
- ఇండియన్ పోలీస్ ఫౌండేషన్‌తో ఎంవోయూ
- పోలీస్ సంస్కరణల కోసం ప్రాజెక్టు
హైదరాబాద్, వెలుగు: పోలీసు సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో, ప్రజల్లో పోలీసులపై నమ్మకాన్ని పెంచడంలో పోలీస్ శాఖలో అంతర్గత సంస్కరణలు ఎంతో కీలకమని డీజీపీ జితేందర్ అన్నారు. ఈ దిశగా పోలీసులు కృషి చేయాలని ఆయన సూచించారు. స్థానిక పరిస్థితులపై అధ్యయనంతో ఇతర రాష్ట్రాల పోలీసు శాఖల్లో అమలవుతున్న ఉత్తమ పద్ధతులు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ తెలుసుకునేందుకు వీలవుతుందన్నారు.
రాష్ట్రంలో అంతర్గత పోలీసు సంస్కరణల ప్రాజెక్టు కోసం తెలంగాణలో రెండు ప్రాంతాలను ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ (ఐపీఎఫ్) ఎంపిక చేసింది. పోలీస్ సంస్కరణల ప్రాజెక్టు అమలులో భాగంగా సోమవారం డీజీపీ కార్యాలయంలో తెలంగాణ పోలీసులు, ఐపీఎఫ్ మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. భవిష్యత్తు పోలీసింగ్ వ్యవస్థను నిర్మించేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందన్నారు.
ఐపీఎఫ్ అధ్యక్షుడు ఓం ప్రకాష్ సింగ్ మాట్లాడుతూ.. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, కేరళ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఇప్పటికే ఐపీఎఫ్ రాష్ట్ర చాప్టర్లు స్థాపించామని, తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాలకు విస్తరించే ప్రణాళికలు ఉన్నాయర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం సైబరాబాద్ కమిషనరేట్‌లోని 15 పోలీస్ స్టేషన్లు, సంగారెడ్డి జిల్లాలోని 15 పోలీస్ స్టేషన్లు ఎంపిక చేశారు.
ఫిర్యాదుదారులు, బాధితులు, నిందితులు, పౌరసేవా అభ్యర్థులు, ఎన్‌జీఓలు, న్యాయవ్యవస్థ, పోలీసు సిబ్బంది సహా అందరి అభిప్రాయాలను ఐపీఎఫ్ బృందం సేకరిస్తుంది. వాటిని క్రోడీకరించి మూడు నెలల్లో తొలి నివేదికను డీజీపీకి అందిస్తుంది. అందులో వచ్చిన సిఫార్సులను తెలంగాణలోని అన్ని పోలీస్ స్టేషన్లకు విస్తరిస్తారు.