కోకాపేటలో ‘పెట్ ఫస్ట్ ఆస్పత్రి’ షురూ

కోకాపేటలో   ‘పెట్ ఫస్ట్ ఆస్పత్రి’ షురూ

ప్రారంభించిన స్పీకర్, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు

గండిపేట, వెలుగు: పెంపుడు జంతువుల కోసం రంగారెడ్డి జిల్లా కోకాపేటలో పెట్​ఫస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీన్ని  స్పీకర్ గడ్డం ప్రసాద్​కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, అనిల్, ఎమ్మెల్సీ అమీర్ ఆలీ,  రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్​సింగ్​ఠాకూర్ బుధవారం​ప్రారంభించారు. 

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మిగతా సిటీలతో పోలిస్తే హైదరాబాద్ లో ఎక్కువ మంది పెట్స్ పెంచుకుంటుంటారని తెలిపారు. పెంపుడు జంతువుల కోసం పెట్ హాస్పిటల్స్ రావడం అవసరమన్నారు. తాను కూడా స్వయంగా పెట్ లవర్ ను అని పేర్కొన్నారు. పెట్​ఫస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మంచి సేవలు అందించేందుకు కృషి చేయాలని కోరారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మనుషులకు ఎక్కడికి వెళ్లినా ట్రీట్​మెంట్​దొరుకుతుందని, అదే పెట్స్​కు కొన్ని క్లినిక్స్​మాత్రమే ఉన్నాయన్నారు.

 24 గంటలు సేవలందించేలా పెట్​ఫస్ట్​మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్​ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. మూగ జీవుల పట్ల చాలా మంది శ్రద్ధ చూపుతున్నారని, వాటికి ఏమన్నా అయితే తట్టుకోలేపోతున్నారని తెలిపారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. మనుషులకంటే కుక్కలు విశ్వాసంగా ఉంటాయని, వాటికి ఏమీ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

‘పెట్ ఫస్ట్’ వ్యవస్థాపకురాలు, ఎండీ పద్మజ మాట్లాడుతూ.. తమ హాస్పిటల్​లో అధునాతన రోగ నిర్ధారణ పరీక్షలు, అత్యవసర సంరక్షణ, ప్రత్యేక చికిత్సలు, వెల్నెస్ కార్యక్రమాలు, పెంపుడు జంతువుల పునరుజ్జీవన కేంద్రం, పెంపుడు జంతువుల శిక్షణ ఉంటుందన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ.. పెంపుడు జంతువులకు ఉత్తమ సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.