
వ్యవహారాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లా: మంత్రి సీతక్క
హైదరాబాద్, వెలుగు: సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు దేశంలో ఉన్న దివ్యాంగుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని మంత్రి సీతక్క అన్నారు. ఒక ఉన్నతాధికారిగా ఉండి ఫిజికల్ ఫిట్ నెస్ గురించి స్మిత అలా మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. మంగళవారం సీఎల్పీ ఆఫీస్ దగ్గర మీడియాతో సీతక్క చిట్ చాట్ చేశారు. ఎంతో మంది దివ్యాంగులు సివిల్స్ లో మంచి ర్యాంకులు సాధించి పాలనలో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చారన్నారు.
స్మిత వ్యాఖ్యలు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లాయని, తాను కూడా తీసుకెళ్తానని తెలిపారు. ‘‘సెంట్రల్ సర్వీసుకు వెళ్లాలని స్మిత కోరుకుంటే వెళ్లవచ్చు. మాకేం అభ్యంతరం లేదు. ఫిజికల్ ఫిట్ నెస్ అనేది దేవుడిచ్చిన వరం. అనాదిగా ఒకరకమైన మనస్తత్వం ఉన్నవారికే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఇప్పటికైనా అలా మాట్లాడడం మానుకోవాలి. ఇతరుల సమర్థత గుర్తించని వారే మానసిక వైకల్యంతో బాధపడుతున్నట్లు’’ అని అన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలు బయటకు చెప్పకూడదని సీతక్క సూచించారు.