హైదరాబాద్‌‌లో హై అలర్ట్‌‌.. ఇటు మిస్​ వరల్డ్​ పోటీలు..అటు ఇండియా, పాక్​ మధ్య టెన్షన్​

హైదరాబాద్‌‌లో హై అలర్ట్‌‌.. ఇటు మిస్​ వరల్డ్​ పోటీలు..అటు ఇండియా, పాక్​ మధ్య టెన్షన్​
  • కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు
  • గచ్చిబౌలి, హైటెక్స్‌‌‌‌లో హై సెక్యూరిటీ
  • కమాండ్​ కంట్రోల్​ సెంటర్​ నుంచి నిరంతర పర్యవేక్షణ
  • అనుమానితులను గుర్తించేందుకు ఫేస్‌‌‌‌ ఫ్యాక్ట్‌‌‌‌ టెక్నాలజీ 
  • మిస్​ వరల్డ్​ పోటీదారుల భద్రతకు మహిళా పోలీసులు 
  • సోషల్‌‌‌‌మీడియా యాక్టివిటీపై పోలీసుల నజర్​
  • రెచ్చగొట్టే పోస్టింగ్స్‌‌‌‌, ఫేక్ న్యూస్‌‌‌‌ను గుర్తించేందుకు స్పెషల్‌‌‌‌ టీమ్స్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు:  రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న మిస్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌–2025  పోటీలకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పహల్గాం ఘటన తర్వాత భారత్​– పాక్ మధ్య నెలకొన్న టెన్షన్​ వాతావరణం నేపథ్యంలో హైదరాబాద్​లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. గచ్చిబౌలిలో ఈ నెల 10న జరిగే మిస్​ వరల్డ్​ ప్రారంభ వేడుకల దగ్గరి నుంచి 31న హైటెక్స్‌‌‌‌‌‌‌‌లో జరిగే గ్రాండ్​ఫినాలే ( ముగింపు వేడుక) వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా నిఘాను పటిష్టం చేశారు. 

ఈ మేరకు నోడల్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అడిషనల్‌‌‌‌‌‌‌‌ డీజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. హైటెక్స్ సహా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని అన్ని ప్రాంతాల పోలీసులను అలర్ట్​ చేశారు. ఈవెంట్‌‌‌‌‌‌‌‌ జరిగే ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాలను బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌లోని కమాండ్‌‌‌‌‌‌‌‌  కంట్రోల్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుసంధానం చేస్తున్నారు. పోలీస్ రికార్డుల్లో ఉన్న అనుమానాస్పద వ్యక్తులు, క్రిమినల్స్‌‌‌‌‌‌‌‌ను గుర్తించేందుకు వీలుగా ఫేషియల్ రికగ్నేషన్‌‌‌‌‌‌‌‌ ఫేస్‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్ట్‌‌‌‌‌‌‌‌ సహా అత్యాధునిక సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్లను వాడుతున్నారు. 

మూడు షిఫ్టుల్లో బందోబస్తు

సైబరాబాద్‌‌‌‌‌‌‌‌, రాచకొండ, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ కమిషనరేట్ సహా మిస్ వరల్డ్​ పోటీదారులు పర్యటించే జిల్లాలోని పర్యాటక ప్రాంతాల వద్ద సెక్యూరిటీ పెంచారు. ఈ మేరకు ఆయా పోలీస్ యూనిట్లలోని ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పోటీదారుల భద్రత కోసం మహిళా అధికారులను నియమించారు. పోటీలు జరిగే హెటెక్స్‌‌‌‌‌‌‌‌ ఎగ్జిబిషన్ పరిసర ప్రాంతాలను పోలీసులు ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 

ఈవెంట్‌‌‌‌‌‌‌‌ ఆర్గనైజర్లు అందించిన వీఐపీలు, విదేశీ మీడియా లిస్ట్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా వారు బస చేసే హోటల్స్‌‌‌‌‌‌‌‌ వద్ద సెక్యూరిటీని అలర్ట్​ చేశారు. స్థానిక పోలీసులకు స్పెషల్‌‌‌‌‌‌‌‌ డ్యూటీలు వేస్తున్నారు. మూడు షిఫ్టుల్లో బందోబస్తు నిర్వహించబోతున్నారు. నిరంతరం సీసీటీవీ కెమెరాలను పర్యవేక్షించనున్నారు. ఎలాంటి ఘటన లు జరిగినా స్థానిక పోలీసులు, పాయింట్‌‌‌‌‌‌‌‌ డ్యూటీ ఆఫీసర్లను అప్రమత్తం చేసేందుకు సిద్ధమయ్యారు.  


సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాపై నజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఇండియా, పాక్‌‌‌‌‌‌‌‌ మధ్య నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సైబర్ క్రైమ్‌‌‌‌‌‌‌‌ యూనిట్లను అప్రమత్తం చేశారు. లా అండ్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు విఘాతం కలిగించే విధంగా  వైషమ్యాలు, విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టింగ్స్‌‌‌‌‌‌‌‌ను గుర్తిస్తున్నారు. రెచ్చగొట్టే కామెంట్లు, ఫొటోలు, వీడియోలు పోస్టు చేస్తున్నవారిని గుర్తిస్తున్నారు. ఈ మేరకు సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియా మానిటరింగ్ సెల్స్‌‌‌‌‌‌‌‌ పనిచేస్తున్నాయి. సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో 25 మంది సభ్యులతో కూడి ప్రత్యేక టీమ్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేశారు. 

అనుమానిత వాట్సప్‌‌‌‌‌‌‌‌ గ్రూపులు, ఎక్స్‌‌‌‌‌‌‌‌ (ట్విట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌, ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌ అకౌంట్లు, యూట్యూబ్‌‌‌‌‌‌‌‌, టెలిగ్రామ్‌‌‌‌‌‌‌‌ ను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఫేక్ ప్రొఫైల్స్‌‌‌‌‌‌‌‌తో నకిలీ అకౌంట్లు క్రియేట్‌‌‌‌‌‌‌‌చేసి మార్ఫింగ్‌‌‌‌‌‌‌‌ ఫొటోలు, ఫేక్ న్యూస్‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్న వారిని గుర్తిస్తున్నారు. ఫేక్ అకౌంట్ల నుంచి పోస్ట్‌‌‌‌‌‌‌‌ చేసిన కంటెంట్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా సంబంధిత పోలీసులను అప్రమత్తం చేస్తున్నారు. దీంతో పాటు నిషేధిత పోస్టులను సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియా అకౌంట్ల నుంచి తొలగిస్తున్నారు.