ఆన్‌లైన్ షాపింగ్ అందించే ఈ-కామర్స్ కంపెనీలు కేవలం కొనుగోలుదారులకు.. సెల్లర్లకు మధ్య వారధులుగా మాత్రమే ఉండి తమ బాధ్యతల నుంచి తప్పుకోలేరని మహారాష్ట్రలో జిల్లా వినియోగదారుల కమిషన్ ఒక కీలక తీర్పు ఇచ్చింది. వస్తువు అమ్మేటప్పుడు మధ్యవర్తిగా ఉన్నంత మాత్రాన.. ఆ వస్తువులో తలెత్తే లోపాలకు తమకు సంబంధం లేదని చెప్పడం కుదరదని కమిషన్ స్పష్టం చేసింది. అమెజాన్ ఇండియా ద్వారా కొనుగోలు చేసిన ఒక డిఫెక్టివ్ టీవీ విషయంలో వినియోగదారుడికి న్యాయం చేస్తూ.. ఆ సంస్థ సేవల్లో లోపం ఉందని కమిషన్ వెల్లడించింది.
ముంబైలోని గోరేగావ్‌కు చెందిన ధరివాల్ అనే వ్యక్తి ఫిబ్రవరి 2018లో అమెజాన్ ద్వారా రూ.16వేల 499 పెట్టి ఒక LED టీవీని కొనుగోలు చేశారు. అయితే అది సరిగ్గా పనిచేయకపోవడంతో ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు అమెజాన్ ప్రతినిధులకు అనేక ఈమెయిల్స్, ఫోన్ కాల్స్ చేశారు. మొదట్లో టీవీని మార్చి ఇస్తామని హామీ ఇచ్చిన అమెజాన్.. చివరకు ఏప్రిల్ 16న తమ బాధ్యత ఏమీ లేదని, నేరుగా తయారీదారుని సంప్రదించాలని కస్టమర్ కు తేల్చి చెప్పింది. దీంతో ఆయన వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. దీనిపై స్పందిస్తూ తాము జస్ట్ టెక్నికల్ సపోర్ట్ ఇచ్చే ప్లాట్‌ఫారమ్ మాత్రమేనని, వస్తువులను అమ్మడం లేదా తయారు చేయడం తమ పని కాదని అమెజాన్ కోర్టులో వాదించింది.
ALSO READ : టెక్ కంపెనీలకు కొత్త లేబర్ కోడ్స్ షాక్..
అమెజాన్ వాదనను తిరస్కరించిన కోర్టు.. ఒక ప్లాట్‌ఫారమ్ వస్తువును ప్రదర్శించి, ప్రచారం చేసి, దానిని అమ్మటానికి సహకరించినప్పుడు.. కస్టమర్లకు నాణ్యమైన వస్తువు అందేలా చూడాల్సిన బాధ్యత ఆ సంస్థపై ఉంటుందని కమిషన్ పేర్కొంది. వస్తువులు అమ్మటం ద్వారా వాణిజ్య ప్రయోజనం పొందుతున్నప్పుడు, 'వికారియస్ లయబిలిటీ' రూల్ ప్రకారం ఆ సంస్థే బాధ్యత వహించాలని వివరించింది. వినియోగదారుడు సంస్థపై ఉన్న నమ్మకంతోనే వస్తువును కొంటారని.. సేల్ జరిగిన తర్వాత ఆ వస్తువు పనితీరుకు ప్లాట్‌ఫారమ్ జవాబుదారీగా ఉండాలని కోర్టు తేల్చి చెప్పింది.
ALSO READ : సంక్రాంతి రోజున తగ్గిన గోల్డ్ రేటు..
చివరగా.. ఈ కేసులో అమెజాన్ సేవల్లో లోపం ఉన్నట్లు గుర్తించిన కమిషన్.. టీవీ కొనుగోలు ధరను 6 శాతం వడ్డీతో కలిపి వినియోగదారుడికి తిరిగి చెల్లించాలని ఆదేశించింది. దీనితో పాటు ఆయనకు కలిగిన మానసిక ఆవేదనకు పరిహారంగా రూ.15వేలు అదనంగా చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే పరిహారం అందిన తర్వాత డిఫెక్టివ్ టీవీని అమెజాన్‌కు అప్పగించాలని ఫిర్యాదుదారుడిని కోరింది. ఆన్‌లైన్ వ్యాపార సంస్థలు తమ బాధ్యతల నుంచి తప్పించుకోలేవని చెప్పడానికి ఈ తీర్పు ఒక ఉదాహరణగా నిలిచింది.
