ఒడిశా నుంచి గంజాయిని తీసుకొస్తుండగా పట్టుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు

ఒడిశా నుంచి గంజాయిని తీసుకొస్తుండగా పట్టుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు

జూలూరుపాడు, వెలుగు: ఒడిశా నుంచి గంజాయిని తీసుకొస్తుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ శ్రీలక్ష్మి మంగళవారం మీడియాకు వివరాలు తెలిపారు. జూలూరుపాడు మండలం మాచినేని పేట తండాలో ఎస్ఐ బాదావత్ రవి సిబ్బందితో కలిసి సోమవారం సాయంత్రం వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో వస్తున్న బొలెరో వాహనాన్ని ఆపి చెక్ చేయగా సుమారు 63 కేజీల గంజాయి ప్యాకెట్లు లభించాయి.

ఇద్దరు డ్రైవర్లు తేజ్ కుమార్, భాస్కర్ రావును అదుపులోకి తీసుకుని విచారించగా ఒడిశా నుంచి పుణెకు గంజాయిని తీసుకెళ్తున్నట్టు చెప్పారు. దాని విలువు సుమారు రూ. 36 లక్షలు ఉంటుంది. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్టు, వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశామని సీఐ చెప్పారు. మద్యానికి బానిసై డబ్బుల కోసం గంజాయిని తీసుకెళ్తున్నట్టు నిందితులు విచారణలో తెలిపారని పేర్కొన్నారు.

మక్క చేనులో సాగు..
నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లాలో మక్క చేనులో గంజాయి సాగు చేస్తుండగా ఒకరిని అరెస్ట్ చేశారు. ఎస్ఐ సయ్యద్ ఇమ్రాన్ తెలిపిన  ప్రకారం.. నేరడిగొండ మండలం గాజిలి గ్రామానికి చెందిన సీతాబాయి తన మక్క చేనులో గంజాయి సాగు చేస్తుంది. పోలీసులకు సమాచారం అందడంతో వెళ్లి 7 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సీతాబాయిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.