ఆగస్టు 1 నుంచి పీజీఈసెట్ కౌన్సెలింగ్

 ఆగస్టు 1 నుంచి పీజీఈసెట్ కౌన్సెలింగ్
  • 4 నుంచి లాసెట్..25 నుంచి పీజీఎల్‌‌సెట్ కౌన్సెలింగ్ కూడా..
  • షెడ్యూల్ రిలీజ్ చేసిన అధికారులు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎల్‌‌ఎల్‌‌బీ, ఎల్‌‌ఎల్‌‌ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం టీజీ లాసెట్, టీజీ పీజీఎల్‌‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌‌ను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టా రెడ్డి అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 26న నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు.

లాసెట్ కౌన్సెలింగ్  షెడ్యూల్

ఎల్‌‌ఎల్‌‌బీ కోర్సుల కోసం ఆగస్టు 4 నుంచి 14 వరకు రిజిస్ట్రేషన్, ఆన్‌‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఆగస్టు 15న దరఖాస్తు సవరణకు ఈమెయిల్ ద్వారా అవకాశం ఉంటుంది. ఆగస్టు 16, 17న వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. ఆగస్టు 22న సీట్ అలాట్‌‌మెంట్ ప్రకటిస్తారు. సీటు సాధించిన అభ్యర్థులు ఆగస్టు 25 వరకు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. ఆగస్టు 30 నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయి.

పీజీఎల్‌‌సెట్ కౌన్సెలింగ్  షెడ్యూల్

ఎల్‌‌ఎల్‌‌ఎం కోర్సుల కోసం ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 1 వరకు రిజిస్ట్రేషన్, ఆన్‌‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. సెప్టెంబర్ 3, 4న వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 8న సీట్లు కేటాయిస్తారు. అభ్యర్థులు సెప్టెంబర్ 13లోపు కాలేజీల్లో జాయిన్ కావాలి.

పీజీఈసెట్ కౌన్సెలింగ్  షెడ్యూల్

ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఈ కోర్సుల కోసం ఆగస్టు 1 నుంచి 9 వరకు రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆగస్టు 11, 12న వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఆగస్టు 16న సీట్ అలాట్‌‌మెంట్ జరుగుతుంది. సీటు సాధించిన వారు ఆగస్టు 21లోపు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి.సమావేశంలో కౌన్సిల్ వైస్ చైర్మన్‌‌లు పురుషోత్తం, మహమూద్, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్, అడ్మిషన్ కన్వీనర్ పాండురంగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎంబీబీఎస్ రిజిస్ట్రేషన్ల గడువు పెంపు

ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో కన్వీనర్ కోటా ప్రవేశాల కోసం ఆన్‌‌లైన్ రిజిస్ట్రేషన్ గడువును కాళోజీ హెల్త్ వర్సిటీ పొడిగించింది. తొలత జూలై 25 వరకు రిజిస్ట్రేషన్ గడువు నిర్ణయించిన వర్సిటీ, విద్యార్థుల అభ్యర్థనలతో ఈ నెల 30 వరకు పొడిగిస్తూ జారీ చేసింది. 

ఎస్సీ గురుకులాల్లో 17 వేల సీట్లు భర్తీ

రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాల్లో ఈ ఏడాది 17 వేల సీట్లు భర్తీ చేశామని ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి ఓ పత్రిక ప్రకటనలో తెలిపారు. ఎంట్రన్స్ ఎగ్జామ్‌‌లో మెరిట్ ఆధారంగా, విద్యార్థుల ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుని సీట్లు కేటాయించినట్లు వెల్లడించారు. జంట నగరాల్లోని 11 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)లో 1,560 సీట్లలో 1,420 సీట్లు ఇప్పటికే భర్తీ అయ్యాయని చెప్పారు. 

వీటిలో అడ్మిషన్ కోసం 90 నుంచి -80% మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. జిల్లాల్లోని 26 సీవోఈల్లోనూ అడ్మిషన్లు చివరి దశకు చేరుకున్నాయన్నారు.  కరీంనగర్ రుక్మాపూర్ సైనిక్ స్కూల్‌‌లో 100% సీట్లు భర్తీ అయ్యాయని వెల్లడించారు. కొందరు జాయిన్ కాని సీట్లను ఈ నెల 31న స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేస్తామని తెలిపారు. గత ఐదేండ్లలో 79-నుంచి 91% సీట్లు భర్తీ అవుతున్నాయని, ఖాళీ సీట్ల వివరాలు www.tgswreis.telangana.gov.in వెబ్‌‌సైట్‌‌లో ఉన్నాయని సెక్రటరీ పేర్కొన్నారు.