లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

వెలుగు నెట్ వర్క్: ఉమ్మడి జిల్లాలో రెండ్రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం పడుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెగడపల్లి–కేశవాపూర్, మహాముత్తారం – యామన్ పల్లి మధ్య వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కనుకునూర్, సింగంపల్లి, యత్నారం తదితర గ్రామాలకూ రవాణా స్తంభించింది. వందల ఎకరాల్లో పత్తి, వరి పంటలు నీట మునిగాయి. సింగారం అటవీ  ప్రాంతంలోని కొంగోని వాగులో కొత్తగూడెంకు చెందిన యువకులు చిక్కుకోగా.. స్థానికులు కాపాడారు. అటవీ గ్రామాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను ఆఫీసర్లు రద్దు చేశారు. లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆఫీసర్లు సూచించారు. 

  • జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోనూ వాన దంచి కొట్టగా.. వీరాపూర్ శివశంకర్ ప్రాజెక్టులోకి భారీ వరద వచ్చి చేరింది. అటుగా మేతకు వెళ్లిన 200 గొర్లు వరదల్లో చిక్కుకుపోయాయి. గొర్రెల కాపరులు సమీప అడవిలోకి వెళ్లారు. రికాం లేని వర్షాలకు ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. తాడిచెర్ల ఓపెన్ కాస్ట్​లోకి భారీగా నీళ్లు చేరడంతో తవ్వకాలు ఆపేశారు. దాదాపు 12వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగిందని మైన్ జనరల్ మేనేజర్ కేఎస్ఎన్ మూర్తి, ఏఎంఆర్ సీపీఆర్వో వెంకట్ తెలిపారు. అటు చిట్యాల మండలంలో పత్తి, మిర్చి పంటలు నీట మునిగాయి. నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని బాధితులు కోరుతున్నారు.
  • హనుమకొండలో చెరువులు నిండుకుండలా మారాయి. వాగులు, నాళాలు పొంగిపొర్లాయి. శివనగర్​, సాయిగణేశ్​ కాలనీ, ఎస్​ఆర్​ నగర్​, ఎన్టీఆర్​ నగర్​ తదితర ఏరియాల్లో నీళ్లు నిలిచాయి. పరకాలలో చలివాగు ప్రాజెక్టు ఉప్పొంగి ప్రవహిస్తోంది. పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగాయి. వరంగల్ జిల్లా పర్వతగిరిలో భారీ వర్షం కురిసింది. దీంతో పత్తి, మిర్చి పంటలు దెబ్బతిననాయి. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో వరద నీళ్లు పోయే దారి లేకపోవడంతో పలు కాలనీలు నీట మునిగాయి.