తీరం దాటిన తుఫాన్ మోంథా ఎఫెక్ట్ తెలంగాణ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల్లో ఆకస్మిక వరదలు.. ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. 16 జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ జారీ చేయగా.. రాబోయే 24 గంటలు అంటే.. అక్టోబర్ 30వ తేదీ వరకు జాగ్రత్తగా ఉండాలని జనాన్ని అప్రమత్తం చేసింది వెదర్ డిపార్ట్ మెంట్.
వరంగల్ సిటీలో కుండపోత వర్షం.. అలా ఇలా కాదు.. సిటీలో వరదలు పోటెత్తాయా అన్నంతగా వర్షం బీభత్సంగా పడుతుంది. వరంగల్, హనుమకొండలోని ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై నీళ్లు నదుల్లా పారుతున్నాయి.
ఆగకుండా పడుతున్న వర్షానికి వరంగల్ హెడ్ పోస్టాఫీస్ సెంటర్, CKM హాస్పిటల్ ఏరియా.. జెపిన్ రోడ్, వరంగల్ చౌరస్తా, బట్టల బజార్ రోడ్లు అన్నీ జలమయం అయ్యాయి. మెయిన్ రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు వచ్చాయి. జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడే విధంగా వర్షం పడుతుంది. వరంగల్ సిటీలోని అండర్ బ్రిడ్జి కింద నీళ్లు రావటంతో రాకపోకలకు బ్రేక్ పడింది. బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు.. వాహనాలను దారి మళ్లిస్తున్నారు.
ALSO READ : వద్దన్నా వినకుండా వెళ్లాడు..
ఇక హనుమకొండ విషయానికి వస్తే వర్ష బీభత్సం బెంబేలెత్తిస్తోంది. కాలనీలు అన్నీ జలమయం అయ్యాయి. గోకుల్ నగర్, క్రాంతినగర్, రాంనగర్ కాలనీల్లో రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు వచ్చాయి. కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి.
ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షంలో వరంగల్, హనుమకొండలోని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీళ్లు వచ్చాయి. ఏపీలో తుఫాన్ తీరం దాటిన తర్వాత.. ఆ ప్రభావం తెలంగాణపై తీవ్రంగా పడింది. వరంగల్ ఏరియాలో 15 సెంటీమీటర్లపైనే వర్షం నమోదైంది. అక్టోబర్ 29వ తేదీ బుధవారం అంతా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
