లంచం ఇయ్యకుంటే పనులైతలేవ్

లంచం ఇయ్యకుంటే పనులైతలేవ్
  • అవినీతి ఉందన్న 90 శాతం మంది
  • రెవెన్యూ డిపార్ట్ మెంట్​లోనే అత్యధికం 
  • యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సర్వేలో వెల్లడి 

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో అవినీతి ఉందని 90 శాతం మంది అభిప్రాయపడ్డారు. లంచం ఇస్తేనే పనులు అవుతున్నాయని 89 శాతం మంది చెప్పారు. అత్యధికంగా రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో అవినీతి జరుగుతోందని 85 శాతం మంది తెలిపారు. రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారని 80 శాతం మంది పేర్కొన్నారు. ‘‘యూత్ ఫర్ యాంటీ కరప్షన్’’ స్వచ్ఛంద సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ సంస్థ తెలంగాణ వ్యాప్తంగా, ఏపీలోని 7 జిల్లాల్లో 21,523 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. మొత్తం 12 ప్రశ్నలపై జనం ఒపీనియన్ తీసుకుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో యువతీ యువకులు, రైతులు, ఉద్యోగులు తదితర వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ రెండింటిలోనూ సర్వే నిర్వహించింది. 
ఈ సర్వే వివరాలను బుధవారం హైదరాబాద్ ఎర్రమంజిల్ లోని ఆఫీసులో సంస్థ ఫౌండర్ పల్నాటి రాజేంద్రతో కలిసి సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ వెల్లడించారు.  
సర్వేలో తేలిన అంశాలివీ... 
    రాష్ట్రంలో అవినీతికి బ్రోకర్ల వ్యవస్థనే ప్రధాన కారణమని 92 శాతం మంది అభిప్రాయపడ్డారు. 
    ఆఫీసర్ల పనితీరు బాగాలేదని 92 శాతం మంది చెప్పారు. 
    తమ ప్రాంతంలో నిజాయితీ ఆఫీసర్లు 20 శాతం లోపే ఉన్నారని 80 శాతం మంది తెలిపారు. 
    సీబీఐ, ఈడీ, ఏసీబీ లాంటి ఏజెన్సీలతో అవినీతి తగ్గిందని 57.1 శాతం మంది పేర్కొన్నారు. 

సర్వేలో అడిగిన ప్రశ్నలు..  జనం అభిప్రాయం (శాతాల్లో)
ఎప్పుడైనా లంచం ఇవ్వాల్సిన అవసరం వచ్చిందా?  
చాలాసార్లు: 36.5  
అప్పుడప్పుడు: 38.2   
ప్రతిసారీ: 10.9   
రాలేదు: 14.5   
లంచం ఇస్తే ఏ రూపంలో ఇచ్చారు? 
డబ్బులు: 79   
ఇతర మార్గాలు: 17.7 
లంచం ఇవ్వనిదే పని కాదని భావిస్తున్నారా? 
అవును: 69.9   
కాదు:9.9   
లంచం ఇచ్చినా ఆలస్యమే: 20.2 
లంచం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? 
ఇవ్వకుంటే పని కాదు: 65.1   
సమయానికి పని కోసం: 26  
అధికారుల వేధింపులు: 7.8   
అధికారులు లంచం ఎవరి ద్వారా తీసుకుంటున్నారు? 
బ్రోకర్లు: 4-0.6   
కింది ఉద్యోగుల ద్వారా: 35.9   
డైరెక్ట్‌‌గా: 21.9  
బ్రోకర్ల వల్లనే అవినీతి పెరుగుతుందా? 
అవును: 47.5  
బ్రోకర్లే ప్రధాన కారణం: 24.6   
బాగా పెరుగుతోంది: 18.1  
కాదు: 9.7    
సర్వే ఇట్ల చేసిన్రు.. 
మొత్తం మంది: 21,523
వీరిలో మగవాళ్లు: 91 శాతం 
ఆడవాళ్లు: 9 శాతం 
గ్రామీణ ప్రాంతాల్లోని  వాళ్లు: 54.4 శాతం 
పట్టణాల్లోని వాళ్లు: 34.2 
మెట్రోసిటీల్లోని వాళ్లు: 11.5 
లంచం తీస్కుంటే కఠినంగా శిక్షించాలి: లక్ష్మీనారాయణ 
అవినీతి నిర్మూలనకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని లక్ష్మీనారాయణ సూచించారు. అవినీతి కేసుల్లో పట్టుబడే అధికారులకు కఠిన శిక్షలు వెయ్యాలన్నారు. ఈ కేసుల్లో అరెస్టవుతున్న అధికారులకు మళ్లీ ఉన్నతాధికారులుగా పోస్టింగ్స్ ఇస్తుండడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయన్నారు. వివిధ శాఖల్లో అధికారులు డైరెక్ట్ ప్రజలతో కాంటాక్ట్ అవుతుండడంతో అవినీతి పెరిగిపోతోందని చెప్పారు. దీన్ని నివారించేందుకు అన్ని సేవలకు ఆన్ లైన్ సర్వీసులు అందుబాటులోకి తేవాలన్నారు. లంచాలు ఇవ్వకుండా ప్రజల్లోనూ అవగాహన 
కల్పించాలన్నారు.