ఆగని పెట్రో ధరల మోత.. వినియోగదారులకు వాత

ఆగని పెట్రో ధరల మోత.. వినియోగదారులకు వాత

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఆగడం లేదు. ఆయిల్‌ కంపెనీలు గత కొంతకాలం నుంచి వరుసగా పెట్రోల్‌, డీజిల్ ధరలు పెంచుతూనే వస్తున్నాయి. తాజాగా పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 9 పైసలు పెంచాయి. దాంతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.104.50కు, డీజిల్‌ ధర రూ.97.68కి చేరాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 9 పైసలు పెరిగింది. దాంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.100.56, డీజిల్‌ ధర రూ.89.62కు చేరింది. ఇక మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో లీటర్ పెట్రోల్ ధర 108.88 పైసలకు పెరగగా, డీజిల్ ధర రూ. 98.40 పైసలకు చేరింది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.62 పైసలకు చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ. 92.65 పైసలుగా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.59, డీజిల్‌ రూ.97.18 పైసలకు పెరిగింది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.34 పైసలుగా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 98.73 పైసలుగా ఉంది. 

కాగా.. మే 4 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత ఆరు నెలల్లో పెట్రోల్, డీజిల్ ధరలు 15 శాతం పెరిగాయి. దాదాపు 15 రాష్ట్రాల్లో పెట్రోల్ ధర సెంచరీ కొట్టింది. రాజస్థాన్, బీహార్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, జమ్ముకశ్మీర్, ఒడిశా, తమిళనాడు, లడఖ్‌లో పెట్రోల్ రేట్లు వంద దాటాయి. దాదాపు అన్ని మెట్రో నగరాల్లో లీటర్ పెట్రోల్ వంద రూపాయలు దాటింది.