
- 2030 నాటికి ఏటా 65 వేలకు పైగా క్యాన్సర్ కేసులు వచ్చే చాన్స్
- ఎర్లీ డయాగ్నోసిస్, చికిత్స, నివారణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి
- రాష్ట్రంలోని 34 జనరల్ హాస్పిటల్స్‌లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: క్యాన్సర్ రోగులకు పూర్తిస్థాయిలో ట్రీట్మెంట్ అందించేందుకు 2030 నాటికి రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో రీజనల్ క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏటా 55 వేలకు పైగా క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని.. మరో ఐదేండ్లలో ఈ సంఖ్య 65 వేలకు పెరిగే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో క్యాన్సర్ నివారణ, ఎర్లీ డయాగ్నోసిస్, చికిత్సను జిల్లా స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మంగళవారం సంగారెడ్డి మెడికల్ కాలేజీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 34 జనరల్ హాస్పిటల్స్‌లో ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ డే కేర్ క్యాన్సర్ సెంటర్లను మంత్రి దామోదర రాజనర్సింహ వర్చువల్‌గా ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్ నివారణ, చికిత్సకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. ప్రముఖ అంకాలజిస్ట్ నోరి దత్తాత్రేయుడి సలహాలతో ఈ దిశగా పనిచేస్తున్నామని వివరించారు. ప్రస్తుతం ఎంఎన్‌జే, నిమ్స్ ఆస్పత్రుల్లో క్యాన్సర్ చికిత్స అందుతోందని.. అయితే, పెరుగుతున్న రోగుల సంఖ్యతో ఈ ఆస్పత్రులపై ఒత్తిడి పెరుగుతోందని మంత్రి తెలిపారు.
ఈ నేపథ్యంలో ఎక్కడి వారికి అక్కడే చికిత్స అందించాలని లక్ష్యంగా పెట్టుకొని, ప్రతి జిల్లాలో డే కేర్ కేన్సర్ సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సెంటర్లలో కేన్సర్ స్క్రీనింగ్, డయాగ్నసిస్, కీమో థెరపీ, పాలియేటివ్ కేర్ వంటి చికిత్సలన్నీ అందుబాటులో ఉంటాయన్నారు. అవసరమైనప్పుడు ఎంఎన్‌జే, నిమ్స్ నుంచి సీనియర్ డాక్టర్లు డే కేర్ సెంటర్లకు వచ్చి వైద్య సేవలు అందిస్తారని మంత్రి చెప్పారు.
నర్సింగ్ విద్యార్థులకు విదేశీ భాషలు.. ఇఫ్లూతో ఒప్పందం
ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల విద్యార్థులకు జర్మన్, జపనీస్ భాషలు నేర్పించేందుకు ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)తో ఆరోగ్య శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ.. జర్మనీ, జపాన్‌లో నర్సులకు ఉన్న డిమాండ్‌ను గుర్తించి.. విదేశీ భాషల్లో శిక్షణ ఇచ్చి నర్సులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఇఫ్లూతో ఒప్పందం చేసుకున్నట్టు వివరించారు. రెండేండ్లు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు జారీ చేస్తారని, ఇది విదేశాల్లో ఉద్యోగాలు పొందడానికి తోడ్పడుతుందని మంత్రి తెలిపారు.
నర్సింగ్ కోర్సులపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆసక్తి పెరిగిందని.. హాస్పిటల్స్, హోమ్ కేర్ నర్సింగ్ డిమాండ్ తో అవకాశాలు కూడా పెరిగాయని మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 16 కొత్త ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేశామని, మరో రెండు కాలేజీలను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. దీంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా నర్సింగ్ విద్య చేరువవుతుందని ఆయన హామీ ఇచ్చారు.