
శ్రీనివాస్. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీ ఎంప్లాయి. రోజూ బైక్ పైనే ఆఫీసుకు వెళ్తుంటాడు. వారానికి ఒకసారి బైక్‌లో పెట్రోల్ కొట్టిస్తుంటాడు. ఇదివరకు 500 రూపాయల పెట్రోల్ కొట్టిస్తే.. వారం పది రోజులు నడిచిపోయేది. ఇప్పుడు ఐదు రోజులకు మించి రావడం లేదు. అనుమానం వచ్చి తాను పెట్రోల్ కొట్టించే బంకుపై కంప్లయింట్ చేశాడు. సివిల్ సప్లయి డిపార్ట్మెంట్తనిఖీలు చేయగా ఆ బంకులో షార్టేజ్ మోసాలు జరుగుతున్నట్టు తేలింది.
కరీంనగర్‌కు చెందిన విజయ్ ఓ టాక్సీ డ్రైవర్. రోజూ ఒకే పెట్రోల్ బంకులో డీజిల్ కొట్టించేవాడు. ఒకేసారి ట్యాంక్ ఫుల్ చేయించేవాడు. కానీ కారు సరైన మైలేజీ ఇచ్చేది కాదు. ఎన్నిసార్లు మెకానిక్కు చూపించినా మార్పు లేదు. ఒకసారి డీజిల్ కొట్టించే టైమ్‌లో ఎందుకైనా మంచిదని చెక్ చేస్తే ఐదు లీటర్లకుపైగా తగ్గడంతో రమేశ్ షాక్ తిన్నాడు.
వీరిద్దరే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ బంకుల మోసాలకు రోజూ బలైపోతున్నారు. ఇదే విషయాన్ని సివిల్ సప్లయి డిపార్ట్మెంట్కూడా కన్ఫర్మ్ చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో మోసాలు జరుగుతున్నాయని ప్రకటించింది. 500 రూపాయల పెట్రోల్, డీజిల్ పోయించుకుంటే లీటర్ వరకూ షార్టేజ్ వస్తోందని తెల్చింది. ఈ మేరకు 20 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా 638 బంకుల్లో తనిఖీలు చేసిన ఆ శాఖ.. 183 బంకుల్లో మోసాలు జరిగినట్లు గుర్తించి నోటీసులిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో రూల్స్‌ను పాటించకపోవడం ఎప్పటి నుంచో జరుగుతోంది. తూనికలు, కొలతల శాఖ రూల్స్ ప్రకారం ఐదు లీటర్లలో 25 మిల్లీ లీటర్ల వరకు తక్కువగా వస్తే ఇబ్బంది లేదు. కానీ ప్రతి లీటర్‌లో ఆయిల్ తక్కువగా పంపింగ్ జరుగుతున్నట్లు వెహికల్స్ ఓనర్లు ఆరోపిస్తున్నారు. పెట్రోల్ బంకుల్లో సీల్ బ్రేకింగ్ జరుగుతోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. డీలర్లు సీల్ బ్రేక్ చేసి చిప్స్‌ను అమర్చడం, రిమోట్స్‌తో పంపింగ్‌ను కంట్రోల్ చేయడం లాంటి ఘటనలు గతంలోనూ వెలుగు చూశాయి. తాజాగా పెట్రోల్, డీజిల్ అమ్మకాల్లో అవకతవకలు, కల్తీ విక్రయాలపై ఫిర్యాదులు రావడంతో సివిల్ సప్లయి డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా తనిఖీలు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 25 శాతం బంకుల్లో తనిఖీలు చేసి 183 బంకులకు నోటీసులు జారీ చేసింది. రంగారెడ్డిలో 24, కరీంనగర్‌లో 20, కామారెడ్డిలో 20, సిద్దిపేటలో 14 బంకుల్లో రూల్స్ పాటించడంలేదని ఆఫీసర్లు గుర్తించారు. షార్టేజ్ వచ్చిన బంకులు ఒకసారి రూల్స్ పాటించకపోతే ఫైన్ వేస్తామని, రెండోసారి అదే నేరం జరిగితే కోర్టుకు పంపిస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు. బీఫామ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోని వారికి ఫైన్ వేస్తామన్నారు.
రోజూ కోటీ 20 లక్షల లీటర్ల వినియోగం
రాష్ట్రవ్యాప్తంగా 2,553 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీఎల్ కంపెనీలకు చెందిన ఈ బంకుల్లో రోజూ పెట్రోలు, డీజిల్ కలిపి దాదాపు కోటీ 20 లక్షల లీటర్లు వరకూ వినియోగిస్తున్నారు. ఇందులో 40 లక్షల లీటర్ల పెట్రోల్, 35 లక్షల డీజిల్ ఒక్క హైదరాబాద్ లోనే వాడుతున్నారు. సూర్యాపేట, చర్లపల్లి, ఘట్‌కేసర్ తదితర 6 కంపెనీ టెర్మినళ్ల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బంకులకు రోజూ 600 ట్యాంకర్లలో పెట్రోల్, డీజిల్ సరఫరా అవుతోంది.
ఏం చేయాలి.. ఏం జరుగుతోంది.
– రూల్స్ ప్రకారం ఐదు లీటర్లలో 25 మిల్లీ లీటర్ల వరకు తక్కువగా వస్తే ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ కొన్ని బంకుల్లో ఐదు లీటర్లకు అర లీటర్‌నుంచి లీటర్ వరకూ తేడా వస్తోంది.
పెట్రోల్ పంపింగ్ చేసే గన్ వద్ద బయటకు కనిపించేలా ఏర్పాట్లు ఉండాలి. కానీ ఏ బంకూ ఈ రూల్‌ను పాటించలేదు.
కొలతలను చెక్ చేసుకోవడానికి పెంట్రోల్ బంకుల వద్ద గాజు బీకరు ఉండాలి. ఏడాది క్రితమే ఈ రూల్ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసినా అమలు కావడం లేదు.
తూనికలు, కొలతల శాఖ ఆఫీసర్లు ఏడాదికోసారి ఫిల్లింగ్ మిషన్‌ను పరిశీలించి సీల్ వేసి స్టాపింగ్ చేస్తారు. లీగల్ మెట్రాలజీ, ఆయిల్ కంపెనీల ఆఫీసర్ల సమక్షంలో టెక్నీషియన్లు పంపింగ్ మీషన్‌ను పరిశీలించి స్టాంపింగ్ చేస్తారు. ఐనా సీల్ బ్రేకింగ్ కు సంబంధించి ఇప్పటికీ ఆరోపణలు ఉన్నాయి.
ఏటా లైసెన్స్ రెన్యూవల్ కోసం బంకు డీలర్లు గడువు కంటే 15 రోజుల ముందు తూనికలు, కొలత శాఖకు అప్లై చేసుకోవాలి. కానీ చాలా బంకులు గడువు ముగిసినా రెన్యూవల్‌కు అప్లై చేయడం లేదు.