వ్యాక్సిన్​ సెంటర్లు ఎక్కడో తెలియక అయోమయం

వ్యాక్సిన్​ సెంటర్లు ఎక్కడో తెలియక అయోమయం
  • 45 ఏండ్లకు పైబడిన వారికి ఫ్రీ కరోనా టీకాలు
  • రెండో రోజు నుంచి సెంటర్లలో పెరిగిన సంఖ్య
  • స్థానికంగా ఎక్కడున్నయో తెలియక అయోమయం 
  • అధికారులు అవేర్​నెస్ చేయాలంటున్న జనం​ 

హైదరాబాద్, వెలుగు: కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు 45 ఏండ్లు పైబడిన వారు ఇంట్రెస్ట్​ చూపిస్తున్నారు.  తొలిరోజు కంటే రెండో రోజు ఎక్కువ మంది వ్యాక్సిన్​ వేయించుకునేందుకు వచ్చారు. అయితే సెంటర్లు ఎక్కడున్నయో తెలియక ఇబ్బంది పడుతున్నారు.  గురువారం నుంచి హైదరాబాద్​, మేడ్చల్​, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్​ హాస్పిటల్స్​లో 45 ఏండ్లకు పైబడిన వారికి ఫ్రీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ  చేపట్టారు.  

సెంటర్లు ఎక్కడో తెలియక..

ప్రభుత్వ హాస్పిటల్స్​ వ్యాక్సినేషన్​ సెంటర్లు ఎక్కడున్నయో తెలియక జనాలు ఇబ్బంది పడుతున్నారు. కొందరు సెంటర్ల కోసం తిరిగినా దొరకడం లేదు. దీంతో ప్రైవేట్​సెంటర్లకు వెళ్లి వ్యాక్సిన్​ తీసుకుంటున్నారు. సర్కారు దవాఖానల్లో సెంటర్లు ఏర్పాటు చేసినా, స్థానికంగా అవగాహన కల్పించట్లేదు. దీంతో చాలా మందికి సెంటర్లు వెతికేందుకే సరిపోతుంది. ఏయే సెంటర్లలో వ్యాక్సిన్​ వేస్తున్నారనే విషయాన్ని ఒకరోజు ముందుగానే సెంటర్​ అడ్రస్​ చెబితే బాగుండేదని వ్యాక్సిన్​ వేయించుకున్న వారు అంటున్నారు.

ఇతర పట్టణాలతో పోలిస్తే.. 

 హైదరాబాద్​ లో వ్యాక్సినేషన్​కి రెస్పాన్స్​ తక్కువగానే కనిపిస్తుంది. ఢిల్లీ లో వ్యాక్సిన్ ​సెంటర్ల వద్ద భారీగా క్యూ కడుతున్నారు. అదే సిటీలో మాత్రం సెంటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. కొన్ని సెంటర్లకు జనాలు రాకపోతుండడంతో ముందుగానే  మూసివేస్తున్నారు. 

ప్రైవేటులోనే ఎక్కువ

మూడు జిల్లాల పరిధిలో ఎక్కువగా ప్రైవేటు దవాఖానాల్లోనే వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. రెండో రోజున మేడ్చల్ జిల్లాలో వ్యాక్సిన్ తీసుకువారి సంఖ్య 8,412 మందిగా ఉంది.  హైదరాబాద్​లో మొత్తం 11,155 మందికి టీకా పంపిణీ చేశారు.   రంగారెడ్డి జిల్లాలోనూ 3,849 మంది ప్రైవేటులోనే టీకా వేయించుకున్నారు. అయితే మేడ్చల్ జిల్లాలో సర్కారు దవాఖానల్లో రిజిస్టర్ చేసుకున్న వారు వందశాతం కాగా, హైదరాబాద్, రంగారెడ్డి లోనూ 97శాతం మంది వ్యాక్సినేషన్​కు వచ్చారు. 

ఐడీహెచ్​ కాలనీలో..

బన్సీలాల్​పేట  డివిజన్​లోని ఐడీహెచ్ కాలనీ గాంధీ అర్బన్ హెల్త్ సెంటర్​లో  శుక్రవారం కోవిడ్​ వ్యాక్సినేషన్ సెంటర్​ను మెడికల్ ఆఫీసర్ కావ్యాంజలి ప్రారంభించారు. 11 మందికి కోవిషీల్డ్ టీకా వేశామని ఆమె చెప్పారు.

ఎక్కడుందో తెలియక..

ఆర్టీసీ క్రాస్​ రోడ్డులో సర్కార్​ సెంటర్​ఎక్కడుందో తెలియక చింతల్​బస్తీ యూపీహెచ్ సీకి వచ్చి వ్యాక్సిన్ ​తీసుకున్నా.  గతంలో ఈ ఏరియాలో ఉండడం వల్ల  అడ్రెస్ తెలుసు. వ్యాక్సిన్​ఇచ్చేందుకు ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. కానీ ఏయే సెంటర్లలో  వ్యాక్సిన్​ ఇస్తున్నారో ముందస్తుగా చెబితే ఇబ్బందిగా ఉండదు.
– గిరి, ప్రైవేట్ ఎంప్లాయ్​, అశోక్ నగర్​ 

అవేర్​నెస్​ చేస్తం

వ్యాక్సిన్​పై జనాలకు అవేర్​నెస్ కల్పించాలని సిబ్బందిని ఆదేశించాం. సెంటర్లలో ముందు రోజు సమాచారం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నం.   మరో రెండు, మూడ్రోజుల్లో అన్ని పీహెచ్​సీ సెంటర్లలో టీకా పంపిణీ చేస్తం. కొత్తగా ఏర్పాటు చేసిన సెంటర్లకు టీకాను తీసుకునేందుకు తక్కువగా వస్తున్నారు.  ప్రతి సెంటర్​లో డైలీ వందకు పైగా మందికి వ్యాక్సిన్లు అందిస్తం. 
– డాక్టర్​ వెంకటి, డీఎంహెచ్​వో, హైదరాబాద్​ జిల్లా