లీటర్ పెట్రోల్ రూ. 250..డీజిల్ రూ. 262

లీటర్ పెట్రోల్ రూ. 250..డీజిల్ రూ. 262

పొరుగు దేశం పాకిస్తాన్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక సంక్షోభంతో పాక్ కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికే అక్కడి ప్రజలు తిండి దొరక్క నానా అవస్థలు పడుతుంటే..తాజాగా పాక్ ప్రజలపై అక్కడి ప్రభుత్వం పెట్రో బాంబు వేసింది. పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచింది.  పెట్రోల్ , డీజిల్ పై లీటర్కు రూ. 35 చొప్పున పెంచింది. దీంతో బంకుల వద్ద అక్కడి ప్రజలు బారులు తీరారు. 

పెట్రోల్, డిజిల్ పైనే కాదు..కిరోసిన్ ఆయిల్, లైట్ డీజిల్ ఆయిల్  ధరలను కూడా పాకిస్థాన్ ప్రభుత్వం రూ. 18 చొప్పున పెంచింది. మొత్తంగా నాలుగు రకాల పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పెంచినట్లు  పాక్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ వెల్లడించారు.  పెరిగిన ధరలతో కలిపి పాకిస్తాన్ లో లీటర్ డీజిల్ ధర రూ. 262.80కు చేరుకోగా..లీటర్ పెట్రోల్ ధర  రూ. 249.80కు చేరింది. అటు లీటర్ కిరోసిన్ ఆయిల్ ధర రూ. 189.83కు, లీటర్ లైట్ డీజిల్ ధర రూ. 187కు చేరుకుంది. 

పాక్లో ఆర్థిక సంక్షోభం కారణంగా గత వారం రోజులుగా పాకిస్థాన్ రూపీ దారుణంగా పతనమైంది. ఒకే రోజు ఏకంగా డాలర్కు 255 రూపాయలకు పడిపోయింది. మరోవైపు సంక్షోభం నుంచి గట్టేక్కేందుకు ఐఎంఎఫ్ విడుదల చేసే 100 కోట్ల డాలర్ల బెయిల్ ఔట్ ప్రోగ్రామ్ కోసం పాక్ వేచి చూస్తోంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఐఎంఎఫ్ బృందం పాక్లో పర్యటించబోతుంది. వీరి పర్యటన తర్వాత పాక్కు నిధులు వస్తాయని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఇదిలా ఉంటే ఆర్థిక సంక్షోభం నుంచి గట్టేక్కేందుకు పాక్ ప్రభుత్వం పొదుపు చర్యలు ప్రారంభించింది. అక్కడి ఎంపీల జీతాల్లో 15 శాతం కోత విధించింది. వారి విదేశీ పర్యటనలు, లగ్జరీ వాహనాల కొనుగోళ్లపై నిషేధం విధించింది. అలాగే గ్యాస్, విద్యుత్ ధరలు పెంచే ఆలోచనలో ఉంది. అటు నిఘా సంస్థలకు కూడా విచ్చలవిడిగా నిధులు మంజూరు చేయొద్దని తీర్మానం చేసింది.