జనం చూపు మావైపే..60 శాతం మంది మద్దతు మాకే : కేంద్రమంత్రి కిషన్రెడ్డి

జనం చూపు మావైపే..60 శాతం మంది మద్దతు మాకే : కేంద్రమంత్రి కిషన్రెడ్డి
  • వీ6 ‘లీడర్స్‌ టైమ్‌’లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
  • 60 శాతం మంది మద్దతు మాకే ఉంది 
  • కేసీఆర్‌‌ను ఫామ్‌హౌస్‌కే పరిమితం చేస్తరు
  • ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్నం
  • రాష్ట్ర అధ్యక్షుడి తొలగింపు పార్టీ అంతర్గత వ్యవహారం
  • లిక్కర్ కేసులో కవిత స్టే తెచ్చుకున్నరు
  • కడుపు కట్టుకుని పని చేస్తే కాళేశ్వరం ఎందుకు కుంగింది?

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లు బీజేపీకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బీసీ సీఎం, ఎస్సీ వర్గీకరణ ప్రకటనలకు జనంలో మంచి స్పందన వస్తున్నదని చెప్పారు. బీసీ సీఎం, ఎస్సీ సీఎం అని ఎందుకు మిగతా పార్టీలు ప్రకటించటం లేదని ప్రశ్నించారు. ఉత్తర తెలంగాణలో తాము బలంగా ఉన్నామని, వచ్చే 15 రోజులు ప్రచారం చాలా కీలకమని ఆయన అన్నారు. ఇంకా వివిధ అంశాలపై వీ6 నిర్వహించిన ‘లీడర్స్‌ టైమ్‌’లో కిషన్ రెడ్డి మాట్లాడారు.

ప్రశ్న: ప్రచారం ఎలా జరుగుతున్నది? 15 రోజులు మాత్రమే టైమ్ ఉంది.

కిషన్‌రెడ్డి: తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. జనంలో బీజేపీపై మంచి సానుకూలత ఉంది. బీజేపీ అభ్యర్థుల నామినేషన్ టైమ్‌లో యూత్ నుంచి అనూహ్య స్పందన వచ్చింది. 60 శాతం ప్రజలు మాకు మద్దతు తెలుపుతున్నారు. నామినేషన్ల విత్ డ్రా అయ్యాక ప్రచారాన్ని ఉధృతం చేస్తాం.

అన్నీ చేసినమని బీఆర్ఎస్, 6 గ్యారంటీలు అని కాంగ్రెస్ చెబుతున్నాయి. బీజేపీ ఏం చెబుతుంది?

బీఆర్ఎస్ ఏది చేసినా.. కొడుకు, అల్లుడు, బిడ్డ కోసమే చేసింది. ఇప్పుడు ప్రజల కోసం చేస్తామని అంటున్నారు. కర్నాటకలో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు అమలు కావట్లేదు. అమలు చేయలేకపోతున్నం, క్షమించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు రోడ్ల మీదకు వచ్చి చెబుతున్నరు. ఆర్థిక వ్యవస్థను బీఆర్ఎస్ నాశనం చేసింది. ఉద్యోగులకు జీతాలు లేట్ గా ఇస్తున్నది. మద్యంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నది. ఓఆర్ఆర్​ను, ప్రభుత్వ భూములను అమ్మి నడుపుతున్నది. ఈ పరిస్థితుల నుంచి బయట పడాలంటే డబుల్ ఇంజన్ సర్కారు రావాలి. బీజేపీ అధికారంలోకి రాకపోతే చాలా నష్టం జరుగుతుంది.

గుజరాత్‌లో లేని డెవలప్‌మెంట్ ఇక్కడ జరుగుతు న్నదని అధికార పార్టీ నేతలు చెబుతున్నరు?

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే వండర్, ఇంజినీరింగ్ మార్వెల్ అని ప్రచారం చేశారు. రూ.40 వేల కోట్ల కరెంట్ బిల్లులు కట్టాలి. వంద ఆదాయం ఉంటే 300 అప్పులు తెస్తున్నరు. ధనిక రాష్ర్టాన్ని అప్పులు రాష్ట్రంగా చేస్తున్నరు. రాష్ట్ర పరిస్థితి కష్టంగా ఉంది. గాడిన పెట్టకపోతే చాలా ఇబ్బంది పడుతాం.

కడుపు కట్టుకొని పనిచేసినమని, ఇంత కంటే నిబద్ధత ఏంటని అధికార పార్టీ వాళ్లు అంటున్నరు?

ఎవరి కోసం పనిచేశారు? కుటుంబం కోసం ఫామ్‌ హౌస్‌ కోసం పని చేశారు. మీ ఫామ్‌హౌస్‌కే నీళ్లు వచ్చినయి.. కడుపు కట్టుకొని పనిచేస్తే కాళేశ్వరం డ్యామేజ్ ఎందుకు అయింది.. ఇంజనీర్లను తిట్టి, ప్రాజె క్ట్ అంచనా వ్యయాన్ని పెంచి నిర్మించారు. ఆయన కుటుంబం, ఆయన పేరు కోసం ప్రాజెక్టు నిర్మించారు.

రాష్ట్ర పర్యటనకు ప్రధాని మోదీ వచ్చినప్పుడు కాళేశ్వరం గురించి ఎందుకు మాట్లాడట్లేదు?

ప్రధాని అన్నీ మాట్లాడుతారు. ఎన్నికలకు 15 రోజులు ఉంది. ప్రాజెక్టు డ్యామేజ్ కాగానే మా పార్టీ నుంచి ఈటల తొలిసారిగా వెళ్లారు. నేను, లక్ష్మణ్ వెళ్లాం.  ప్రాజెక్టులు జాతీయ ప్రాపర్టీ. 

ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం ఎన్నో అనుమతులు ఇస్తుంది కదా..?

ప్రాజెక్టు కడతామంటే అనుమతుల కోసం అన్ని వివరాలను కేంద్రంలోని పలు డిపార్ట్ మెంట్లు అడుగుతాయి. అంతే తప్ప సిమెంట్, ఇసుక వివరాలు అడగరు. మేం అనుమతులు ఇచ్చినం. బడ్జెట్ గురించి అడగం.

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, ఢిల్లీ గులాములు అంటూ అధికార పార్టీ వాళ్లు అంటున్నరు?

రాజ్యాంగం రాసిన అంబేద్కర్‌‌కు తెలియదా ఢిల్లీలో ఉన్నది ప్రజాస్వామ్య పాలన అని. గులాములు వేరు.. ప్రజాస్వామ్య పాలన వేరు. రాష్ట్రంలో కుటుంబ పాల న సాగుతున్నది. ప్రజలు పదేండ్ల పాలన చూశారు. ఇప్పుడు ఓడించాలని చూస్తున్నరు.  

అవినీతిపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవట్లే?

అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారు. సీబీఐ దర్యాప్తు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కావాలి. చట్టం చేశారు. కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలి. హైకోర్టులో పిటిషన్లు ఉన్నాయి. వాటికి ఆధారాలు ఇస్తే హైకోర్టు ఆదేశించవచ్చు.

కవిత అరెస్టుపై మీ పార్టీ లీడర్లు  మాట్లాడారు కదా, ఏమైంది?

కొంత మంది మాట్లాడారు. విచారణ జరుగుతుందని చెప్పారు. ఆధారాలు దొరికితే ఏజెన్సీలు చర్యలు తీసుకుంటాయి. అవినీతిని సహించనని ప్రధాని అంటున్నారు. బీఆర్ఎస్ అవినీతిపై చర్యలు తీసుకుంటాం. కేసీఆర్ అవినీతిని కక్కిస్తామని చెప్పినం. కవిత సుప్రీం నుంచి స్టే తెచ్చుకున్నారు. ఈనెల 28 వరకు టైమ్ ఉందనుకుంటా. 

బీసీ సీఎం, ఎస్సీ వర్గీకరణ బీజేపీకి కలిసొస్తుందా? లేట్ గా ప్రకటించారా? పార్టీ గెలవదు కాబట్టే బీసీ సీఎం అని ప్రకటన చేశారా?

బీసీని సీఎం చేస్తామని చెప్పే దమ్ము కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ఉందా? దేశంలోనే పెద్ద పార్టీ బీజేపీ. బీసీ లీడర్ ప్రధాని అయ్యారు. ఇంకా ముందు ప్రకటిస్తే మాకు మేలు జరిగేది. రాష్ర్టంలో బీసీ సీఎం అంశంపై ఎంతో చర్చ జరుగుతున్నది. 2014లో దళిత సీఎం అని ప్రకటించారు. ఇప్పుడైనా చెప్పొచ్చు కదా దళిత సీఎం అని. దమ్ముంటే చెప్పండి.

రాష్ట్రపతిని పార్లమెంట్ ఓపెనింగ్ కు ఎందుకు పిలవలేదు?

అది పరిపాలన పరమైన అంశం. ప్రధానిని విమర్శించటానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నరు.

బీసీ సీఎం ఎంత వరకు కలిసొస్తుంది?

75 ఏళ్ల తరువాత బీజేపీ బీసీ సీఎం నిర్ణయం తీసుకుంది. బీసీ సామాజిక వర్గాలు ముందుకు రావాలి. రాష్ర్ట వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. మాకు కలిసొస్తుందని అనుకుంటున్నాం. ఓటు ద్వారానే బీసీ సీఎం సాధ్యం అవుతుంది. అధికార పార్టీకి బాధ్యత లేదా? బీసీ సీఎం, ఎస్సీ సీఎం అని ఎందుకు ప్రకటించటం లేదు? ఇంత వివక్షనా?

కులగణనపై ఎందుకు వెనుకడుగు వేస్తున్నరు?

సరైన సమయంలో దీనిపై నిర్ణయం తీసుకుంటం.. మేం దేనికీ వెనుకాడం. మహిళ బిల్లు, ఆర్టికల్ 370 రద్దు ఇలా ఎన్నో చేశాం, ఇదికూడా చేస్తం.

బీజేపీ లిస్ట్ చాలా లేట్ అయింది, పొత్తుపై ఆందోళనలు జరిగాయి

ఆందోళనలు తప్పు కాదు, పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు, వారి బాధ అర్థం చేసుకుంటాను. ఎన్డీఏ లో పవన్ భాగస్వామిగా ఉన్నారు. పొత్తు ధర్మంలో భాగంగా జనసేన తో కలిసి వెళ్లాం.

వేములవాడ, సంగారెడ్డిలో అభ్యర్థులను మార్చారు

మా పార్టీలో బుజ్జగింపులు ఉంటాయి. బీఆర్ఎస్ లో అలా ఉండవు, ఉంటే ఉండు పోతే పో అంటారు, ఇలాంటి ఇబ్బందులు కామన్.

జనసేనతో పొత్తుపై క్యాడర్ సంతృప్తి చెందిందా?

ఇపుడు అన్ని వివాదాలు సద్దుమనిగాయి.

కేసీఆర్ ను పవన్ కల్యాణ్ ఎందుకు ఏం అనట్లేదు?

ప్రచారంలో మాట్లాడుతారు, వాళ్లు ఏం మాట్లాడాలో మనం డిసైడ్ చేయెద్దు.

దేశంలో లిక్కర్​ నిషేధం తీసుకురావచ్చు కదా?

అది రాష్ట్రాల నిర్ణయం. గుజరాత్ లో అమలు అవుతుంది, రాష్ట్రాలు అనుకుంటే చేయొచ్చు కానీ అవి ఒప్పుకోట్లేదు. తెలంగాణ లో లిక్కర్​ ద్వారా రూ.40 వేల కోట్ల రెవెన్యూ వస్తున్నది.

బీజేపీని కేసీఆర్ ఎందుకు విమర్శించటం లేదు

కేంద్రంను తిట్టే పని కేటీఆర్ కు అప్పగించిండు. కేటీఆర్ రోజంతా కేంద్రంకు వ్యతిరేకంగా ట్వీట్లు పెడుతుండు. మోడీని తరిమి కొడతం అని విమర్శిస్తుండు. వాళ్లను ఫామ్ హౌస్ కు తరిమి కొట్టే రోజు దగ్గర పడింది.

బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒకటే అని కాంగ్రెస్ అంటున్నది..

ఎంఐఎంను పెంచి పోషించింది కాంగ్రెస్, ఆ పార్టీ ఆఫీస్ కు ఇందిరా గాంధీ వెళ్లారు. బీఆర్ఎస్ ఆ వారసత్వాన్ని కొనసాగించింది. బీజేపీ ఎంఐఎం తో కలిసే ప్రసక్తే లేదు.

మిమ్మల్ని కేసీఆర్, కేటీఆర్ దారుణంగా విమర్శించారు, ఎలా ఫీలవుతున్నారు

వారి విమర్శలకు బాధపడ్డాను. వాళ్లు మాట్లాడిన విధంగా నేను మాట్లాడలేను. నన్ను తిట్టినా నేను అట్ల తిట్టను సంస్కారం అడ్డు వస్తుంది. 

ఎన్నికల్లో బీజేపీకి ఫలితాలు ఎలా ఉంటాయి? అధికారంలోకి వస్తుందా.. హంగ్ వస్తుందా?

బీఎల్ సంతోష్ అలా అనలేదు. వైరల్ అయింది అది రాంగ్ ఫీడ్. రాష్ట్రంలో బీజేపీ కీలక పాత్ర పోషించాలి అని ఆయన అన్నారు. బీసీ సీఎం నినాదం మాకు కలిసి వస్తుంది. మంచి స్పందన ఉంది. వచ్చే 15 రోజులు మాకు చాలా కీలకం. అన్ని సమస్యలపై నేను పోరాటాలు చేసిన. బీఆర్ఎస్ దొంగ అయితే కాంగ్రెస్ గజ దొంగ అందుకే బీజేపీ అధికారంలోకి రావాలి.

ఈ ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి

అధికారంలోకి వచ్చేన్ని సీట్లు వస్తాయి. ఎన్ని వస్తాయి అనేది కచ్చితంగా చెప్పలేను. కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, హైదరాబాద్ లో బలంగా ఉన్నం. ఖమ్మంలో కొంచెం బలహీనంగా ఉన్నం.

ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నం

ఎస్సీ వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. సోమవారం బీజేపీ మీడియా సెంటర్​లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘కేంద్రం ఏర్పాటు చేయనున్న  కమిటీ.. ఎస్సీ వర్గీకరణ చేయాలా? వద్దా? అనే దాని గురించి కాదు. వర్గీకరణను వేగవంతంగా అమలు చేయడం కోసమే” అని చెప్పారు. కానీ దీన్ని కొన్ని పార్టీలు కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నట్లు చేస్తున్నాయని కిషన్​రెడ్డి విమర్శించారు.

న్యాయస్థానంలో అనుకూలంగా తీర్పు రాకపోతే.. చట్టపరంగా ముందుకు వెళ్తామని అన్నారు. ఈ సామాజిక వర్గం సభకు మోదీ హజరుకాగానే.. కాంగ్రెస్ నేతలు ఉలిక్కి పడుతున్నారని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కింద భూమి కదులుతున్నదని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణపై ఏనాడూ ప్రధాని మోదీని కేసీఆర్​ కలువలేదని అన్నారు. ‘‘వర్గీకరణపై ప్రధాని శాశ్వత పరిష్కారం కోసం ముందుకు వెళ్తున్నరు. ఇది ఓట్ల కోసమో, రాజకీయాల కోసమో కాదు. ఓట్ల కోసమే అయితే మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ ఎన్నికల సమయంలోనే అమలు చేసేవాళ్లం” అని ఆయన పేర్కొన్నారు. 

ALSO READ : పెద్దపల్లి ఎమ్మెల్యే ఖాతాలో ట్రినిటి సొసైటీ భూములు .. 27.19 ఎకరాలు దాసరి మనోహర్​రెడ్డి పేరు మీదనే

కవితను అరెస్ట్ చేయలేదు.. అందుకే బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని ప్రచారం జరుగుతున్నది?

లిక్కర్ స్కామ్‌లో ఎంక్వైరీ పూర్తి కాలేదు. సుప్రీంకోర్టు  నుంచి కవిత స్టే తెచ్చుకున్నారు. దర్యాప్తు సంస్థలు 120 మందిని విచారించాయి. 12 మందిని అరెస్ట్ చేశాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాను కూడా విచారించారు. సోనియాను అరెస్ట్ చేయాల​ని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తరా?

ఎస్సీ వర్గీకరణ కమిటీ అంటే కాలయాపన కాదా?

సుప్రీంకోర్టులో కేసు ఉంది. వర్గీకరణకు తాము అనుకూలమని రాష్ర్ట ప్రభుత్వాలు చెప్పలేదు. వర్గీకరణ వేగంగా జరగాలని టాస్క్ ఫోర్స్ లాంటి కమిటీ నిత్యం రివ్యూ చేస్తుంది. జనవరిలో కేసు విచారణ ఉంది. అప్పుడు నిర్ణయం వెల్లడిస్తం

బీసీ అధ్యక్షుడిని  తప్పించి బీసీ సీఎం అంటే నమ్ముతరా
అధ్యక్షుడి మార్పు అంటే పార్టీ అంతర్గత విషయం. 3 ఏండ్ల తర్వాత అధ్యక్షులు మారుతారు. గతంలో బీసీ నేతలైన లక్ష్మణ్, దత్తాత్రేయ పార్టీ స్టేట్ చీఫ్‌లు అయ్యారు. బీసీ సీఎం ప్రకటనపై జనం నుంచి అనూహ్య స్పందన వస్తున్నది.