అంతా తూచ్ : పెట్రోల్ రేట్లు తగ్గుతాయని ఎవరు చెప్పారు..? : కేంద్ర మంత్రి

అంతా తూచ్ : పెట్రోల్ రేట్లు తగ్గుతాయని ఎవరు చెప్పారు..? : కేంద్ర మంత్రి

కొన్ని రోజులుగా ఓ శుభవార్త అనే వార్త చక్కర్లు కొడుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటర్ కు 10 రూపాయల వరకు తగ్గుతున్నాయని.. ఎన్నికలు రాబోతున్నాయని.. న్యూ ఇయర్ గిఫ్ట్ కింద మోదీ ప్రభుత్వం తగ్గిస్తుందంటూ ప్రచారం జరిగింది. ఇది నిజం అనుకుని చాలా పెట్రోల్ బంకులు స్టాక్ కూడా తెచ్చుకోలేదు.. ఈ క్రమంలోనే.. ఈ వార్తలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హరదీప్ సింగ్ ను.. ఢిల్లీలో ప్రశ్నించింది మీడియా..

పెట్రోల్ రేట్ల తగ్గింపు వార్తలను ఖండించారు కేంద్ర మంత్రి సింగ్.. అసలు అలాంటి ఆలోచన లేనప్పుడు తగ్గింపు ఎక్కడ ఉంటుందని స్పష్టం చేశారు.  పెట్రోల్ రేట్ల తగ్గింపు అనేది.. పూర్తిగా ఆయిల్ కంపెనీ చేతుల్లో ఉందని.. అయినా ఇప్పుడు అలాంటి ఆలోచన ఏదీ లేదని వివరించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో అల్లకల్లోలమైన పరిస్థితులు ఉన్నాయని.. రోజు రోజుకు క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్న సమయంలో.. ప్రస్తుతం ఉన్న ధరలను తగ్గించే అవకాశం లేదని తేల్చిపారేశారు కేంద్ర మంత్రి హరదీప్ సింగ్.

21 నెలలుగా పెట్రోల్, డీజిల్ రేట్లలో ఎలాంటి మార్పు లేదని.. ఇవే ధరలు మరికొన్ని రోజులు కొనసాగుతాయని వెల్లడించిన కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి.. ఉక్రెయిన్, రష్యా యుద్ధం... ఇజ్రాయేల్, హమాస్ మధ్య యుద్ధంతోపాటు ఎర్ర సముద్రంలో కార్గో షిప్పులపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయని.. ఆయిల్ ఉత్పత్తి దేశాలు.. ధరలను పెంచుతున్నాయని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ధరలు తగ్గటం ఏమోకానీ.. పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయనే సంకేతాలు ఇచ్చారు కేంద్ర మంత్రి.

ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ ధరల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉంటున్నాయని.. క్రూడ్ ఆయిల్ ధరలు స్థిరంగా ఉండాలని దేవుడిని ప్రార్థించాలంటూ మీడియాకే షాక్ ఇచ్చారు మంత్రి. ఓవరాల్ గా ఆయిల్ కంపెనీలు కొన్ని నెలలు లాభాల్లో ఉంటే.. మరికొన్ని నెలలు నష్టాల్లో ఉంటున్నాయని.. ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ రేట్ల తగ్గింపు అనేది లేదని స్పష్టం చేశారు.