15 వేల వేకెన్సీలుంటే 9,168 పోస్టులకే అనుమతి

15 వేల వేకెన్సీలుంటే 9,168 పోస్టులకే అనుమతి
  • దాదాపు 5,485 పోస్టులు నష్టపోతున్న నిరుద్యోగులు!

హైదరాబాద్, వెలుగు : గ్రూప్​4 ఖాళీల్లో ప్రభుత్వం కోత పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్ 4 స్థాయి ఖాళీలు ఎక్కువగా ఉన్నా.. తక్కువ సంఖ్యలో చూపించి, భర్తీకి అనుమతులు ఇచ్చింది. ఖాళీల లెక్కలు చూపకుండా మిగిల్చిన పోస్టులను ఇప్పుడు వీఆర్వోలతో సర్దుబాటు చేసేందుకు ప్లాన్ చేసింది. 15 వేలకుపైగా గ్రూప్ 4 ఖాళీలు ఉంటే, వాటిలో 9,168 పోస్టుల భర్తీకే క్లియరెన్స్ ఇచ్చింది. అంటే ఆరు వేల పైచిలుకు పోస్టులను తగ్గించింది. తాజాగా వీఆర్వోలను వివిధ డిపార్ట్​మెంట్లలో సర్దుబాటు చేసేందుకు జూనియర్ అసిస్టెంట్​ఖాళీలు ఎన్ని ఉన్నాయో పంపాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జిల్లాల నుంచి జీఏడీ, ఫైనాన్స్ డిపార్ట్​మెంట్లకు వివరాలు అందుతున్నాయి. దీంతో మిగులు ఉద్యోగులుగా చూపెడుతున్న వీఆర్వోలను 5,485 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో  భర్తీ చేయనున్నట్లు తెలిసింది. మరోవైపు వీఆర్వో పోస్టుల రద్దుతో దాదాపు 7,300 క్యాడర్ స్ర్టెంత్​ ప్రభుత్వ ఉద్యోగాల్లో తగ్గింది. ఫలితంగా నిరుద్యోగులు రెండు రకాలుగా నష్టపోనున్నారు. 

అప్పుడు రాని ఖాళీలు ఇప్పుడెలా?

మార్చిలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్ ఖాళీల వివరాలను ప్రకటించారు. అప్పుడు గ్రూప్ 4 కేటగిరీలో 9,168 ఖాళీలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఇటీవల అంతే సంఖ్యలో పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. దీంతో ఖాళీలు తక్కువే ఉన్నాయని అంతా భావించారు. తీరా ఇప్పుడు వీఆర్వో సర్దుబాటును ఏయే డిపార్ట్​మెంట్లలో ఎన్ని ఖాళీల్లో భర్తీ చేసే అవకాశం ఉందో కలెక్టర్లు రిపోర్టులు పంపుతున్నారు. దీంతో అప్పుడు ఖాళీలను తక్కువ చేసి చూపినట్లు చర్చ జరుగుతోంది. గ్రూప్ 4  ఖాళీలు పెరిగే చాన్స్ ఉందని గతంలో సీఎస్ కూడా ఒక రివ్యూలో అన్నారు. అయితే వాటిని వీఆర్వోల కోసం రిజర్వ్ చేయడంతో నిరుద్యోగులకు ఆ పోస్టులు దక్కకుండా పోతున్నాయి. దాదాపు 5,485 పోస్టులను నిరుద్యోగులు కోల్పోతున్నారు. ప్రభుత్వం కొత్త పోస్టులు మంజూరు చేసి ఉంటే నిరుద్యోగులకు ఎలాంటి నష్టం వచ్చేది కాదని ఆఫీసర్లు అంటున్నారు.