చరిత్రను వక్రీకరిస్తే ప్రజలు క్షమించరు ..బైరాన్ పల్లిని ప్రభుత్వం పర్యాటకంగా అభివృద్ధి చేయాలి

చరిత్రను వక్రీకరిస్తే ప్రజలు క్షమించరు ..బైరాన్ పల్లిని ప్రభుత్వం పర్యాటకంగా అభివృద్ధి చేయాలి
  • ప్రజా సమస్యల పరిష్కారానికి అమరుల స్ఫూర్తితో ఉద్యమిస్తాం
  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ                   

చేర్యాల, వెలుగు:  తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను వక్రీకరిస్తే ప్రజలు క్షమించరని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్​వెస్లీ హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అమరుల స్పూర్తితో ఉద్యమిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా మంగళవారం సిద్దిపేట జిల్లాలోని బైరాన్ పల్లి బురుజు వద్ద సాయుధ రైతాంగ పోరాట అమరవీరుల సంస్మరణ సభను నిర్వహించారు. 

ఇందులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం, దున్నేవాడికే భూమి కావాలని కమ్యూనిస్టులు వీరోచిత పోరాటాలు చేశారని గుర్తు చేశారు. భూస్వాముల నుంచి10 లక్షల ఎకరాల భూములు లాక్కొని నిరుపేదలకు పంచిపెట్టారని, ఇలాంటి ఘన చరిత్ర కమ్యూనిస్టులదని చెప్పారు. 

రైతాంగ పోరాటంతో ఏ మాత్రం సంబంధం లేని బీజేపీ తామే వారసులమని చెప్పుకోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. తెలంగాణ రైతాంగ పోరాటానికి వారసులమని చెప్పుకునే వారికి భూములు పంచే దమ్ముందా..? అని ప్రశ్నించారు. 

నైజాం పాలనకు వ్యతిరేకంగా రజాకార్లు, భూస్వాములు, దేశ్​ముఖ్ లకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరిగిందని, ప్రజలకు అండగా ఉండి పోరాడుతూ కమ్యూనిస్టులు ప్రాణాలను త్యాగం చేశారని పేర్కొన్నారు. అన్నివర్గాల ఐక్యం చేసి కులమతాలకు అతీతంగా నడిపిన గొప్ప వర్గ పోరాటమన్నారు.  చరిత్ర చెరిపేస్తే పోదని, వారికి పోరాటాల ద్వారానే బుద్ధి చెబుతామన్నారు. బైరాన్ పల్లిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని, అర్హులైన పోరాటయోధులకు పెన్షన్లు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేముందు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిందని, ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయడం లేదని విమర్శించారు. అంతకుముందు చేర్యాల నుంచి బైరాన్ పల్లి వరకు బైక్ ర్యాలీ తీశారు. 

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర కమిటీ సభ్యుడు ఉడుత రవీందర్, సీనియర్ నేతలు నక్కల యాదవ రెడ్డి, గోపాలస్వామి సత్తిరెడ్డి, భాస్కర్,  వెంకట్ మావో, ఆలేటి యాదగిరి, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.