మానుకోట కు ఎస్సారెస్పీ నీళ్లు

మానుకోట కు ఎస్సారెస్పీ నీళ్లు
  • కాల్వల ద్వారా చెరువుల్లోకి జలాలు
  • పంటల సాగుకు భరోసా
  • జిల్లాలో మరింత పెరుగనున్న సాగు విస్తీర్ణం

మహబూబాబాద్, వెలుగు: మానుకోట జిల్లాలో తొలుత వర్షాలు ఓ మోస్తారుగా కురవడంతో రైతులు పంటలను విరివిగా సాగు చేశారు. జిల్లాలోని ఏజెన్సీ మండలాలు గంగారం, బయ్యారం, గార్ల, కొత్తగూడ, గూడూరు మండలాల పరిధిలో చెరువులు అలుగులు పోయగా, మైదాన ప్రాంతాలైన తొర్రూరు, పెద్దవంగర, నరసింహులపేట, మరిపెడ, ఇనుగుర్తి, కేసముద్రం, మహబూబాబాద్, కురవి, సీరోలు, డోర్నకల్, దంతాలపల్లి, చిన్నగూడురు, నెల్లికుదురు మండలాల పరిధిలో వర్షం తక్కువగా కురువడంతో చెరువులు పూర్తిస్థాయిలో నిండలేదు. దీంతో ఎస్సారెస్పీ ప్రాజెక్ట్​ నీటిని విడుదల చేసి చెరువులు, కుంటలను నింపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఎస్సారెస్పీ జలాలు జిల్లాకు చేరడంతో మైదాన ప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో 780 చెరువులే పూర్తిగా నిండాయి..

మహబూబాబాద్​ జిల్లాలో 1590 చెరువులు, కుంటలు ఉండగా, ఈ వర్షాకాలంలో ఇప్పటి వరకు 25 శాతం నిండినవి 15 చెరువులు కాగా, 50 శాతం నిండినవి 140, 75 శాతం నిండినవి చెరువులు 281, వందశాతం నిండినవి 780, జిల్లాలో ఇప్పటి వరకు 374 చెరువులు అలుగు పోశాయి. ప్రస్తుతం జిల్లాలోని జలాశాయాలకు ఎస్సారెస్పీ నీటిని నింపుతుండడంతో రైతుల పంటలకు సరిపడా సమృద్ధిగా అందనున్నాయి. 

ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న సాగు..

వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో వ్యవసాయ సాగు పనులు జోరందుకున్నాయి. ఆయా జిల్లాల పరిధిలో రైతులు వివిధ పంటలను సాగు చేశారు. ఇందులో వరంగల్ జిల్లాలో వరి 92,315 ఎకరాలు, మక్క1,35,884, పత్తి 1,18,106 ఎకరాలు కాగా, హనుమకొండ జిల్లాలో వరి 1,13,011 ఎకరాలు, మక్క 7,080, పత్తి 74,849 ఎకరాల్లో సాగు చేశారు. మహబూబాబాద్ జిల్లాలో వరి 1,49,808, మక్క 56,619, పత్తి 78,745 ఎకరాలు సాగవగా, ములుగు జిల్లాలో వరి 59,833, మక్క 7,127, పత్తి 19,431, భూపాలపల్లి జిల్లాలో 66,217, మక్క 253, పత్తి 98,260, జనగామ జిల్లాలో వరి 1,33,136 , మక్క 7,976, పత్తి 1,08,718 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఈ సాగు విస్తీర్ణం మరింత పెరుగనుంది. 

ఎస్సారెస్పీ జలాల విడుదల హర్షణీయం.. 

వర్షాకాలం సీజన్ లో కొంత మేరకు వర్షాలు కురిసినప్పటికీ పూర్తిస్థాయిలో చెరువులు, కుంటలు నిండలేదు. సాగు చేసిన పంటలు ఎలా పండుతాయని రైతులు ఎదురుచూస్తున్న సమయంలో పంటలను రక్షించడానికి జలాలను విడుదల చేయడం సంతోషంగా ఉంది. చెరువులన్నీ మత్తడి పోసే వరకు ఎస్సారెస్పీ జలాల విడుదల కొనసాగించాలి. - జాటోతు సురేశ్​ నాయక్, భీముడు తండా