జూబ్లీహిల్స్, వెలుగు: బీఆర్ఎస్ అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మడం లేదని, ఆ పార్టీకి త్వరలోనే బుద్ధి చెబుతారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా రహమత్ నగర్ డివిజన్ కార్మిక నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌తో కలిసి మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్మిక నగర్‌లో బీఆర్ఎస్ ఆటో యూనియన్ నాయకుడు సతీష్ పదవికి రాజీనామా చేసి మంత్రి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
అనంతరం నాయీ బ్రాహ్మణులు ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధిని మర్చిపోయి, పేద ప్రజలను పట్టించుకోలేదని మండిపడ్డారు. కమీషన్ల కోసం మాత్రమే వారు పనిచేశారని ఆరోపించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వేముల వీరేశం, జారే ఆది నారాయణ , కర్నాటక చిక్కుబళ్లాపూర్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్, కార్పొరేటర్ సీఎన్ రెడ్డి భవాని శంకర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
