పుట్టపర్తి సత్యసాయి బాబా బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా 2025 నవంబర్ 19వ తేదీన పుట్టపర్తిలో పర్యటించిన మోదీ.. సత్యసాయి బోధనల ప్రభావంతో దేశమంతా కనిపిస్తోందని అన్నారు. సత్యసాయి జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టమని అన్నారు మోదీ.
పుట్టపర్తి ఆధ్యాత్మిక భూమి.. వేడుకల్లో పాల్గొనటం తన అదృష్టమని అన్నారు ప్రధాని మోదీ. సత్యసాయి భౌతికంగా మనతో లేకున్నా.. ఆయన ప్రేమ మనతోనే ఉందన్నారు మోదీ. ప్రేమ, సేవకు సత్యాసాయి బాబా ప్రతిరూపంగా నిలిచారని కొనియాడారు. భక్తి, జ్ఞానం, కర్మ అనేవి సేవతోనే ముడిపడి ఉంటాయి.. బాబా జీవితం.. వసుధైక కుటుంబం అనే భావనతో సాగింది.. బాబా సేవే పరమావధిగా భావించారు- అని ఈ సందర్భంగా ప్రధాని మోదీ చెప్పారు. అంతకుముందు సత్యసాయి జీవితం, బోధనలు, సేవలకు గుర్తుగా రూ.100 నాణెం, 4 తపాలా బిళ్లలను మోదీ ఆవిష్కరించారు.
ప్రత్యక్ష దైవం సత్యసాయి:
సత్యసాయి బాబా జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రధాని మోదీతో పాటు పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రపంచంలో మనకు కనిపించిన ప్రత్యక్ష దైవం సత్యసాయి అని అన్నారు. సత్యసాయికి సమ్మోహన శక్తి ఉందని.. ఎంతో మంది నాస్తికులను ఆధ్యాత్మికతవైపు మళ్లించారని గుర్తు చేశారు. మానవసేవే.. మాధవ సేవ అని సత్యసాయి బాబా భావించేవారని.. సత్యసాయి సిద్ధాంతాన్ని అందరూ అర్థం చేసుకోవాలని సూచించారు సీఎం చంద్రబాబు. సత్యసాయి బాబా జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఎన్నో ప్రశ్నలకు బాబా దగ్గర సమాధానాలు దొరికాయి: సచిన్
ఉత్సవాల్లో పాల్గొన్న సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ.. బాబా బోధనలు తనలో ఎంతో ప్రేరణను ఇచ్చాయని అన్నారు. ఐదేళ్ల వయస్సులో ఉన్నప్పుడు నా వెంట్రుకలు సత్యసాయిలా ఉన్నాయనే వారని గుర్తు చేసుకున్నారు. తన మదిలో ఎన్నో ప్రశ్నలకు బాబా దగ్గర సమాధానాలు దొరికాయని చెప్పారు. ఆయన బోధనలు తనకు మార్గదర్శనం చేశాయని, బాబా ఆశీస్సులతో జీవితంలో ఎన్నో సాధించా-నని సచిన్ టెండూల్కర్ చెప్పుకొచ్చారు.
స్వామి బోధనలు ఆధ్యాత్మిక క్రమశిక్షణను నేర్పిస్తాయి: ఐశ్వర్యరాయ్
సత్యసాయి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నా సినీ నటి ఐశ్యర్యరాయ్ మాట్లాడుతూ.. స్వామి బోధనలు ప్రేమ, సేవ, ఆధ్యాత్మిక క్రమశిక్షణ అనే సందేశాన్ని చాటిచెపుతాయని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఆయన మార్గనిర్దేశం చేశారని చెప్పారు.
