వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుంది

వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుంది
  • మునుగొడులో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారు
  • తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ 

తెలంగాణ రాష్ట్రం అగ్ర వర్ణాల చేతిలో బందీ గా మారిందని తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని పాతర పెట్టడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలు జరిగితే  మునుగోడు నియోజవర్గ ప్రజలు ఖచ్చితంగా బుద్ది చెబుతారని ఆయన పేర్కొన్నారు. 

మునుగోడులోనే కాదు రాబోయే అన్ని ఎన్నికల్లోనూ బహుజన సమాజ్ వాది పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.  తెలంగాణలో బీఎస్పీ గెలవడం చారిత్రక అవసరం అని ఆయన పేర్కొన్నారు. బీజేపీ,కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు ప్రజలను  ప్రలోభాలకు గురిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 

మునుగోడు లో పోటీ చేస్తాం..ఎక్కడ ఎన్నికలు వచ్చినా పోటీ చేస్తాం

త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న మునుగోడులోనే కాదు.. ఎక్కడ ఎన్నికలు వచ్చినా పోటీ చేయడానికి బీఎస్పీ సిద్ధంగా ఉందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. తెలంగాణ ప్రజల సమస్యల నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్, టిఆర్ఎస్, బిజెపి నాటకాలు అడుతున్నాయన్నారు. తిన్నది అరగకనే  మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని ఆయన విమర్శించారు. సామాజిక న్యాయం అంశం అంజెండాగా మునుగోడు ఉప ఎన్నికల్లో బిఎస్పీ పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు. పేద బడుగు బలహీన వర్గాలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గం మునుగోడు అని  ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.