అసలు టీఎస్‌ఆర్టీసీనే లేదు.. ప్రైవేటు ఎలా చేస్తారు?

అసలు టీఎస్‌ఆర్టీసీనే లేదు.. ప్రైవేటు ఎలా చేస్తారు?
  • హైకోర్టు సెక్రెసీతో పని చేస్తోంది.. ఇది రాజ్యంగ వ్యతిరేక తీర్పు
  • రూట్ల ప్రైవేటీకరణపై పిల్ కొట్టివేతపై పిటిషనర్ అసంతృప్తి

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై కేబినెట్ నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన ప్రొఫెసర్ పి.విశ్వేశ్వరరావు హైకోర్టు నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మోటార్ వెహికల్ చట్టం ప్రకారం రవాణా వ్యవస్థపై నిర్ణయం తీసుకునే హక్కు ఉందంటూ ఆ పిటిషన్‌ను కొట్టేసింది హైకోర్టు. న్యాయస్థానం విచారణ ముగిసిన తర్వాత పిటిషనర్ విశ్వేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. అసలు టీఎస్‌ఆర్టీసీ అనేదే లేదని, అలాంటప్పుడు రూట్ల ప్రైవేటీకరణ ఎలా సాద్యమని ఆయన ప్రశ్నించారు.  ఈ తీర్పు పూర్తిగా ప్రజావ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేకమని ఆయన అన్నారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు.

నోట్ చదవకుండానే తీర్పు ఇచ్చారు

రోజుకో రకమైన వాదనతో అఫిడవిట్ వేస్తున్నారని  ప్రభుత్వాన్ని తప్పుబట్టిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇప్పుడు ఈ రకమైన తీర్పు ఇవ్వడాన్ని ఎలా చూడాలని ప్రశ్నించారు పిటిషనర్ విశ్వేశ్వరరావు. హైకోర్టు సీక్రెసీతో పని చేస్తోందని అన్నారు. సీఎస్‌పై కోర్టు ధిక్కారం ఉందని, ఇవాళ మళ్లీ కేబినెట్‌ తీర్మానంలో ఒకలా ఉందంటూ.. ఇవాళ మరో లేఖ ఇస్తే దాన్ని ప్రధాన న్యాయమూర్తి ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. ‘కాన్ఫిడెన్షియల్ నోట్ ఇచ్చారు.. దీన్ని నేను చదవాలా? చదకూడదా?’ అంటూనే ప్రధాన న్యాయమూర్తి చదవకుండానే తీర్పు చెప్పారని అన్నారు.

రివ్యూ చేసే హక్కు ఉంది

రాష్ట్ర, కేంద్ర కేబినెట్లు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా వాటిని ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుందన్నారాయన. వాటిని రివ్యూ చేసే హక్కు కోర్టులకు ఉందని, దానికి సంబంధించి 27 సుప్రీం తీర్పులను హైకోర్టుకు ఇచ్చానని చెప్పారు. కానీ, రివ్యూ చేసే హక్కు లేదంటూ తీర్పు ఇవ్వడం దారుణమన్నారు.

ఈ ప్రైవేటీకరణ నిలబడదు

అసలు టీఎస్ ఆర్టీసీ అనేదే లేదని, ప్రస్తుతం ఉన్న ఆర్టీసీలో 33 శాతం కేంద్రం వాటా ఉందని పిటిషనర్ విశ్వేశ్వరరావు చెప్పారు. 5100 రూట్లు ప్రైవేటుకిస్తే వేల మంది ఉద్యోగులు ఏమైపోతారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే 27 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారని, ఈ తీర్పు చూస్తే హైకోర్టు మానవతా దృక్పథంతో పని చేయాల్సిన అవసరం ఉందనిపిస్తోందని అన్నారు. కార్మికులను, ఆర్టీసీని, ఎవరినీ పరిగణనలోకి తీసుకోకుండా ప్రైవేటు చేస్తామంటూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారని, ఇది ఇల్లీగల్ అని చెప్పారు పిటిషనర్. దీనిపై తాము సుప్రీం కోర్టుకు వెళ్తామని, ఈ ప్రైవేటీకరణ నిలబడేది కాదని ఆయన అన్నారు.

MORE NEWS: 

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

కాలిపై కాలేసుకుని కూర్చోవద్దు: అమెరికా డాక్టర్ సలహా

ఇవి ఊపిరితిత్తులే.. ఇంకా సిగరెట్​ తాగే ధైర్యం ఉందా!