ఒక వ్యక్తి ప్రతిరోజూ వాకింగ్/ రన్నింగ్ చేసిన, మంచి ఆహారం తీసుకున్న, కొన్ని ఏళ్ల తర్వాత గుండె సమస్యలు రావచ్చు. దీనికి ముఖ్య కారణం కంటి నిండా సరైన నిద్ర లేకపోవడం అని డాక్టర్ సుధీర్ కుమార్ సోషల్ మీడియాలో చెప్పారు. ఆయన ప్రకారం ఎక్కువగా వ్యాయామం చేసినా, సరైన నిద్ర లేకపోతే గుండె పై ప్రభావం ఉంటుందని అన్నారు.
ఇందుకు ఒక ఉదాహరణ ఇస్తూ, ఒక వ్యక్తి రోజుకు 5 గంటలే నిద్రపోయి, ప్రతిరోజూ వాకింగ్ చేస్తాడు. మరొక వ్యక్తి రోజుకు 7-8 గంటలు బాగా నిద్రపోయి తక్కవగా నడుస్తాడు. కానీ మంచి నిద్ర ఉన్న వ్యక్తికే గుండె ఆరోగ్యంగా ఉందని తేలింది. ఎందుకో తెలుసా....
గుండెకు విశ్రాంతి:
వ్యాయామం రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అయితే, సరైన మంచి నిద్ర లేకపోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఒత్తిడి హార్మోన్లు (Stress Hormones) ఎప్పుడూ ఎక్కువగా ఉంటాయి. ఈ ఒత్తిడి వల్ల గుండె విశ్రాంతి సమయంలో కూడా కష్టపడి పని చేయాల్సి వస్తుంది. దింతో రక్తనాళాలు గట్టిపడి గుండె సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. సరైన నిద్ర లేకపోవడం వల్ల గుండెకు అవసరమైన కోలుకునే సమయం దొరకదు.
డాక్టర్ కుమార్ చెప్పినట్లు, నిద్ర అనేది మన శరీరానికి ఒక మరమ్మత్తు లాంటిది. గాఢ నిద్రలో గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది. దింతో రక్తపోటు తగ్గుతుంది. మళ్లీ ఆరోగ్యంగా తయారవుతాయి. ప్రతి రాత్రి విశ్రాంతి కోల్పోతే శరీరం ఎప్పుడూ సగం కోలుకున్నట్లే ఉంటుంది. పరిశోధనల ప్రకారం, చురుకుగా ఉన్నా కూడా 6 గంటల కంటే తక్కువ నిద్రపోయే వారికి గుండె జబ్బుల ప్రమాదం 20-40% ఎక్కువ ఉంటుంది. అందుకే, జిమ్‌లో ఎంత కష్టపడ్డా, బెడ్ పై సరైన విశ్రాంతి లేకపోతే లాభం లేదు.
రోజుకు 7-8 గంటలు నిద్రపోయి, కేవలం 20 నిమిషాలు నడిచే వ్యక్తికి ఎక్కువకాలం గుండె ఆరోగ్యం ఉంటుంది. మంచి నిద్ర వల్ల హార్మోన్లు బ్యాలెన్స్ గా ఉంటాయి, ఇన్సులిన్ సున్నితత్వం మెరుగుపడుతుంది, గుండె ప్రశాంతంగా కోలుకుంటుంది. ఈ అలవాటు వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
డాక్టర్ కుమార్ సింపుల్‌గా చెప్పింది ఏంటంటే గుండె, జీవక్రియల కోలుకోవడానికి నిద్ర అనేది చాలా ముఖ్యం. శరీరానికి సరైన విశ్రాంతి దొరికినప్పుడే వ్యాయామం చేసే లాభాలు పెరుగుతాయి. అందుకే మంచి నిద్ర, కాస్త నడక లేదా వ్యాయామం, మానసిక ప్రశాంతత ఈ మూడు గుండెకు చాల రక్షణను ఇస్తుంది. తీవ్రంగా వ్యాయామాలు చేసేవారు కూడా కనీసం ఏడు గంటల మంచి నిద్ర కోసం వ్యాయామ సమయాన్ని కొద్దిగా తగ్గించుకోవాలని డాక్టర్ సూచిస్తున్నారు. ఈ చిన్న అలవాటు మార్పు మీ ఫిట్‌నెస్ ఇంకా గుండె ఆరోగ్యం మధ్య తేడాను చూపుతుంది. నిజమైన బలం అంటే ఎక్కువ వ్యాయామం చేయడం కాదు, మంచిగా కోలుకోవడం.
గమనిక: ఇది కేవలం డాక్టర్ అభిప్రాయాల ఆధారంగా సమాచారం కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యల కోసం వైద్య నిపుణులని సంప్రదించండి.
