టంగా పేర్కొనకపోవడంతో రియల్టర్లు, జనంలో ఆందోళన నెలకొంది.

14 శాతం అదనంగా కడ్తే ఓపెన్ స్పేస్ చూపుతరా?

సర్కారు ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం ఎల్ఆర్ఎస్ చార్జీలు వసూలు చేస్తున్నట్లు జీవోలో పేర్కొంది. కానీ ఇందులో ప్రణాళిక లేదు. డబ్బుల వసూళ్లే లక్ష్యంగా ఉంది. పార్కులు, ఉమ్మడి అవసరాలకు ఓపెన్​ స్పేస్​ లేని లేఔట్లలోని ప్లాట్ల ఓనర్ల నుంచి అదనంగా 14 శాతం సొమ్ము వసూలు చేస్తున్నారు. మరి ఆ ఏరియాలో నిజంగా ఓపెన్​ స్పేస్​ ఏర్పాటు చేస్తారా? అలా ఒక్క పార్కును కూడా ఏర్పాటు చేసిన చరిత్ర ప్రభుత్వానికి లేదు.

– ఎం.శ్రీనివాస్​, సీపీఎం హైదరాబాద్​ నగర కార్యదర్శి