- సేవే లక్ష్యంగా, ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ముందుకెళ్తాం
- శ్రీనివాసుల సేవా సమితి ఫౌండర్ వూటుకూరి శ్రీనివాస్‌రెడ్డి
కొత్తపల్లి, వెలుగు: కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ శివారులోని ఓ ఫంక్షన్ హాల్ వేదికగా ఆదివారం తెలంగాణ శ్రీనివాసుల సమ్మేళనం ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. సమ్మేళనంలో జగిత్యాలవాసి శ్రీనివాసుడి వేషధారణలో అలరించారు. అయోధ్య రాముడి పాదుకలను శ్రీనివాసుల దర్శనార్థం వేదికపై ఉంచారు. కొండగట్టు గిరి ప్రదక్షిణ నిర్వాహకులు, చిలుకూరు బాలాజీ టెంపుల్ పూజారి సురేశ్ ఆత్మారాం మహారాజ్, తాటిచర్ల హరికిషన్ శర్మ శ్రీనివాస్ పేరు గొప్పతనాన్ని వివరించారు. కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీతో పాటు దేశవిదేశాల్లో ఉంటున్న 2,500 మంది శ్రీనివాస్ పేరు గల వ్యక్తులు ఒకే వేదికపై కలుసుకున్నారు. 250 మంది తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదానం చేశారు. శ్రీనివాస్ పేరు గల 2,500 మంది ఒకే వేదికగా కలవడం అరుదైనదిగా గుర్తించిన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ డైరెక్టర్ రాంప్రకాశ్ తమ రికార్డ్స్‌లో చోటు కల్పించి శ్రీనివాసుల సేవా సమితి ఫౌండర్ వూటుకూరి శ్రీనివాస్‌రెడ్డికి అవార్డును అందజేసి అభినందించారు.
సేవే లక్ష్యంగా ముందుకెళ్తాం..
సామాజిక సేవే లక్ష్యంగా, ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ముందుకెళ్తామని సేవా సమితి ఫౌండర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శ్రీనివాస్ అనే పేరున్న వారంతా ఒక సమూహంగా ఏర్పడాలనే లక్ష్యంతో శ్రీనివాసుల సేవాసమితి ఏర్పడిందని చెప్పారు. 46 వాట్సాప్ గ్రూపులతో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, 26 వేల మంది సభ్యులు వాట్సాప్ గ్రూపుల్లో చేరారని, టీఎస్ఎస్ఎస్ పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సామాజిక, సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. శ్రీనివాస్ పేరు ఉన్నవారు పేదరికంలో ఉన్నా, అనారోగ్యంతో బాధపడుతున్నా చేయూత అందిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్లు, ఇంజినీర్లు, ఉద్యోగులు, వ్యాపారులు, దినసరి కూలీలు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు అనే తేడా లేకుండా శ్రీనివాస్ పేరు ఉన్న వారందరనీ టీఎస్ఎస్ఎస్ లో చేర్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
