కేసీఆర్ ఉద్యోగం ఊడ్తది .. బీఆర్ఎస్​కు జనం ఓటెయ్యరు: లక్ష్మణ్

కేసీఆర్ ఉద్యోగం ఊడ్తది .. బీఆర్ఎస్​కు జనం ఓటెయ్యరు: లక్ష్మణ్

 

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఉద్యోగం ఊడటం ఖాయమని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బీఆర్ఎస్ కు ఓటెయ్యడానికి ప్రజలు సిద్ధంగా లేరని చెప్పారు. సందట్లో సడేమియాలా కాంగ్రెస్ దూరేందుకు ప్రయత్నిస్తున్నా, ఆ పార్టీని ప్రజలు పట్టించుకోవడం లేదని కామెంట్ చేశారు. గురువారం సోమాజిగూడలోని బీజేపీ మీడియా సెంటర్ లో లక్ష్మణ్ మాట్లాడారు. ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉన్నాయని చెప్పారు. ‘‘ఈ ఎన్నికల్లో నిరుద్యోగమే ప్రధాన అజెండా. కొలువుల కోసం కొట్లాడిన తెలంగాణలో కొలువులే రాకుండా పోయాయి. ఉద్యోగాల కోసం ఎదురుచూసి చివరికి యువత బతుకు భారంగా మారింది. ఆనాడు నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఇప్పుడు అదే రీతిన కేసీఆర్ ను ఓడించి బీజేపీని గెలిపించాలని జనం ఎదురుచూస్తున్నారు” అని అన్నారు. ట్విట్టర్ టిల్లు మాత్రం 2లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గప్పాలు కొడుతున్నాడని కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. 

బిడ్డకు మాత్రం ఉద్యోగం ఇచ్చుకున్నడు.. 

రాష్ట్రంలో 3 లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని లక్ష్మణ్ చెప్పారు. 50 లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఉన్నారని తెలిపారు. ‘‘ఈ పదేండ్లలో ఒక్క గ్రూప్ ఉద్యోగానికి కూడా కేసీఆర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగాలను ఊడబీకిండు. 10 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను మెడలు పట్టి  బయటకు పంపిండు. రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉండరని ప్రగల్భాలు పలికి.. చివరికి మొహం చాటేసిండు. ఉద్యోగం పోయిన తన బిడ్డకు మాత్రం దొడ్డి దారిన ఉద్యోగం ఇచ్చుకున్నడు” అని మండిపడ్డారు. నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పి, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. ‘‘నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేసిండు. ఇట్ల అబద్ధాలు చెప్పే నాయకుడు ప్రపంచంలో ఎక్కడా లేడు. నిరుద్యోగులకు కొలువులు రావాలంటే కేసీఆర్ కొలువు పోవాలి. నిరుద్యోగుల తల్లిదండ్రులు ఆలోచన చెయ్యాలి.  ఓటర్లు ఫూల్స్ కాదు.. షూటర్స్ అని నిరూపించుకునే సమయం ఆసన్నమైంది” అని అన్నారు.