వీడియో: యాక్సిడెంట్ అయిన వ్యక్తిని.. మరో కారు ఢీ

వీడియో: యాక్సిడెంట్ అయిన వ్యక్తిని.. మరో కారు ఢీ

షామీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆక్సిడెంట్ అయిన వ్యక్తిని ఎవరూ పట్టించుకోకపోవడంతో.. మరో వాహనం ఢీకొని మృతిచెందాడు. ఈ దారుణ ఘటన తుర్కపల్లి పరిధిలో జూలై 14న జరిగింది. మెదక్ జిల్లాకు చెందిన మొలుగు చంద్రం పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన జూలై 14న షామీర్‌పేటలోని తన బంధువుల ఇంటికి వచ్చాడు. అక్కడ వారితో కలిసి మద్యం సేవించాడు. అనంతరం రాత్రి తన ఇంటికి బయలుదేరాడు. అయితే మత్తులో ఉన్న చంద్రం.. తుర్కపల్లి సమీపంలోని ఓ ధాబా వద్దకు రాగానే.. ముందు వెళ్తున్న లారీని వెనుకనుంచి ఢీకొట్టాడు. దాంతో కిందపడిన చంద్రానికి తీవ్ర గాయాలయి.. అక్కడే పడిపోయాడు. ప్రమాదాన్ని గమనించిన ధాబా సిబ్బంది బయటకు వచ్చారే కానీ.. చంద్రాన్ని లేపి పక్కకు తీసుకురాలేదు కదా.. కనీసం దగ్గరకు కూడా వెళ్లి చూడలేదు. కాగా.. చంద్రం ప్రమాదానికి గురికావడం మొత్తం.. ధాబా ముందున్న సీసీ కెమెరాలలో రికార్డయింది.

రాత్రి సమయం కావడం.. పైగా వర్షం కూడా పడుతుండటంతో అటుగా వచ్చిన వాహనాలు కూడా ఆగలేదు. రోడ్డుపై పడి ఉన్న చంద్రం దగ్గరికి వాహనాలు రావడం.. చూసి తిప్పుకొని వెళ్లిపోవడం కూడా వీడియోలో రికార్డయింది. రాత్రి 11.04 నిమిషాలకు ప్రమాదం జరిగితే.. 11.09 నిమిషాల వరకు చంద్రం రోడ్డుపై ఆర్తనాదాలు చేశాడు. కాసేపటిగా అటుగా దూసుకొచ్చిన కారు.. చంద్రం మీది నుంచి వెళ్లడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని ప్రజలకు సూచించారు.

ప్రమాదాన్ని చూసిన ఎవరైనా స్పందించి ఉంటే చంద్రం ప్రాణాలతో ఉండేవాడు. నిర్లక్ష్యం కారణంగా ఈ రోజు చంద్రం కుటుంబం ఒంటరిదైంది. మానవత్వం మంటకలిసిందనడానికి ఈ ప్రమాదం ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. అందుకే ఎవరైనా ప్రమాదానికి గురైతే.. ఎవరో ఒకరు అంబులెన్స్‌కు ఫోన్ చేస్తారని భావించకుండా.. మీరే ఆ పనిచేస్తే ఒక బాధ్యత గల వ్యక్తిగా నడుకున్నవారవుతారు.