పెట్రో ధరలు వెంటనే తగ్గించాలి

 పెట్రో ధరలు వెంటనే తగ్గించాలి

హైదరాబాద్: రోజు రోజుకూ పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలపై టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ స్పందించాడు. రూ.35 రూపాయలు పడే పెట్రోలు, డీజిల్ పై దాదాపు 70 రూపాయలు ట్యాక్సులు విధిస్తుండడం అన్యాయమంటున్నాడు. కరోనాకు ముందు నుండే తన వంతుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రచారానికి దూరంగా నిలిచే హైదరాబాదీ హీరో నిఖిల్ ప్రజా సమస్యలపై.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై బాహాటంగా పెదవి విప్పాడు. కరోనా లాక్ డౌన్ టైమ్ లోనూ తనకు పరిచయం ఉన్న వారే కాదు.. తన చుట్టుపక్కల ఎక్కడ ఎవరు కష్టాల్లో ఉన్నా స్పందించే అలవాటున్న నిఖిల్ పెట్రోలు ధరల వల్ల సామాన్యులు మరీ ముఖ్యంగా పేదలు ధరలు పెరిగి చాలా కష్టాలుపడుతున్నాడని ఆందోళన వ్యక్తం చేశాడు. రూ.35 విలువ చేసే పెట్రోలుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 70 రూపాయల వరకు ట్యాక్సులు విధించడం వల్ల దేశంలోని అన్ని ప్రాంతాల్లో పెట్రోలు ధరలు వంద దాటిందని నిఖిల్ ప్రస్తావించాడు. ఇంత భారీగా ధరలు పెరగడం సామాన్యులు అనేక కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. ప్రజలందరి తరపున తాను ప్రభుత్వాలను కోరుతున్నానంటూ ట్వీట్ చేశాడు. పెట్రోలు ధరలు సామాన్యులకు ఆకాశంలో అందనంత ఎత్తుకు చేరాయంటూ సింబాలిక్ గా ఫోటోను ట్వీట్ కు జత చేశాడు.  చెట్టు కొమ్మలపై పెట్రోలు పంపు ఉంటే.. దానిపై నుంచి వేలాడుతున్న పెట్రోలు పైపు అందనంత ఎత్తులో ఉండడంతో  స్కూటర్ తోలుకొచ్చిన వ్యక్తి చెయ్యి పైకెత్తి అందుకునేందుకు  ప్రయత్నం చేస్తున్నట్లు ఉన్న ఫోటో ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది.