
- రూ.50 లక్షలు వెచ్చించి.. ఆధునీకరించడంతోపాటు 5 వేల మొక్కలు నాటినట్లు బల్దియాకు లెటర్
- తనకు సంబంధం లేని పనులు చేసినట్లు చెప్పుకోవడంపై అనుమానాలు
- మరోవైపు దాబా విషయంలో కమిషనర్ ఆదేశాలు పట్టించుకుంటలే..
- మంగళవారం దాబా ఓపెన్ చేసిన నిర్వాహకులు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీ నడిబొడ్డున మల్టీ పర్పస్ పార్కులో కాంట్రాక్ట్ ఏజెన్సీ మరో అక్రమం వెలుగు చూసింది. మల్టీ పర్పస్ పార్క్ లో రూ.50 లక్షలు ఇన్వెస్ట్ చేసి పార్కులో సౌకర్యాలను మెరుగుపరిచామని, మరింత ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా మార్చామని, ఆక్సిజన్ జోన్ పెట్టి 5 వేల మొక్కలు నాటి మినీ ఫారెస్ట్ అభివృద్ధి చేశామని ఏకంగా మున్సిపల్ కమిషనర్‌కే లెటర్ రాసి అడ్డంగా దొరికిపోయారు. దాబా అనుమతి కోసం ఈ నెల 6న మున్సిపల్ కమిషనర్‌కు కాంట్రాక్ట్ ఏజెన్సీ రాక్ ఎంటైర్ టైన్ మెంట్ పెట్టుకున్న దరఖాస్తులో ఈ వివరాలు ఉన్నాయి.
స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా రూ.11 కోట్లతో మల్టీ పర్పస్ పార్కును సకల సౌకర్యాలతో నిర్మించిన విషయం తెలిసిందే. ఇందులో పిల్లలు ఆడుకునేందుకు ప్లే ఏరియా, ఆట వస్తువులు, మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్, కేమల్ స్ప్రింగ్ రైడర్, యాంపీ థియేటర్, ఈపీడీఎం ఫ్లోరింగ్‌తో కూడిన వాకింగ్ ట్రాక్ లాంటి సౌకర్యాలతోపాటు అందమైన మొక్కలు నాటిన విషయం తెలిసిందే. కాగా రెండేళ్ల నిర్వహణకుగానూ రూ.21 లక్షలకు టెండర్ దక్కించుకున్న సదరు కాంట్రాక్ట్ ఏజెన్సీ.. ఇప్పుడు రూ.అర కోటి వెచ్చించి పనులు చేపట్టామని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది.
రెండేళ్ల తర్వాత కూడా పార్కు తమ చేజారకుండా ఉండేందుకే తాము పార్కుపై రూ.లక్షలు ఖర్చు పెట్టినట్లు ముందు నుంచే ఇలా వ్యూహత్మకంగా మున్సిపల్ కమిషనర్ దృష్టికి వెళ్తున్నారనే ప్రచారం జరుగుతోంది. భవిష్యత్ లో తమకు లీజ్ రెన్యువల్ చేయకపోతే.. తాము ఇన్వెస్ట్ చేసిన విషయం ముందు నుంచి కమిషనర్ దృష్టిలో పెడుతున్నామని, అందువల్ల తమకే ఇవ్వాలని వాదించే అవకాశం లేకపోలేదని కొందరు మాజీ కార్పొరేటర్లు చెప్తున్నారు.
చిట్టడవి ఎక్కడ.. ?
ఏడెకరాల మల్టీపర్పస్ పార్కులో ముందు నుంచి ఉన్న వేపచెట్లు, పార్కు నిర్మాణంలో భాగంగా ఆహ్లాదం, ఆకర్షణ కోసం ఏర్పాటు చేసిన పలు రకాల మొక్కలు, చెట్లు ఉన్నాయి. ఇవి కాకుండా పార్కులో చిట్టడవిని పెంచినట్లు ఎక్కడా ఆనవాళ్లు లేవు. కానీ తాము పార్కులో 5 వేల మొక్కలు నాటి దానికి ‘ఆక్సిజన్ జోన్’ అని పేరు పెట్టినట్లు, స్మార్ట్ సిటీ ప్రమాణాలకు తగ్గట్టుగా మినీ-ఫారెస్ట్‌గా అభివృద్ధి చేశామని బల్దియా కమిషనర్‌కు దాబా ఏర్పాటు కోసం పెట్టుకున్న దరఖాస్తులో పేర్కొనడం గమనార్హం. కాంట్రాక్ట్ ఏజెన్సీ పార్కులో యాక్టివిటీ మొదలు పెట్టిందే ఈ ఏడాది ఏప్రిల్ లో. కానీ నాలుగు నెలల్లోనే మినీ ఫారెస్ట్‌ను ఎలా అభివృద్ధి చేశారనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
బల్దియా కమిషనర్ ఆదేశాలు జాన్తా నై
నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన దాబాను మూసివేస్తున్నట్లు బల్దియా కమిషనర్ సోమవారం రాత్రి ప్రకటించినప్పటికీ.. మంగళవారం అందులో యథావిధిగా మెస్ నిర్వహించారు. మల్టీపర్పస్ పార్కులో జరుగుతున్న అక్రమాలపై ‘వీ6 వెలుగు’లో ‘మల్టీ పర్పస్ పార్క్.. పక్కా కమర్షియల్’ హెడ్డింగ్‌తో మంగళవారం స్టోరీ పబ్లిష్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్టోరీ కోసం సోమవారం రాత్రి మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ని దాబా అనుమతుల విషయమై వాట్సప్ లో వివరణ కోరగా.. పార్కు పరిధిలో కేవలం క్యాంటీన్ మాత్రమే ఏర్పాటు చేయడానికి అనుమతి ఉందని, కానీ సంబంధిత కాంట్రాక్ట్ ఏజెన్సీ వారు నిబంధనలు, షరతులు ఉల్లంఘించి పార్కులో దాబా/హోటల్ ను ఏర్పాటు చేశారని కార్పొరేషన్ మీడియా గ్రూపులో మెస్సేజ్ చేశారు.
సంబంధిత ఏజెన్సీ యాజమాన్యానికి మల్టీపపర్పస్ పార్కులో దాబా నడపరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం.’ అని అందులో వివరించారు. సోమవారం రాత్రి బల్దియా సిబ్బంది వెళ్లి క్వాలిటీ దాబా బోర్డును కూడా తొలగించి దాబాను మూసివేయించినంత పని చేశారు. కానీ మంగళవారం లంచ్ టైం వరకు మళ్లీ దాబాలో భోజనం రెడీ చేసి, కస్టమర్లకు వడ్డించడం గమనార్హం. రాత్రి హడావుడి చేసినా బల్దియా ఆఫీసర్లు తెల్లవారి అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిర్వహణ నుంచి ఎందుకు తప్పించినట్లు ?
మల్టీపర్పస్ పార్కు నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్ట్ సంస్థే మూడేళ్ల వరకు మెయింటనెన్స్ పనులు చూడాల్సి ఉంది. అందులో ఏమైనా రిపేర్లకు గురైనాబాగు చేసే బాధ్యత సంబంధిత కాంట్రాక్టర్‌దే. కానీ సదరు కాంట్రాక్టర్‌ను ఆ బాధ్యత నుంచి తప్పించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.