చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. GPS అమర్చిన పెంపుడు కుక్క మృతి

చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. GPS అమర్చిన పెంపుడు కుక్క మృతి

ఆంధ్రప్రదేశ్‎లో సంచలనం సృష్టిస్తోన్న మూడేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. కేసు విచారణలో కీలకంగా మారిన పెంపుడు కుక్క హఠాత్తుగా మరణించింది. దీంతో జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది. పెంపు కుక్క హఠాన్మరణంతో ఈ కేసుపై మరిన్ని అనుమానాలు నెలకొన్నాయి.

అసలేం జరిగిందంటే..? 

ఆంధ్రప్రదేశ్‎లోని కాకినాడ జిల్లాలో తునిలో వారం రోజుల క్రితం మూడేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఇంటి ఆడుకోవడానికి బయటకు వెళ్లింది. పెంపుడు కుక్కతో కలిసి బయటకు వెళ్లిన చిన్నారి తిరిగి ఇంటికి రాలేదు. తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు చిన్నారి కోసం చుట్టు పక్కల ప్రాంతాల్లో తీవ్రంగా గాలించారు. కానీ పాప ఆచూకీ ఎక్కడ లభ్యం కాలేదు. దీంతో జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

చిన్నారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో జ్ఞానేశ్వరితో బయటకు వెళ్లిన పెంపుడు కుక్క మూడు రోజుల క్రితం తిరిగి ఇంటికి వచ్చింది. కానీ చిన్నారి రాలేదు. దీంతో జ్ఞానేశ్వరి ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ఆ పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చారు.

►ALSO READ | వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరో కార్మికుడు మృతి.. 10కి చేరిన మృతుల సంఖ్య

కుక్క ద్వారా పాప జాడ కనిపెట్టేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో కేసు చేధనలో కీలకంగా మారిన పెంపుడు కుక్క శనివారం (జూన్ 13) మరణించింది. కుక్క ఇంటికి తిరిగి వచ్చిన రోజు నుంచి అవస్థతగా ఉండటంతో వైద్యులు పర్యవేక్షించి ట్రీట్మెంట్ అందించారు. కానీ పరిస్థితి విషమించి కుక్క మృతి చెందింది. 

విచారణలో కీలకంగా మారిన పెంపుడు కుక్క హఠాన్మరణంతో కేసు మళ్లీ మొదటికి వచ్చింది. జీపీఎస్ ట్రాకర్ అమర్చిన వెంటనే కుక్క చనిపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీని వెనుక ఎవరిదైనా కుట్ర ఉందా..? చిన్నారి కుటుంబానికి ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా..? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.