
- వాహనదారులపై అదనపు భారం
- ఆర్థిక మంత్రి ప్రకటనపై నగరవాసుల గరం
- రాత్రికి రాత్రే రేట్లు పెంచిన ఆయిల్ కంపెనీలు
- పలుచోట్ల నో స్టాక్ బోర్డులు
కేంద్ర బడ్జెట్ నగరవాసులపై పెట్రో భారాన్ని మోపింది. లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో పెట్రో ధరలపై రూపాయి సెస్ విధిస్తున్నట్టు ప్రకటించగానే సిటీలో ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచేశాయి. లీటర్ పెట్రోల్‌పై రూ.2 .50, డీజిల్‌పై రూ.2.30 చొప్పున బాదారు. కొన్ని పెట్రోల్ బంకుల్లో శుక్రవారం రాత్రే ‘నో స్టాక్’ బోర్డులు పెట్టేశారు. కృత్రిమ కొరత సృష్టించి లబ్ధి పొందాలని ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. గ్రేటర్‌లో రోజుకు 60 లక్షల లీటర్ల పెట్రోల్, డీజిల్ వినియోగిస్తుండగా సెస్ పెంపుతో దాదాపు రూ.50 కోట్ల దాక వాహనదారులపై భారం పడనుందని అంచనా. ఇప్పటికే నిత్యావసరాలు కొనే స్థితిలో లేని సగటు ఉద్యోగికి ఇది పెద్ద దెబ్బే. పెట్రో రేట్ల పెంపుతో ప్రత్యక్షంగా నెలకు ఒక్కో మధ్యతరగతి వ్యక్తి జేబుకు రూ. 500 నుంచి రూ. 2 వేల వరకు చిల్లు పడనుంది.
హైదరాబాద్, వెలుగు: ఇంధన ధరలపై సెస్ పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన సామాన్యుల గుండెల్లో దడ పుట్టించింది. ఇక పెట్రోల్, డీజిల్ ధరలు సెగలు పుట్టించనున్నాయి. కనీసం లీటర్ పెట్రోల్, డీజిల్ పై రెండున్నర నుంచి మూడు రూపాయల వరకు ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చోగా తాజా నిర్ణయంతో అన్ని ధరలు మరింత ప్రియం కానున్నాయి. ఒక్కో మధ్యతరగతి వ్యక్తిపై 500 నుంచి 2 వేల వరకు భారం పడనుంది. పెట్రో వాత కారణంగా ప్రతి నెలా గ్రేటర్ పరిధిలో జనాల జేబులకు చిల్లు పడే మొత్తం దాదాపు 50 కోట్ల రూపాయలు. అవును తెలంగాణలో పెట్రోల్, డీజిల్ వాడకం మొత్తంలో గ్రేటర్ పరిధిలోనే దాదాపు 40 శాతం వరకు ఉంటుంది. ఇక్కడే 600 వరకు పెట్రోల్ బంకులు ఉన్నాయి. ప్రతి రోజు గ్రేటర్ లో 30 లక్షల లీటర్ల పెట్రోల్, 30 లక్షల లీటర్ల డీజిల్ మొత్తంగా 60 లక్షల లీటర్ల ఇంధనం వినియోగిస్తారు. పెంచిన ధరల కారణంగా రోజుకు కనీసం కోటి 50 లక్షల రూపాయలు జనంపై అదనపు భారం పడనుంది. నెల రోజుల్లో ఇది రూ.50 కోట్లుగా ఉండనుంది. దీనికి తోడు నిత్యం ధరల సమీక్ష పేరుతో ధరలను పెంచటం, తగ్గించటం చేస్తున్నారు.
గతేడాది మార్చి నుంచి సెప్టెంబర్ నాటికి 750 కోట్ల భారం
గతేడాది మార్చి నుంచి సెప్టెంబర్ వరకు కూడా పెట్రోల్, డీజిల్ గ్రేటర్ వాసులపై భారీగా అదనపు భారం పడింది. ఆ ఆరునెలల కాలంలో గ్రేటర్ వాసులపై 750 కోట్ల రూపాయల పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా నష్టపోయారు. మార్చి నుంచి సెప్టెంబర్ నాటికి ఒక్క లీటర్ పెట్రోల్ పై దాదాపు 8 రూపాయల వరకు ధరలను పెంచాయి ఆయిల్ కంపెనీలు. డీజిల్ పై కూడా ఆరు నెలల కాలంలో లీటర్ పై 7 రూపాయల వరకు ధరలు పెరిగాయి. సెప్టెంబర్ నెలలో పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్టస్థాయి చేరాయి. ఆ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గుముఖం పట్టటంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. ఐతే కేంద్ర బడ్జెట్ లో ఇంధనంపై సెస్ పేరుతో మళ్లీ పెట్రో బాంబు పేల్చారు. దీంతో ఒక్క నెలకే జనం 50 కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వస్తోంది.
సామాన్యుల నడ్డి విరిచారు
పెట్రోల్, డీజిల్ పై పన్నులు పెంచటంసామాన్యులపై భారం మోపటమే.కేంద్రం తాజా నిర్ణయం కారణంగానెలకు నాకు 500 వరకు అదనంగాభారం పడుతుంది. పెట్రో ధరల పెంపుకారణంగా నిత్యావసరాల ధరలూపెరుగుతాయి.– శ్రీనివాస్, ప్రైవేట్ ఉద్యోగి