పెట్రోల్, డీజిల్​​ జీఎస్​టీలోకి ఇప్పట్లో రానట్లే

 పెట్రోల్, డీజిల్​​ జీఎస్​టీలోకి ఇప్పట్లో రానట్లే

న్యూఢిల్లీ : పెట్రోలు, డీజిల్​లను జీఎస్​టీ కిందకి తేవడం రాబోయే పదేళ్లలో సాధ్యం కాకపోవచ్చని బీజేపీ ఎంపీ​, జీఎస్‌టీ కౌన్సిల్ మెంబర్‌‌ సుశీల్​ కుమార్​ మోడి అభిప్రాయపడ్డారు. వాటిని జీఎస్​టీ కిందకి తెస్తే రాష్ట్రాలకు ఏటా రూ. 2 లక్షల కోట్ల ఆదాయం పోతుందని చెప్పారు. కేంద్రం, రాష్ట్రాలు కలిపి ఏటా మొత్తం రూ. 5 లక్షల కోట్లను ట్యాక్సుల రూపంలో పెట్రోల్​, డీజిల్​లపై వసూలు చేస్తున్నాయని  రాజ్యసభలో ఫైనాన్స్​ బిల్​పై డిస్కషన్​లో మోడి పేర్కొన్నారు. గత ఏడాది కాలంగా పెరుగుతూనే ఉన్న పెట్రోల్​, డీజిల్​ రేట్ల​ దృష్ట్యా చూస్తే ఈ స్టేట్​మెంట్​ కీలకమైంది. కొన్ని రాష్ట్రాలలో పెట్రోల్​ రేటు ఏకంగా రూ. 100 ని తాకింది. పెట్రోల్​, డీజిల్​లను జీఎస్​టీ కిందకి తెస్తే, రాష్ట్రాలకు పోయే ఆదాయం రూ. 2 లక్షల కోట్లు ఎలా వస్తుందని మోడి ప్రశ్నించారు. ఒకవేళ జీఎస్​టీ కిందకి తెస్తే అత్యధిక శ్లాబ్​ 28 శాతం వసూలు చేయగలుగుతారని పేర్కొన్నారు. పెట్రోలియమ్​ ప్రొడక్ట్స్ రేట్లలో పన్నులకు ప్రస్తుతం 60 శాతం వాటా ఉంది. అంటే జీఎస్​టీ కిందకి తెస్తే కేంద్రానికి, రాష్ట్రాలకు కలిపి రూ. 2 లక్షల కోట్ల నుంచి రూ. 2.50 లక్షల కోట్ల ఆదాయం పోతుందని మోడి వివరించారు. జీఎస్​టీ కింద 28 శాతం చొప్పున ట్యాక్స్​ వసూలు చేస్తే పెట్రోల్​పై అది లీటర్​కు రూ. 14 అవుతుంది. కానీ, ఇప్పుడు ట్యాక్స్​ రూ. 60 దాకా ఉందని అన్నారు. పెట్రోల్​ లేదా డీజిల్​ లీటర్​ రేటు రూ. 100 అనుకుంటే, మొత్తం రూ. 60 ట్యాక్సులు. ఇందులో రూ. 35 కేంద్ర ట్యాక్సులైతే, రూ. 25 రాష్ట్ర ట్యాక్సు. పెట్రోల్​, డీజిల్​లపై విధించే ట్యాక్సులు నేరుగా ప్రభుత్వ ఖజానాలోకే వెళ్తున్నాయి. ఎలక్ట్రిసిటీ, ట్యాప్​ వాటర్​ వంటి సదుపాయాలను ప్రజలకు అందించేందుకు ఈ రెవెన్యూనే ప్రభుత్వాలు వెచ్చిస్తాయి. లేకపోతే అలాంటి సదుపాయాలకు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వాలకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని మోడి ప్రశ్నించారు. కొంత మంది జీఎస్​టీని గబ్బర్​ సింగ్​ ట్యాక్స్​గా అభివర్ణించారు. కానీ జీఎస్​టీ విధానంపై ఏ జీఎస్​టీ కౌన్సిల్​ మీటింగ్​లోనూ ఒక్క రాష్ట్రం కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదని మోడి వెల్లడించారు. కావాలంటే జీఎస్​టీ  కౌన్సిల్​మీటింగ్​ ప్రొసీడింగ్స్​ను వెరిఫై చేసుకోవచ్చని పేర్కొన్నారు. దేశంలో జీఎస్​టీ విధానాన్ని అమలు చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి నాయకత్వంలోని ప్రభుత్వానికి మాత్రమే దమ్ము ఉందని కూడా మోడి చెప్పారు. 

ఏడాది తర్వాత మొదటిసారి తగ్గిన పెట్రోల్​, డీజిల్​...
సంవత్సర కాలం తర్వాత దేశంలో మొదటిసారిగా బుధవారం నాడు పెట్రోల్​, డీజిల్​ రేట్లను తగ్గించారు. లీటర్​ పెట్రోల్​ రేటును 18 పైసలు, లీటర్​ డీజిల్​ రేటును 17 పైసలు చొప్పున ఆయిల్​ మార్కెటింగ్​ కంపెనీలు తగ్గించాయి. గ్లోబల్​ మార్కెట్లలో క్రూడ్​ ధరలు బాగా దిగి రావడమే రేట్లు తగ్గించేందుకు కారణం. ఢిల్లీలో  లీటర్​ పెట్రోల్​ రేటు రూ. 90.99కి, లీటర్​ డీజిల్​ రేటు రూ. 81.47 కి చేరాయి. ఆయా రాష్ట్రాలలోని వ్యాట్​మీద ఆధారపడి రేట్ల తగ్గింపు ఉంటుంది. మార్చి 16,2020 తర్వాత పెట్రోల్​, డీజిల్​ రేట్లు తగ్గించడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్‌‌ డీజిల్‌ రేటు రూ. 88.67 గా, పెట్రోల్‌ రేటు రూ. 94.61 గా ఉంది.