
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని ఇటీవల వరదలు అతలాకుతలం చేశాయి. వర్షాలు తగ్గడంతో వరద పోయినా దాని తాలూకు ప్రభావం కనిపిస్తూనే ఉంది. వేలాది మంది ఢిల్లీ వాసులు వరదలకు తీవ్రంగా ప్రభావితమయ్యారు. బాధితుల ఇండ్లన్నీ బురదతో నిండిపోయాయి. ఇంటి సామగ్రి అంతా నాశనమైపోయింది. దీంతో 2023 నాటి పరిస్థితులు గుర్తుకువస్తున్నాయి.
‘‘2023 లోనూ ఇలాగే వరదలు వచ్చాయి. వరద ఓ వారం పాటు కొనసాగింది. కానీ, తర్వాత కొన్ని నెలల వరకూ మాకు కష్టాలు మిగిలాయి. వరదలు తగ్గాక ఇండ్లకు చేరుకుని చూడగా.. ఎక్కడచూసినా బురద ఉంది. సామగ్రి అంతా పాడైపోయింది. ఇంటిని క్లీన్ చేసుకోవడానికే మాకు నెల రోజులు పట్టింది. మరోవైపు కరెంటు కూడా లేదు. నెల పాటు అంధకారంలో గడిపాం. సోలార్ లైట్లు, క్యాండిల్స్, బ్యాటరీ లైట్లు పెట్టుకొని ఇండ్లను క్లీన్ చేసుకున్నాం. అలాగే, మా ఇంటి పరిసరాల్లో పాములు కూడా వచ్చాయి. ఓ బాలికను పాము కరిచింది. రెండేండ్ల తర్వాత మళ్లీ మాకు ఇప్పుడు అవే కష్టాలు వచ్చాయి”అని ఓ బాధితురాలు మీడియాకు తన ఆవేదన వ్యక్తం చేసింది.
వరదల్లో తమ ఇంటి సామగ్రి మొత్తం పాడైందని, బట్టల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులు ఏదీ మిగల్లేదని మరో బాధితురాలు వాపోయింది. కాగా.. తాజా వరదల వల్ల ఈస్ట్ ఢిల్లీలో 7200, ఈశాన్య ఢిల్లీలో 5200, సౌత్ ఢిల్లీలో 4200, నార్త్ ఢిల్లీలో 1350 మంది మంది ప్రభావితమయ్యారు. బాధితుల కోసం అధికారులు పలు రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఆహారం, నీరు వంటి నిత్యావసర వస్తువులు అందిస్తున్నారని
బాధితులు తెలిపారు.