ఉపాధ్యాయుడి కోసం.. రెండు గ్రామాల తగువులాట

ఉపాధ్యాయుడి కోసం.. రెండు గ్రామాల తగువులాట

ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి కోసం రెండు గ్రామాలు తగువులాడుకున్న ఘటన కడప జిల్లాలో జరిగింది. జిల్లాలోని వీరబల్లి మండలం నాయునివారిపల్లె ప్రభుత్వ పాఠశాలలో రఘప్రసాద్ అనే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు. ఈ పాఠశాలలో విద్యార్థులు చాలా తక్కువగా ఉండడంతో రఘ ప్రసాద్ పాఠశాల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పాఠశాలను అభివృద్ధి చేశాడు. విద్యార్థుల సంఖ్యను పెంచి చక్కగా విద్యాబోధన చేస్తూ.. పిల్లలతోపాటు వారి తల్లిదండ్రుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు.

విద్యార్ధుల పట్ల అతని అంకితభావాన్ని గుర్తించిన అధికారులు అతడిని.. అదే మండలంలోని బాలసానివాండ్లపల్లె పాఠశాలకు బదిలీ చేశారు. ఆ ఊరిలో ఉన్న  మూతపడ్డ పాఠశాలను అక్కడి ప్రజలు అధికారులు సహాయంతో తెరిపించడంతో రఘు ప్రసాద్ ను అక్కడ ఉపాధ్యాయుడిగా నియమించారు.

దీంతో ఆగ్రహించిన నాయినివారిపల్లె ప్రజలు శనివారం పాఠశాల వద్దకు వచ్చి ఉపాధ్యాయుడు పాఠశాల విడిచి వెళ్లనీయకుండా నిరసన తెలిపారు. తమ పిల్లలకు చక్కగా పాఠాలు నేర్పే ఉపాధ్యాయుణ్ని అధికారులు వేరే పాఠశాలకు బదిలీ చేయడం తగదన్నారు. మా ఉపాధ్యాయుడు మాకే కావాలంటూ పట్టుబడుతున్నారు. ఈ రెండు గ్రామాల్లో ఏ గ్రామానికి వెళ్లాలో తెలియక ఆ ఉపాధ్యాయుడు సందిగ్ధంలో ఉండిపొయాడు.