సమర్థపాలన అందిస్తున్న మోడీకే ప్రజల ఆశీస్సులు 

 సమర్థపాలన అందిస్తున్న మోడీకే ప్రజల ఆశీస్సులు 
  • జన ఆశీర్వాద యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  

తిరుపతి: దేశంలో సమర్థ పాలన అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకే ప్రజల ఆశీస్సులు కొనసాగించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. జన ఆశీర్వాద యాత్ర ప్రారంభించేందుకు బుధవారం తిరుపతికి వచ్చారాయన. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణుల ర్యాలీలో ఓపెన్ టాపు వాహనంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  తిరుపతి వాసులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. 
ఈ సందర్బంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని, మనందరి కోసం మాస్కులు తప్పనిసరిగా ధరించాలని కోరారు. దేశంలోని 130 కోట్ల మంది కోవిడ్ వారియర్స్ గా మారాలన్నారు. తిరుపతి వెంకన్న ఆశీస్సులు కోసం వచ్చానని, సమర్థవంతంగా పాలన అందిస్తున్న నరేంద్ర మోడీకి కి ఆశీస్సులు అందించాలని కోరారు. మనలాంటి దేశంలో కరోనా అరికట్టేందుకు మాస్క్ లు ధరించాలన్నారు. పోలియో వచ్చిన తర్వాత 20 ఏళ్లకు గాని వ్యాక్సిన్ రాలేదని ఆయన గుర్తు చేశారు. కరోనా విషయంలో ప్రపంచ దేశాలతో పోటీ పడి వ్యాక్సిన్ సొంతంగాఅందించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి మరువలేనిదన్నారు. ప్రపంచ దేశాలే నివ్వరపోయాయని ఆయన పేర్కొన్నారు. 
వరుస బాంబు పేలుళ్లుతో అశాంతితో ఉన్న దేశంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తరువాత మనకు ప్రశాంతత వచ్చిందన్నారు. మన సైనికుడ్ని ఒకరిని చంపితే పరదేశం ఇద్దరు చస్తారని, సర్జికల్ స్ట్రైక్ కూడా జరిగిందని, ఇదే బిజెపి పాలన గొప్పతనం అన్నారు. వాజపేయి ప్రభుత్వంలో సాగరమాల రోడ్లు వేయడం, సడక్ యోజన ద్వారా రోడ్లు వేయడం జరిగిందన్నారు. 
అన్ని రంగాల్లో నరేంద్ర మోదీ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, 80 కోట్ల మందికి ఆహార భద్రత ఇస్తోందని, ఇందులో భాగంగా కరోనా సందర్భంగా ఒక్కొక్కరికీ 5కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నామన్నారు. లక్షల ఇళ్లు రాష్ట్రాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంజూరు చేశారని వివరించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో అనేక చట్టాలు చేయడం జరిగిందని, జమ్మూకాశ్మీర్ లో 75సంవత్సరాలుగా అంబేద్కర్ రాజ్యాంగం అమలు కాలేదని, అయితే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత అంబేద్కర్ రాజ్యాంగం అమలకు వీలైందన్నారు. ఈ సమయంలో నేను కేంద్ర మంత్రిగా ఆశాఖలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నాననని చెప్పారు. సామాజిక మార్పునకు నరేంద్ర మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, దేశంలో దళిత ఎంపీలు, గిరిజన, బిసిలు ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్న పార్టీ బీజేపీ మాత్రమేనని కిషన్ రెడ్డి వివరించారు.