పట్టుదలతోనే విజయం

పట్టుదలతోనే విజయం

ఈ సృష్టిలోకి ప్రవేశించి, జీవిస్తున్న ప్రతి ప్రాణీ ఏదో ఒక పని చేస్తుండాలి, ఏదో ఒకటి సాధిస్తుండాలి. ఏది సాధించాలన్నా మనిషిలోకి నిరాశ, నిస్పృహ అనే రెండు లక్షణాలు ప్రవేశించకూడదు. ఆ రెండు లక్షణాలతో జీవించేవారు దేనినీ సాధించలేకపోతారు అని మన ఉపనిషత్తులు చెబుతున్నాయి. మానవుడు ఆకాశంలో విమానంలో ప్రయాణిస్తున్నాడు, సముద్రంలో ఓడలో ప్రయాణిస్తున్నాడు, అంతరిక్షంలోకి ప్రవేశిస్తున్నాడు, చంద్రుని మీద అడుగు పెట్టాడు, అంగారకుడి మీద పరిశోధనలు సాగిస్తున్నాడు, హిమాలయాలు అధిరోహించాడు. కేవలం సాధించాలనే తపన, ఆత్మస్థైర్యంతోనే ఇన్ని విజయాలు చవిచూశాడు మానవుడు. ‘అమ్మో! ఇవి సాధించటం మన వల్ల అయ్యేపనేనా’ అని మన శాస్త్రవేత్తలు వెనకడుగు వేసి ఉంటే, సృష్టి రహస్యాలను మనం తెలుసుకోలేకపోయేవారు. ఎక్కని శిఖరాగ్రాలను చేరాలనే తపన ఎన్నో యుగాల క్రితమే భారతీయ వేదాంతులలో ఉండేది. ఈ ప్రయాణంలో ఎదురయ్యే ఓటమిని స్వీకరించకుండా, అత్యున్నత శిఖరాగ్రాలకు చేరేవరకు వారు తమ యాత్రను సాగించారు. పర్వతాలను అందునా మంచు పర్వతాలయిన హిమాలయాలను అధిరోహించడం దుస్సాధ్యం అనుకుంటాం. కాని అంతటి దుస్సాధ్యమైన పర్వతాలను ఎక్కటాన్ని పర్వతారోహకులు సవాలుగా తీసుకుంటారు. తమ మనసులను ధైర్యస్థైర్యాలతో నింపుకుని యాత్ర ప్రారంభిస్తారు. దారిలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతుంటాయి. దృఢచిత్తంతో అలుపు, విసుగు చెందక శిఖరాగ్రం చేరేవరకు తమ దీక్షను విరమించరు. ‘అమ్మో! ఈ పర్వతం ఎక్కడం చాలా కష్టం. ఇంత చలిలో గడ్డకట్టిపోతూ, ఎక్కడ ప్రమాదాలు ఎదురవుతాయో తెలియకుండా ఈ సాహసం చేయటం అవసరమా’ అనుకుంటే టెన్జింగ్‌‌ నార్గే, ఎడ్మండ్‌‌ హిల్లరీ వంటి వారు హిమాలయాల మీద జండా ఎగురవేసేవారు కాదు. ఇస్రో వంటి సంస్థ ఎన్నో ఉపగ్రహాలను పంపుతూ ఉంటుంది. వాటిలో కొన్ని అపజయం తీసుకువస్తాయి. చంద్రయాన్‌‌ 2 సమయంలో ఎదురైన పరాజయాన్ని శాస్త్రవేత్తలు సవాలుగా తీసుకుని, మరోమారు చంద్రగ్రహం మీదకు వెళ్లటానికి పరిశోధనలు కొనసాగిస్తున్నారు. అపజయం ఎదురైంది కనుక, ఇంక ఈ పరిశోధన ఆపేద్దాం అనుకుంటే, చంద్రగ్రహం గురించిన సత్యాలు ఎన్నటికీ తెలుసుకోలేకపోతాం. శాస్త్రవేత్తలు ధైర్యం కోల్పోకుండా, ఈ అపజయాన్ని... విజయానికి మెట్టుగా భావిస్తూ, మళ్లీ పరిశోధన కొనసాగిస్తున్నారు. అదే విధంగా ఈ సృష్టి గురించి అర్థం చేసుకోవాలనుకునేవారు కూడా తమ అనుభూతి జ్ఞానం అనే శిఖరాగ్రం చేరటానికి ఉబలాటపడతారు. ఈ ప్రయాణంలో అన్వేషిస్తున్న కొలదీ మనం చూసే ప్రతి రహస్యం మనలో కుతూహలం కలిగిస్తుంది. ఆ రహస్యం గురించి తెలుసుకుని జ్ఞానం పెంచుకోవాలనుకునేవారు ఎవరో ఒకరు ప్రశ్నిస్తూనే ఉంటారు. పరిశోధన చేపడుతూనే ఉంటారు. విజ్ఞాన శాస్త్రంలో కొందరు శాస్త్రవేత్తలు ప్రత్యక్ష ప్రమాణాలకే పరిమితమవుతారు. మరి కొందరు ఆ పరిధిని దాటి తత్త్వ స్వరూపాన్ని తెలుసుకోవటంతో పాటు, ఆ రహస్యానికి మూల హేతువు ఏమిటి అనే మౌలిక విషయాల వైపు దృష్టిని మరల్చుతారు. ఆ అన్వేషణలో వారికి కావలసిన సమాధానం దొరక్కపోయినా, సమాధానం దొరికేవరకు ప్రయత్నాన్ని విడిచిపెట్టరు. ప్రశ్నించే తెగువతో.. స్వేచ్ఛగా పట్టుదలతో సత్యాన్ని శోధిస్తారు. ఆధునిక శాస్త్రవేత్తలు సత్యాన్వేషణను నిర్భయంగాను, సాంప్రదాయికంగా సాగించటం శుభసూచకం. వేదాంతులలో కూడా ఉండే ఈ ధోరణి గురించి మ్యాక్స్‌‌ ముల్లర్, ‘‘వేలాది సంవత్సరాల క్రితం చింతనాశీలురైన భారతీయులు భయం, బడలిక లేక వేదాంతం వంటి దర్శన శాస్త్రానికి రూపకల్పన చేశారన్నది మనల్ని నిజంగా ఆశ్చర్య పరుస్తుంది. జనసామాన్యం మెప్పు పొందాలని కాని, విమర్శకులను సమాధాన పరచాలని కాని కలవరం వారికి లేకపోవడమే ఇందుకు కారణం’’ అన్నారు. ఎవరి మెప్పు కోసమో ఏ పనినీ చేయకూడదు. ఏ పని చేసినా అది ప్రజలకు ఉపయోగపడాలనే ఆలోచనతోనే ఉండాలి అని మ్యాక్స్‌‌ముల్లర్‌‌ మాటలను బట్టి అర్థం అవుతుంది.                                       -  డా. వైజయంతి పురాణపండ ఫోన్: 80085 51232