
అమెరికా రోజురోజుకూ భారతదేశంపై ఒత్తిడిని పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ఒకపక్క రష్యా, చైనా వంటి దేశాలతో స్నేహం చేసేందుకు మోడీ చేస్తున్న ప్రయత్నాలు అమెరికాకు అస్సలు మింగుడు బడటం లేదు. భారత్ ఒక చిన్న ప్లేయర్ కాదని దానిని జాగ్రత్తగా డీల్ చేయాలంటూ చాలా మంది సూచిస్తున్నప్పటికీ అమెరికా అధికార వర్గాలు మాత్రం తమ ఆరోపణలను ముమ్మరం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే కేవలం వారం రోజుల్లో రెండోసారి యూఎస్ వైట్ హౌస్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారో ఇండియాపై అటాక్ చేశారు. ఈసారి ఆయన భారత్ రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోళ్లను ‘Brahmins profiteering…’ అంటూ సంచలన కామెంట్స్ చేశారు. భారతదేశంలోని ప్రజల ప్రయోజనాల కంటే ప్రభుత్వానికి సంపన్న వర్గాల లాభాలే ముఖ్యమయ్యాయి అంటూ నవారో సూటిగా మోడీ ప్రభుత్వాన్ని నింధించారు.
రష్యా నుంచి తక్కువ రేటుకు వస్తున్న క్రూడ్ ఆయిల్ కొంటున్న భారతదేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రిఫైనరీలు.. వాటిని శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్ సహా ఇతర పెట్రోలియం ఉత్పత్తులుగా మార్చు యూరప్, ఆఫ్రికా, ఆసియా మార్కెట్లకు అధిక ధరకు అమ్ముతూ పెద్ద లాభాలు పొందుతున్నారని పీటర్ నవారో పేర్కొన్నారు. దీనివల్ల భారతదేశంలోని సంపన్న కుటుంబాలు, ముఖ్యమైన బిజినెస్ ఫ్యామిలీలకు లాభపడుతున్నాయే తప్ప సగటు భారతీయుడికి ఎలాంటి తగ్గింపు ప్రయోజనం దక్కటం లేదని నవారో అన్నారు. ఈ పద్ధతిలో ఇప్పటికే భారత సంపన్న వ్యాపార వర్గాలు దాదాపు 16 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలు లక్ష 36వేల కోట్ల రూపాయలకు పైగా లాభాలను తమ జేబులో వేసుకున్నాయని బట్టబయలు చేశారు.
అయితే ఇక్కడితో ఆగని నవారో భారత్ రష్యా చమురు వ్యాపారానికి ఒక ప్రాసెసింగ్ కేంద్రంగా మారిందంటూ “laundromat for Kremlin” అంటూ కామెంట్ చేశారు. దీనికి అర్థం రష్యా క్రూడాయిల్ ఇండియాలో రిఫైన్ చేయబడి ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాలకు ఎగుమతి అవుతోందని.. దీని వల్ల పరోక్షంగా రష్యా ఆర్థికంగా యుద్ధం వల్ల దెబ్బతినకుండా అవసరమైన నిధులను సమకూర్చుకుంటోందని అభిప్రాయపడ్డారు నవారో.
ALSO READ : భారత్ ను పిల్లాడిలా ట్రీట్ చేయొద్దు
ఇండియా చేస్తున్న ఈ బిజినెస్ వల్ల రష్యా యుద్ధం మరింత కాలం కొనసాగించటానికి, తనను తాను ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి ఉపయోగపడుతోందన్నారు. ఈ చర్యలు అమెరికా, యూరోపియన్ దేశాలపై అదనపు భారాన్ని కలిగిస్తున్నాయని, తమ దేశంలోని ప్రజలు యుద్ధ భారాన్ని మోయాల్సి వస్తోందని చురకలు అంటించారు నవారో.
ఈ క్రమంలో అమెరికా భారతదేశంపై 50 శాతం సుంకాలు విధించటం సరైనదేనని సమర్థించారు. అయితే నవారో లేదా అమెరికా ప్రభుత్వం రష్యా చమురు కొనుగోళ్లపై చేస్తున్న ఆరోపణలను భారత్ కూడీ తీవ్రంగానే తిప్పికొడుతోంది. మీకు భారత్ నుంచి ఇంధనం, రిఫైన్స్ ఉత్పత్తులు కొనటం ఇబ్బందిగా ఉంటే మానుకోమని యూరప్, అమెరికాకు సూటిగా చెప్పేశారు భారత విదేశాంగ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్. ఇష్టం లేనప్పుడు వదిలేయచ్చుగా అంటూ యూఎస్, యూరప్ తీరుపై కామెంట్ చేశారు. అయితే భారతదేశంలోని రాజకీయ విశ్లేషకులు నవారో కామెంట్స్ తొందరపాటు వ్యాఖ్యలంటూ ఖండిస్తున్నారు. ఈ పరిస్థితులు యూఎస్ భారత్ స్నేహబంధానికి బీటలు వారేలా చేస్తున్నాయని అంటున్నారు.