దశాబ్దాలుగా సాగులో ఉన్నాం.. పట్టాలివ్వండి

దశాబ్దాలుగా సాగులో ఉన్నాం.. పట్టాలివ్వండి

మెట్ పల్లి, వెలుగు: ముప్పై ఏండ్లుగా పోడు భూముల్లో ఎవుసం చేసుకుని బతుకుతున్నామని, తమకు పోడు భూముల పట్టాలు ఇప్పించాలని జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం కేసీఆర్ తండా, ఏఎస్సార్ తండా పంచాయతీ సభ్యులు కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుకు గురువారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  దశాబ్దాలుగా పోడు పట్టాల కోసం ఉద్యమాలు చేశామని,  ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పోడు భూములు సాగు చేస్తున్న గిరిజనులకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని  చెప్పడంతో సంబరపడ్డామని తెలిపారు.  

కొన్ని నెలల కింద పోడు పట్టాల కోసం అప్లికేషన్లు పెట్టుకోవాలని చెప్పడంతో కేసీఆర్ తండా నుంచి 115, ఏఎస్సార్ తండా నుంచి 94 మంది అప్లికేషన్లు పెట్టుకున్నామన్నారు.  సంబంధిత ఆఫీసర్లు తండాకు వచ్చి సర్వే నిర్వహించి,  ఏ ఒక్కరినీ అర్హులుగా గుర్తించలేదని వాపోయారు. తమ భూముల పక్కనే ఉన్న బాల్కొండ  నియోజకవర్గంలోని బీంగల్, కమ్మర్​పల్లి మండలం గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చేందుకు అర్హులుగా గుర్తించారని తెలిపారు. 

దశాబ్దాలుగా ఈ భూములను నమ్ముకొని వ్యవసాయం చేస్తూ జీవిస్తున్న తమకు పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని  ఎమ్మెల్యే విద్యాసాగర్ రావును కోరామని చెప్పారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే కలెక్టర్ తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారని తెలిపారు.  కార్యక్రమంలో కేసీఆర్ తండా, ఏఎస్సార్ తండా పంచాయతీ పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు.