బెంగళూరు మెట్రోలో.. పరుగులు పెట్టిన గుండె ! 20 కిలోమీటర్లు.. జస్ట్ 25 నిమిషాలు !

బెంగళూరు మెట్రోలో.. పరుగులు పెట్టిన గుండె ! 20 కిలోమీటర్లు.. జస్ట్ 25 నిమిషాలు !

బెంగళూరు: బెంగళూరు మెట్రో.. ప్రయాణికులను వేగంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే కాదు మనుషుల ప్రాణాలను కాపాడడంలోనూ కీలక పాత్ర పోషించింది. అత్యవసర సమయంలో అవయవాల తరలింపు కోసం గ్రీన్ చానెల్(ఏ స్టేషన్లో ఆగకుండా) ఏర్పాటు చేసి హృదయమున్న మెట్రోగా ‘నమ్మ మెట్రో’ నిలిచింది. 20 కిలోమీటర్ల దూరాన్ని 25 నిమిషాల్లో చేరుకుని డోనర్ హార్ట్ను హాస్పిటల్కు తరలించి ఒక ప్రాణాన్ని నిలబెట్టి.. బెంగళూరు నమ్మ మెట్రో ప్రశంసలు అందుకుంది.

బెంగళూరులోని నారాయణ హెల్త్ సిటీకి డోనర్ హార్ట్ను విజయవంతంగా చేర్చడంలో బెంగళూరు నమ్మ మెట్రో కీలక పాత్ర పోషించింది. బెంగళూరులోని రాగిగుడ్డ మెట్రో స్టేషన్ నుంచి డోనర్ హార్ట్ను బొమ్మసంద్ర ఎల్లో లైన్ వరకూ మెట్రో రైలులో తరలించారు. రాత్రి 7:32కు రాగిగుడ్డ మెట్రో స్టేషన్ నుంచి బయల్దేరిన మెట్రో రైలు 7:55కు అంటే.. 25 నిమిషాల్లో బొమ్మసంద్రకు చేరుకుంది. ఈ సమయంలో ఇదే రూట్లో రోడ్డు మార్గంలో వెళ్లాలంటే గంటల కొద్దీ సమయం పడుతుంది. మెట్రో రైలులో కేవలం 25 నిమిషాల్లో హార్ట్ను తరలించడం విశేషం.

మెట్రో రైలులో ఆర్గాన్స్​తీసుకువెళ్తే ట్రాఫిక్​కు సంబంధించిన ఇబ్బందులేమీ ఉండవు. సిగ్నల్స్​, దారి పొడవునా ట్రాఫిక్, సివిల్​పోలీసుల అవసరం ఉండదు. కేవలం మెట్రో లైన్లో మిగతా రైళ్లను స్లో చేసి, సర్వీసులను అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. రోడ్డు మార్గంతో పోలిస్తే మెట్రోలో వెళ్లడం వల్ల 50 శాతంపైనే టైమ్ సేవ్ చేయవచ్చు.

ఆర్గాన్స్​ ట్రాన్స్​పోర్ట్​ చేసే ట్రైన్లో ప్రయాణికులు ఎవరూ ఉండరు. కేవలం డాక్టర్లు, మెట్రో అధికారులు మాత్రమే సహాయంగా ఉంటారు. హైదరాబాద్ మెట్రో రైలు కూడా ఐదేండ్లలో ఇలా ఏడుసార్లు హృదయాలను తరలించి ఏడుగురు వ్యక్తుల ప్రాణాలను కాపాడింది. ఇదంతా కూడా ఒక్కరూపాయి తీసుకోకుండానే చేసింది. అవయవాలను వేగంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు, సామాజిక సేవ చేస్తూ మన్ననలు అందుకుంది.