పీజీ మెడికల్ సీట్ల భర్తీలో.. తెలంగాణ స్టూడెంట్లకు అన్యాయం

పీజీ మెడికల్ సీట్ల భర్తీలో.. తెలంగాణ స్టూడెంట్లకు అన్యాయం

హైదరాబాద్, వెలుగు: పీజీ మెడికల్  మేనేజ్‌‌మెంట్ కోటా సీట్లను ఏపీ, ఇతర రాష్ట్రాల స్టూడెంట్లకు ఇవ్వడంపై తెలంగాణ మెడికోలు  రాష్ట్ర సర్కారు‌‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో మేనేజ్‌‌మెంట్ కోటాలోని 85 శాతం సీట్లను తమ రాష్ట్ర స్టూడెంట్లకే కేటాయిస్తుండగా, మన రాష్ట్రంలో మాత్రం పూర్తిగా ఓపెన్ కోటాలో ఉంచారు. దీంతో ఏపీ సహా ఇతర రాష్ట్రాల స్టూడెంట్లు మన రాష్ట్రంలోని కాలేజీల్లో మేనేజ్‌‌మెంట్ కోటా సీట్లు పొందుతున్నారు. ఈ పద్ధతిని మార్చాలని, ఏపీ తరహాలోనే 85 శాతం సీట్లను తెలంగాణ స్టూడెంట్లకు రిజర్వ్‌‌  చేయాలని ప్రభుత్వానికి డాక్టర్లు పలుమార్లు విజ్ఞప్తి చేశారు.

 ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో పాత రూల్స్ ప్రకారమే కాళోజీ వర్సిటీ సీట్ల భర్తీ చేపడుతున్నది. ఈ విషయంపై హెల్త్ రిఫార్మ్స్  డాక్టర్స్ అసోసియేషన్  శుక్రవారం హైదరాబాద్‌‌లో మీడియా సమావేశం నిర్వహించింది. ప్రభుత్వం ఇకనైనా స్పందించి కౌన్సెలింగ్ ఆపేయాలని, 85 శాతం సీట్లను తెలంగాణ స్టూడెంట్లకు రిజర్వ్‌‌  చేస్తూ జీవో ఇచ్చిన తర్వాతే కౌన్సెలింగ్  నిర్వహించాలని ప్రభుత్వాన్ని హెచ్‌‌ఆర్డీఏ ప్రెసిడెంట్‌‌, డాక్టర్  మహేశ్‌‌ డిమాండ్  చేశారు.

 ప్రభుత్వం స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు. అలాగే, కొన్ని ప్రైవేటు మెడికల్  కాలేజీలు స్టూడెంట్ల దగ్గర ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నాయని, స్టైపెండ్  రిటర్న్ తీసుకునేందుకు బ్లాంక్  చెక్కులపై సంతకాలు చేయించుకుంటున్నాయని ఆయన ఆరోపించారు.

 బ్యాంక్ అకౌంట్లు ఓపెన్  చేయించి, ఆ అకౌంట్లకు సంబంధించిన ఏటీఎంలు, పాస్‌‌బుక్‌‌లను తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. దీనిపై కూడా ప్రభుత్వం, కాళోజీ వర్సిటీ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.