కాంగ్రెస్, బీఆర్ఎస్ను ప్రజలు నమ్మట్లే : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

కాంగ్రెస్, బీఆర్ఎస్ను ప్రజలు నమ్మట్లే :  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
  •     హైదరాబాద్  అభివృద్ధిని రేవంత్ సర్కార్ పట్టించుకుంటలే
  •     బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు 

హైదరాబాద్,వెలుగు: తెలంగాణలో రాజకీయ మార్పు స్పష్టంగా కనిపిస్తోందని, ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ ను నమ్మే స్థితిలో లేరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్  పాలనలో చితికిపోయిన హైదరాబాద్, కాంగ్రెస్  హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. బీజేపీ వైపు తెలంగాణ ప్రజలు చూస్తున్నారని చెప్పారు. ఆదివారం దిల్‌‌‌‌సుఖ్‌‌‌‌నగర్‌‌‌‌లో వివిధ వెల్ఫేర్  అసోసియేషన్లు, యువత బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. నగరంలో అభివృద్ధి ఆగిపోయిందని, కేవలం బీజేపీ కార్పొరేటర్లు ఉన్న డివిజన్లలోనే పనులు జరుగుతున్నాయని తెలిపారు. 

ఐటీ, మౌలిక సదుపాయాలన్నీ వాజపేయి హయాంలో పడిన పునాదులు, మోదీ ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే జరిగాయని చెప్పారు. సీఎం ఒకవైపు ఓంకారేశ్వర ఆలయం కడతామంటూనే మరోవైపు హిందూ దేవతలను అవమానించేలా మాట్లాడుతున్నారని  విమర్శించారు. మసీదులు, చర్చిల నిర్మాణానికి ప్రభుత్వ సొమ్ము ఇస్తామనడం ఓటు బ్యాంకు రాజకీయమేనని తెలిపారు. 

అయోధ్య రామాలయం భక్తుల విరాళాలతో కడితే.. రేవంత్  మాత్రం మతాలను అడ్డం పెట్టుకుని నాటకాలాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్  రావడం లేదని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స అందక పేదలు అల్లాడుతున్నారని, వీటిని వదిలేసి ప్రభుత్వం దృష్టి మళ్లిస్తోందని మండిపడ్డారు. అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి అనేక దేశాలు సంక్షోభంలో ఉన్నా, భారత్‌‌‌‌లో మాత్రం ఆ పరిస్థితి లేదన్నారు. బీఆర్ఎస్  పదేళ్లపాటు రాష్ట్రాన్ని దోచుకుందని, ఆ సొమ్ము పంపకాల్లో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. రాబోయే జీహెచ్‌‌‌‌ఎంసీ ఎన్నికల్లో మేధావులు, యువత బీజేపీకి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.