ఎప్పుడేమైతదోనని పైసలు దాచుకుంటున్న జనం

ఎప్పుడేమైతదోనని పైసలు దాచుకుంటున్న జనం
  • ఖర్చులు తగ్గిస్తున్రు
  • కరోనా సెకండ్‌ వేవ్‌తో దేశంలో కోటి జాబ్‌లు పోయినయ్‌
  • ఊర్లల్ల కేసులతో ఆగమైతున్నరు
  • రోగమొస్తే ట్రీట్‌మెంట్‌కు లక్షల రూపాయలు ఖర్చు
  • లాక్‌డౌన్‌తో పనుల్లేక, పైసలొచ్చే మార్గం లేక తిప్పలు
  • అవసరానికి అప్పు కూడా పుడ్తలే

కరోనా ఎఫెక్ట్‌‌తో జనం ఖర్చులు తగ్గించుకుంటున్నారు. అసలే అంతంత ఆదాయం ఉండటంతో మున్ముందు ఎట్లాంటి పరిస్థితి వస్తదోనని పైసలు దాచుకుంటున్నారు. అవసరమైతేనే డబ్బులు బయటకు తీస్తున్నారు. క్రెడిట్‌‌ రేటింగ్‌‌ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్‌‌ అండ్‌‌ రీసెర్చ్‌‌ (ఇండ్‌‌ రా) సంస్థ స్టడీలో ఈ విషయం తేలింది.

హైదరాబాద్, వెలుగు: దేశంలో సెకండ్ వేవ్‌‌ మొదలై 90 శాతం ఊర్లను చుట్టేసింది. కరోనా వల్ల ఇంటిపెద్దలు ప్రాణాలు కోల్పోయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ట్రీట్‌‌మెంట్‌‌ కోసం 60 శాతానికి పైగా గ్రామీణ ప్రజలు వాళ్లు దాచుకున్న పైసలన్నీ ఖర్చు చేయడంతో పాటు ఆస్తులు, బంగారం తాకట్టు పెడుతున్నారు. స్నేహితులు, బంధువులు, తెలిసిన వారి దగ్గర నుంచి అప్పులు తీసుకుంటున్నారు. ఇలా ఆరోగ్యంపై ప్రభుత్వాల కన్నా ప్రజలే ఎక్కువ పైసలు పెడుతున్నారు. ప్రభుత్వాలు 27.1 శాతం ఖర్చు చేస్తుంటే జనం 62.4 శాతం వెచ్చిస్తున్నారు.  ఇలా ఇటు రోగాలు, అటు అప్పుల పాలవుతుండటంతో భయపడి అనవసర ఖర్చులను జనం తగ్గించుకుంటున్నారు.

ఫస్ట్ వేవ్‌లో ఆర్థిక వ్యవస్థ అంతగా ప్రభావితం కాకపోవడానికి గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి తగ్గకపోవడమేనని ఎక్స్‌పర్ట్స్‌ చెప్పారు. గతేడాది లాక్​డౌన్ పెట్టగానే వలస కూలీలతో పాటు పట్టణాల్లో పని చేసుకునే వాళ్లు చాలా మంది ఊర్ల బాట పట్టారు. ఆ టైమ్‌లో వారి దగ్గర అప్పటికే ఉన్న సేవింగ్స్ అంతా తీసుకుని గ్రామాలకు వెళ్లారు. వాళ్లకు ఆహారం, ఇతర ఖర్చుల విషయంలో అనేక రాష్ట్రాలు కూడా బాగా స్పందించాయి. ఉపాధి హామీ పథకంతో అనేక మంది వలస కూలీలకు పని దొరికింది. వ్యవసాయానికి ఖర్చు చేసేందుకు రైతులు పెద్దగా ఆలోచించలేదు. ఫస్ట్‌​వేవ్‌లో పల్లెల్లో కరోనా కేసులు 
కూడా తక్కువగానే నమోదయ్యాయి. దీంతో ఎకనామీ దిగజారలేదు.

సెకండ్‌ వేవ్‌లో ఆగమాగం
సెకండ్ వేవ్‌లో పరిస్థితి మారింది. గతేడాది మాదిరి ఈసారి వలస కూలీలకు వేరే ప్రత్యామ్నాయ పనులు దొరకక ఇబ్బంది పడుతున్నారు. లాక్‌డౌన్‌కు తోడు వ్యవసాయ పనులు తగ్గడంతో ప‌నులులేక ఖాళీగా ఉంటున్నారు. గ్రామీణ నిరుద్యోగ రేటు గత నెలలో 7.07 శాతం నుంచి 10.12 శాతానికి పడిపోయిందని సెంటర్ ఫర్​ మానిటరింగ్ ఎకానమీ ప్రకటించింది. గతేడాది నవంబర్​20  నుంచి ఈ ఏడాది మార్చి వరకు సగటున వ్యవసాయ వేతన వృద్ధి 8.5 శాతం నుంచి 2.9 శాతానికి తగ్గింది. వ్యవసాయేతర కార్యకలాపాల వేతన వృద్ధి 9.1 శాతం నుంచి 5.2 శాతానికి తగ్గింది. మొత్తంగా గత పదేళ్ల కిందటితో పోలిస్తే గ్రామీణ పేదరికం ఈ కరోనా టైమ్‌లో 10 శాతం పెరిగి ఉంటుందని ఎక్స్​పర్ట్స్​అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయం ద్వారా మంచి రాబడి వచ్చినా ఖర్చు విషయంలో జనం ముందుకు రారని, సేవింగ్స్‌ చేయడంపై దృష్టి పెడతారని నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ కరోనా​ఎంతకాలం ఉంటుంది? మళ్లీ మళ్లీ ఇలా లాక్​డౌన్ పెడితే పనులెట్లా నడుస్తాయి?లాంటి ప్రశ్నలు జనాన్ని వెంటాడుతున్నాయని, దీంతో పరిస్థితి ఎప్పుడెలా ఉంటుందోనని ఖర్చులు తగ్గించుకుంటున్నారని వివరిస్తున్నారు. 

97 శాతం కుటుంబాలకు ఇన్​కమ్ తగ్గింది
కరోనా సెకండ్ వేవ్​తో కోటి మంది జాబ్​లు కోల్పోయారని, 97 శాతం కుటుంబాలకు ఇన్​కమ్ తగ్గిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ చెప్పింది. ఏప్రిల్ లో 8 శాతమున్న నిరుద్యోగం మే చివరి నాటికి 12 శాతానికి పెరిగిందని తెలిపింది. ఎకానమీ ఓపెన్ అయినా జాబ్​లు కోల్పోయినవాళ్లు తిరిగి పొందడం కష్టమైన పనేననని చెప్పింది. ఏప్రిల్​లో దేశవ్యాప్తంగా 1.75 లక్షల కుటుంబాలను సర్వే చేశామని, ఆదాయం పడిపోయిందని 55 శాతం మంది, ఇన్​కమ్​లో మార్పు లేదని 42 శాతం మంది చెప్పారంది. 

రెండు నెలల నుంచి పైసల్లేవు
ఇంతకుముందు ఏదో ఓ పనికి పోతుండే. రెండు నెలల నుంచి పనుల్లేవు. ఇంట్లనే ఉంటున్న. పైసా లేదు. కొత్త బట్టలు కొనుమని పిల్లలు చెప్తుంటే ఏడాది నుంచి కొనలె. ఇప్పుడు ఏం కొనేటట్లు లేదు. సంపాదన ఉంటే ఏమైనా చేయొస్తది. నెలనెలా చిట్టీలు ఏస్తుండే. వాటికే పైసల్లేక కడ్తలేను. 
–అబ్బగాని ఉప్పలయ్య, సూర్యాపేట జిల్లా

పైసలన్నీ మందులకే ఖర్చయినయ్
నేను హమాలీ పనిచేస్త. కరోనా చేయవట్టి పని సక్కగ నడుస్తలేదు. నెల కిందట ఇంట్లో కరోనా వచ్చింది. వేల రూపాయాలు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు హాస్పిటళ్లు, మందులకే పైసలు అయిపోతున్నయ్. దాచిపెట్టిన పైసలూ ఖర్చయిపోయినయ్‌. ఆన్​లైన్​క్లాసులకు పిల్లలు ఫోన్ అడిగితేననే కొనిస్తలేను. ఆ పైసలతో 2 నెలలు ఇంట్లోకి సామాను వస్తది. 
–మహేశ్​, నిజామాబాద్​ జిల్లా 

ఉన్నదాంట్లనే ఎల్లదీస్తున్నం
మొన్న మాకు తెలిసిన ఆయనకు కరోనా వస్తే దవాఖాన్లలో లక్షల రూపాయలు అయినయి. ఏ రోగమొస్తే ఎంత ఖర్చు అయితదోనని భయం ఎక్కువైంది. ఇటు చూస్తే సంపాదన లేదు. ఇంక ఖర్చులేడ పెడ్త. ఇంట్లకు తిండి వస్తువులే తెచ్చుకుంటున్నం. ఆటో నడిపేటోన్ని. ఇప్పుడు లాక్​డౌన్​తో ఏం నడుస్తలే. ఊరి నుంచి మండలానికి ఎవరినైనా తీసుకుపోవాలన్నా పరిస్థితులు మంచిగలేవు. ఉన్న పైసలతోనే ఇల్లు ఎల్లదీస్తున్న.
- శ్రావణ్, యాదాద్రి భువనగిరి జిల్లా