ఇళ్ల జాగలు ఇస్తలేరని సర్కారు స్థలాన్ని కబ్జా చేసిన ప్రజలు

ఇళ్ల జాగలు ఇస్తలేరని సర్కారు స్థలాన్ని కబ్జా చేసిన ప్రజలు

సదాశివపేట, వెలుగు:  ఇండ్ల జాగలు ఇవ్వడం లేదని పేదలు సర్కారు స్థలాన్ని కబ్జా చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం సర్వే నంబర్ ​435లో 9.35 ఎకరాల గవర్నమెంట్​ స్థలం ఉంది. 2014లో కాంగ్రెస్​హయాంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సర్వే నంబర్​390లో 5 వేల మంది నిరుపేదలకు 12 ఎకరాల్లో ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు.  2014 ఎన్నికల్లో జగ్గారెడ్డి ఓడిపోయారు. టీఆర్ఎస్ ​నుంచి చింతా ప్రభాకర్​ గెలుపొందారు. పంపిణీ చేసిన ఇండ్ల స్థలాలపై  చింతా ప్రభాకర్​ కోర్టు నుంచి స్టే తెచ్చారు. అప్పట్లో ఆ స్థలంలోకి ఎవరూ వెళ్లకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయించారు. టీఆర్ఎస్​ ప్రభుత్వం వచ్చాక డబుల్​ బెడ్​రూం ఇండ్లు ఇస్తామని చెప్పారు. సంవత్సరాలు గడుస్తున్నా డబుల్ ​బెడ్​రూం ఇండ్లు ఇవ్వకపోవడంతో పేదలు సర్వే నంబర్​435లో స్థలాన్ని కబ్జా చేశారు. విషయం తెలిసి తహసీల్దార్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.  గవర్నమెంట్​స్థలాన్ని ఆక్రమించడం తప్పని హెచ్చరించారు. ఆ పక్కనే వెంచర్​ ఏర్పాటు చేసి 1.5 ఎకరాల సర్కారు స్థలాన్ని కబ్జా చేస్తున్నప్పటికి స్పందించని ఆఫీసర్లు ఇప్పుడు తమను ఆపడం ఏమిటని పేదలు మండిపడుతున్నారు.