పోతిరెడ్డిపాడుకు అనుమతుల మాటేంది?

పోతిరెడ్డిపాడుకు అనుమతుల మాటేంది?

అవసరమా? కాదా? ఆగస్టు 11లోగా చెప్పండి
అప్పటి దాకా స్టే: ఎన్జీటీ

హైదరాబాద్, వెలుగు: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ, సంగమేశ్వరం(రాయలసీమ) లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అవసరమా? లేదా అనే విషయాన్ని ఆగస్టు 11లోగా చెప్పాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. ఏపీ 203 జీవో ద్వారా అక్రమ ప్రాజెక్టులు చేపడుతోందని నారాయణపేట జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ దాఖలుచేసిన పిటిషన్ ను ఎన్జీటీ చెన్నై బెంచ్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. పిటిషనర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. ఏపీ ప్రాజెక్టుతో దక్షిణ తెలంగాణకు నష్టం వాటిల్లుతుందని చెప్పారు. ఏపీ తలపెట్టినవి కొత్త ప్రాజెక్టులేనని, అనుమతుల్లేకుండా వాటి పనులు కొనసాగించొద్దని ఆదేశించాలని కోరారు.

కొత్తవి కాదు.. పాతవే
శ్రీశైలంలో భాగమైన ప్రాజెక్టులనే ఇప్పుడు కొనసాగిస్తున్నామని ఏపీ తరఫు లాయర్ వివరించారు. వీటి ద్వారా కొత్తగా ఆయకట్టుకు నీరివ్వడంలేదు, ముంపు సమస్య ఉండదు.. అందువల్ల వీటికి పర్యావరణ అనుమతులు అక్కర్లేదన్నారు. అసలు ఈ పిటిషన్ కు విచారణ అర్హతే లేదని, కొట్టేయాలని కోరారు. ఏపీ వాదనతో ఎన్జీటీ జ్యూడిషయల్ మెంబర్ రామకృష్ణన్ ఏకీభవించలేదు. ఏపీ చేపట్టిన కొత్త ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు అవసరమా లేదా చెప్పాలంటూ కేంద్రాన్ని ఆదేశించారు. కొత్త ప్రాజెక్టులకు అడ్మినిస్ట్రేటివ్ పనులు చేసుకోవచ్చని, ఎన్జీటీ తుది ఆదేశాలు ఇచ్చేదాకా ఎలాంటి పనులు ప్రారంభించవద్దని రామకృష్ణన్ స్పష్టంచేశారు.

For More News..

రాజస్థాన్‌‌లో గెహ్లాట్, పైలట్‌‌.. నువ్వా? నేనా?

లాక్డౌన్ పూర్తిగా ఎత్తేద్దాం: కేంద్రం.. మళ్లీ పెడదాం : రాష్ట్రాలు

జూన్ 30న కేబినెట్ మీటింగ్ జరిగిందా?